హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజాపాలన గాడి తప్పిందని, ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై న్యాయ విచారణ చేయాలని, విద్యార్థుల చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని రౌండ్‌టేబుల్ సమావేశంలో పలువురు వక్తలు డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అధ్యక్షతన ‘ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల నివారణ’అనే అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జస్టిస్ ఈశ్వరయ్య, విద్యావేత్త చుక్కారామయ్య, ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్, ప్రొఫెసర్ పీఎల్. విశ్వేశ్వర్‌రావు, ప్రొఫెసర్ కంచ ఐలయ్య, కాసీంలతో పాటు పలువురు సామాజిక వేత్తలు, విద్యార్థి సంఘాల నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ ఇంటర్‌బోర్డు, గ్లోబరీనా సంస్థ చేసిన తప్పుల వల్ల 24 మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించడంతో పాటు ఇంటర్ విద్యార్థుల తల్లిదండ్రులకు నమ్మకం కలిగేలా చర్యలు చేపట్టాలని కోరారు. సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే అఖిలపక్షం ఏర్పాటుచేసి–మేధావులు, విద్యావంతులతో పరిష్కార మార్గాలు కనుగొనే చర్యలు తీసుకోవాలని సూచించారు. కంచ ఐలయ్య మాట్లాడుతూ..ఇంటర్ విద్యను రద్దు చేసి రానున్న విద్యాసంవత్సరం నుంచి 11వ తరగతి ప్రారంభించాలని డిమాండ్ చేశారు. 12వ తరగతి వరకూ హైస్కూల్స్ విద్య ద్వారా గ్రామాల్లోని పేద ప్రజలకు ఆర్థికంగా వెసులుబాటు ఉంటుందన్నారు.
ఈ ప్రపంచాన్ని మార్చే ఒకేఒక్క ఆయుధం విద్య అని అలాంటి విద్యను వ్యాపారంగా చేసి పేద ప్రజల జీవితాలతో ప్రభుత్వాలు, కార్పొరేట్ సంస్థలు చెలగాటమాడుతు న్నాయని మండిపడ్డారు. నారాయణ, చైతన్య లాంటి విద్యాసంస్థల్లో చదివిన ఏ ఒక్కరూ మేధావులు కాలేదని ఎద్దేవా చేశారు. విద్యార్థుల ఆత్మహత్యలను రాష్ట్ర హైకోర్టు సుమోటోగా స్వీకరించి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్ డిమాండ్ చేశారు. సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ నిర్బంధాలకు, విద్యార్థులపట్ల చూపుతున్న వైఖరికి నిరసనగా 48 గంటల్లో నగరంలో మహాధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆచార్య కాసీం మాట్లాడుతూ పాలకుల వల్లే విద్య వ్యాపారంగా మారిందని, తెలంగాణలో వ్యాపార ధోరణిలు పెట్రేగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పలు సంఘాల నేతలు విక్రంగౌడ్, నరేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఇంటర్ అవకతవకలపై న్యాయ విచారణ చేయాలి
Published Wed, May 1 2019 2:06 AM | Last Updated on Wed, May 1 2019 2:06 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment