సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు ఇంకా అనుబంధ గుర్తింపును ప్రకటించకున్నా కార్పొరేట్ కాలేజీలు మాత్రం నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులను చేర్చుకున్నాయి. కరోనా వైరస్ తాకిడి వల్ల ఓవైపు మిగతా విద్యాసంస్థలన్నీ మూతబడి ఉన్నా ఈ కాలేజీలు మాత్రం అప్పుడే ఒక్కో విద్యార్థి నుంచి రూ. 10 వేల చొప్పున అడ్వాన్స్‌లు వసూలు చేసి మరీ ఆన్‌లైన్ తరగతులు ప్రారంభించేశాయి. మరోవైపు ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, సాధారణ జూనియర్ కాలేజీలు ఏం చేయాలో అర్థంకాక ఆందోళనలో పడ్డాయి. కార్పొరేట్ కాలేజీల దెబ్బతో తమ కాలేజీల్లో ప్రవేశాలపై ప్రభావం పడే ప్రమాదం నెలకొందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఆగస్టులో మొదలు కావాల్సి ఉన్నా...
రాష్ట్రంలో 2,558 జూనియర్ కాలేజీలుండగా వాటిలో 1,583 ప్రైవేటు కాలేజీలు ఉన్నాయి. అందులో హాస్టల్ వసతిగల కార్పొరేట్ కాలేజీలు 570 వరకు ఉన్నాయి. వాటిల్లోనే ఏటా దాదాపు 3 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇప్పుడు ఆ కాలేజీలే ముందస్తుగా ప్రవేశాలను చేపట్టి తరగతులను ప్రారంభించేశాయి. వాస్తవానికి జూన్ 1 నుంచి జూనియర్ కాలేజీలు ప్రారంభం కావాలి. ద్వితీయ సంవత్సర తరగతులు కొనసాగాలి. కానీ కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా తరగతుల ప్రారంభం వాయిదా పడింది. మరోవైపు జూలై 20 వరకు అఫిలియేషన్ల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తయితే ఆ తరువాత అనుబంధ గుర్తింపు ఇస్తామని ఇంటర్ బోర్డు ప్రకటించింది. అంటే ఆగస్టులోనే ప్రథమ సంవత్సర తరగతులు ప్రారంభం కావాల్సి ఉంది. అయినా కార్పొరేట్ కాలేజీలు అప్పుడే ఆన్‌లైన్ తరగతులను ప్రారంభించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అనుబంధ గుర్తింపుపై స్పష్టత రాకున్నా..
రాష్ట్రంలోని కార్పొరేట్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు ప్రమాదం పొంచి ఉంది. గతేడాది ఇంటర్ బోర్డు నిబంధనలను పాటించని భవనాల్లో కొనసాగుతున్న 68 కాలేజీలను హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు ఆ కాలేజీలు వేరే భవనాల్లోకి వెళ్తేనే వాటికి అనుబంధ గుర్తింపు వచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే వాటిల్లో ప్రవేశాలు చేపట్టడానికి వీల్లేదు. అయితే కొత్తగా ఏ కాలేజీకి అనుబంధ గుర్తిం పు వస్తుందో, ఏయే కాలేజీలకు అనుబంధ గుర్తింపు రాదో తెలియని పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ కార్పొరేట్ కాలేజీలు మాత్రం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశాలను చేపట్టి తల్లిదండ్రుల నుంచి ఫీజులను దండుకుంటున్నాయి. ఇంత జరుగుతున్న ఇంటర్ బోర్డు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి.
రాయితీల పేరిట టెస్టులు..
రాయితీల పేరుతోనూ కార్పొరేట్ కాలేజీలు తల్లిదండ్రులను మోసం చేస్తున్నా యి. తమ కాలేజీలో చేరేందుకు, ఫీజు రాయితీ పొందేందుకు ముందుగా రూ. 10 వేలు చెల్లించాల్సిందేననన్న నిబంధనను విధించి తల్లిదండ్రుల నుంచి డబ్బు దండుకుంటున్నాయి. కరోనా కారణంగా ఈసారి టెన్త్ విద్యార్థులందరినీ ప్రభుత్వం పరీక్షల్లేకుండానే పాస్ చేయగా కార్పొరేట్ కాలేజీలు మాత్రం తాము పెట్టే టెస్టులో టాప్ మార్కులు వచ్చిన వారికి ఫీజులో రాయితీ ఇస్తామంటూ పరీక్షలను నిర్వహిస్తున్నా యి. ఇటీవల నిజాంపేటలో ఓ కార్పొరేట్ కాలేజీ అడ్మిషన్ టెస్టు పెట్టగా విద్యార్థి సంఘాలు అడ్డుకున్నాయి. అయినా టెస్టు ల పరంపర కొనసాగుతూనే ఉంది.
కఠిన చర్యలు తీసుకోవాలి...
ఇంటర్ తరగతుల ప్రారంభంపై ప్రభుత్వం నిర్ణయమే తీసుకోలేదు. అయినా కార్పొరేట్ కాలేజీలు ఆన్‌లైన్ పేరుతో పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నాయి. భారీగా డబ్బు గుంజుతున్నా 4 వేల మంది అధ్యాపకులను ముందస్తు నోటీసులు లేకుండా తొలగించాయి. ఈ చర్యలకు పాల్పడిన కాలేజీలపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాలి.
– డాక్టర్ పి.మధుసూదన్‌రెడ్డి, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment