సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కారణంగా 27 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. జీరో అవర్ చర్చలో భాగంగా తెలంగాణ ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల అంశాన్ని బుధవారం లోక్‌సభలో ఆయన ప్రస్తావించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...సీఎం కేసీఆర్ విద్యను కేవలం వ్యాపార దృక్పథంతో చూస్తూ.. అనుభవం లేని గ్లోబరీనా వంటి సంస్థకు ఫలితాల విడుదలు చేసే బాధ్యతను అప్పగించారని మండిపడ్డారు. రాష్ట్రంలో 9 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైతే 3 లక్షలమంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గవర్నర్ నిక్కచ్చిగా వ్యవహరించాలని పేర్కొన్నారు. ముగ్గురు సభ్యుల కమిటీ పూర్తిస్థాయి నివేదిక ఇచ్చినప్పటికీ ప్రభుత్వం ఇంకా చర్యలు తీసుకోలేదని విమర్శించారు.
బీజేపీ పోరాటం ఆపదు..
సీఎం కేసీఆర్ పాలన నీరో చక్రవర్తిలా సాగుతుందని ఎంపీ సంజయ్ దుయ్యబట్టారు. పెద్దింట్లో చనిపోయిన వారిని పరామర్శించేందుకు సమయం ఉండే ముఖ్యమంత్రికి.. ఇంటర్ విద్యార్థుల తల్లిదండ్రులను పరామర్శించేందుకు మాత్రం సమయం ఉండదా అని ప్రశ్నించారు. ఇంటర్ ఫలితాల అవకతవకలపై ప్రభుత్వపరంగా ఎలాంటి చర్యలు తీసుకున్నారో ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ప్రభుత్వం స్పందించేంత వరకు బీజేపీ పోరాడుతూనే ఉంటుందని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment