ఈ ‘ప్రశ్నల’కు ఏదీ ‘జవాబు?’ | answer to questions | Sakshi
Sakshi News home page

ఈ ‘ప్రశ్నల’కు ఏదీ ‘జవాబు?’

Published Tue, Mar 25 2014 12:43 AM | Last Updated on Sat, Sep 2 2017 5:07 AM

ఈ ‘ప్రశ్నల’కు  ఏదీ ‘జవాబు?’

ఈ ‘ప్రశ్నల’కు ఏదీ ‘జవాబు?’

సాక్షి, కాకినాడ :
ఉన్న ఊళ్లో రూపాయికి దొరికే సరుకునే పొరుగూరు వెళ్లి అయిదుకో, పదికో కొనేవాడిని ఎవరైనా ఏమంటారు? ‘తెలివితక్కువ దద్దమ్మ’ అనో, ‘డబ్బు విలువ తెలియని దుబారా మనిషి’ అనో అంటారు.
 
 మరి, రూ.7.4 కోట్లతో అయ్యే ప్రక్రియకే రూ.43.2 కోట్లు వెచ్చించనున్న జేఎన్‌టీయూ కాకినాడకూ అవే మాటలు వర్తిస్తాయి. అయితే తక్కువ మొత్తంతో అయ్యే ప్రశ్నపత్రాల రూపకల్పన, జవాబుపత్రాల మూల్యాంకనల కోసం అయిదు రెట్లు అదనంగా ఖర్చు పెట్టడం వెనుక ఉన్నది కేవలం తింగరి తనమో, దుబారా తత్వమో కాదని, వర్సిటీ పెద్ద తలకాయ బంధువుకు చెందిన సంస్థకు మేలు కూర్చాలన్న దురాలోచనే ఇందుకు కారణమని ఆరోపణ వినిపిస్తోంది.
 
 అంతే కాక.. గతంలో వర్సిటీ పర్యవేక్షణలోనే జరిగిన ఆ ప్రక్రియను ఇప్పుడు ఒప్పందం పేరుతో ప్రైవేట్ సంస్థకు అప్పగించడం అంటే.. లక్షలాది మంది ఇంజనీరింగ్ విద్యార్థుల భవిష్యత్తును వారి చేతుల్లో పెట్టడమేనని విద్యారంగ నిపుణులు అంటున్నారు.   జేఎన్‌టీయూకే పరిధిలోని దాదాపు 270 కళాశాలల్లో సుమారు నాలుగు లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు.
 
వారికి ఏడాదికి రెండు సెమిస్టర్ల చొప్పున పరీక్షలు జరుగుతుంటాయి. వాటికి అవసరమైన ప్రశ్న పత్రాల రూపకల్పన, జవాబు పత్రాల మూల్యాంకనం (వాల్యుయేషన్) ఇంత వరకు వర్సిటీ పర్యవేక్షణలోనే జరిగేది. దీని నిమిత్తం నాలుగేళ్లకు రూ.7.4 కోట్లను వర్సిటీ వెచ్చించేది. ఇప్పుడు ఈ ప్రక్రియను గ్లోబరెనా టెక్నాలజీస్ ప్రైవేటు లిమిటెడ్ (జీటీపీఎల్)కు కట్టబెడుతూ ఒప్పందం కుదుర్చుకుంది.
 
దాని ప్రకారం వర్సిటీ పరిధిలో జరిగే పరీక్షల్లో ప్రశ్న పత్రాల తయారీ, జవాబు పత్రాల మూల్యాంకన బాధ్యతల్ని నాలుగేళ్ల పాటు జీటీపీఎల్, దానికి అనుబంధంగా పని చేసే మరో రెండు సంస్థలూ చేపడతాయి. దీని నిమిత్తం వర్సిటీ జీటీపీఎల్‌కు రూ.43.2 కోట్లు చెల్లిస్తుంది. అంతేకాదు..ఆ సంస్థ కేవలం ప్రశ్నపత్రాలను రూపొందించడం, జవాబు పత్రాల మూల్యాంకనం మాత్రమే చూస్తుంది. అందుకు అవసరమైన సాధన సంపత్తిని, మూల్యాంకన ప్రక్రియకు అవసరమైన వసతిని కూడా వర్సిటీయే సమకూర్చాల్సి ఉంటుంది.
 
డిసెంబర్లో కొన్న స్టాంపు పేపర్‌పై నవంబర్‌లోనే ఒప్పందం..
వర్సిటీ తరఫున రిజిస్ట్రార్ జీవీఆర్ ప్రసాదరాజు, సంస్థ తరఫున జీటీపీఎల్ సీఈఓ వీఎస్‌ఎన్ రాజు, సాక్షులుగా వర్సిటీ డెరైక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్ సీహెచ్ సాయిబాబా, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ సీహెచ్ సత్యనారాయణ, సంస్థ తరఫున విజయ్ ఎన్.రావు, బీఎస్‌వీఎస్ రామచందర్ సంతకాలు చేసిన ఒప్పందాన్ని 2013 నవంబర్‌లో రిజిస్టర్ చేసినట్టు చెపుతున్నారు.
 
వర్సిటీ నిర్వహణలో కేవలం రూ.7.4 కోట్లు మాత్రమే ఖర్చయిన ప్రక్రియకు సంబంధించి.. అంతకు అయిదు రెట్ల మొత్తానికి ఒప్పందం కుదుర్చుకోవడం వెనుక వర్సిటీలో అత్యున్నత బాధ్యతలు నిర్వర్తిస్తున్న వ్యక్తి ప్రమేయం ఉందన్న ఆరోపణ వినిపిస్తోంది. ఆ వ్యక్తి సోదరుడు జీటీపీఎల్‌లో భాగస్వామి అని, అస్మదీయుని లబ్ధికే ఇలా వర్సిటీ పర్యవేక్షణలో తక్కువ వ్యయంతో పూర్తయ్యే ప్రక్రియను అతి ఎక్కువకు నిర్వర్తించేలా నష్టదాయక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని వర్సిటీ వర్గాలే అంటున్నాయి.
 
ఈ ఒప్పందం వల్ల మునుముందు తమకు జీతాలు ఇవ్వడానికి వర్సిటీకి కష్టతరం కావచ్చని కొందరు ప్రొఫెసర్లు సాక్షితో అన్నారు. అంతేకాక .. వర్సిటీతో పాటు విద్యార్థుల జాతకం మొత్తాన్ని ప్రైవేట్‌పరం చేసే ఈ విధానాన్ని రాష్ట్రంలో మిగిలిన అన్ని వర్సిటీలూ వ్యతిరేకించాయంటున్నారు. కాగా జీటీపీఎల్ ఈ పాటికే మొదటి సెమిస్టర్ ఫలితాలు ఇచ్చేయాల్సి ఉండగా ఇంతవరకూ ఇవ్వలేక పోయిందని, చివరికి మే నెలాఖరుకు ఇస్తారన్న భరోసా కూడా లేదని అంటున్నారు.
 
కాగా వర్సిటీ, జీటీపీఎల్‌ల మధ్య ఒప్పందం 2013 నవంబర్‌లో కుదిరినట్టు ఉండగా అందుకోసం ఉపయోగించిన స్టాంపు పేపర్‌ను డిసెంబర్‌లో కొనుగోలు చేసినట్టు రికార్డయింది. మరి, డిసెంబర్‌లో కొన్న పత్రంపై నవంబర్‌లోనే ఒప్పందం ఎలా సాధ్యం, అసలు ఏమి ఆశించి విద్యార్థుల భవిష్యత్తును ప్రైవేట్ సంస్థ చేతుల్లో పెట్టారు అన్న ప్రశ్నలకు వర్సిటీ పెద్దలే జవాబు చెప్పాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement