ఇంటర్‌ బోర్డు ఫెయిల్‌ | Telangana Intermediate Board Mistakets In Results | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ బోర్డు ఫెయిల్‌

Published Sun, Apr 21 2019 1:02 AM | Last Updated on Sun, Apr 21 2019 8:13 AM

Telangana Intermediate Board Mistakets In Results - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అడ్డగోలుగా వ్యవహరించారంటూ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ఇంటర్మీడియట్‌ బోర్డు తప్పిదాలు ఒక్కొక్కటిగా బయటపడు తున్నాయి. బోర్డు ద్వారా భారీ స్థాయిలోనే తప్పిదాలు జరిగినట్లు తెలుస్తోంది. పరీక్షలకు హాజరైన అభ్యర్థులను కూడా గైర్హాజరయ్యారని పేర్కొంటూ వారిని ఫెయిల్‌ చేయడంపైనా తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విధంగా ఫెయిలైన వారిలో ఎక్కువ మంది టాప్‌ మార్కులు సాధించే విద్యార్థులే ఉండటం గమనార్హం. ఇంటర్మీడియట్‌ బోర్డు తప్పిదా లను ఎత్తిచూపుతూ పిల్లల తల్లిదండ్రులు శని వారం పెద్దసంఖ్యలో ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ సందర్భంగానే బోర్డు లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. విద్యార్థులు పరీక్షకు హాజరైనా.. గైర్హాజరయ్యారంటూ ఫెయిల్‌ చేయడం.. ప్రథమ సంవత్సరంలో 90% పైగా మార్కులు సాధించిన విద్యార్థులను సెకండ్‌ ఇయర్‌లో సింగిల్‌ డిజిట్‌ మార్కులకు పరి మితం చేయడం వంటి తప్పిదాలెన్నో ఒక్కొక్క టిగా బయటపడుతున్నాయి. కాగా, బోర్డు తప్పిదాలతో శనివారం నలుగురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దీంతో మూడ్రోజుల్లో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య 12కు చేరుకుంది.

ఎందరు గైర్హాజరయ్యారు?
ఇంటర్మీడియట్‌ ఫలితాలను పూర్తి పారదర్శకంగా ప్రకటించినట్లు బోర్డు కార్యదర్శి అశోక్‌ కుమార్‌ శుక్రవారం ప్రకటించారు. ముగ్గురు విద్యార్థుల విషయంలో పొరపాట్లు జరిగాయని అంగీకరిస్తూ.. వాటిని సరిచేస్తా మని వెల్లడించారు. కానీ ఇలాంటి వారి సంఖ్య వేలల్లోనే ఉందంటూ పెద్ద సంఖ్యలో విద్యార్థుల తల్లిదండ్రులు శనివారం బోర్డు ముందు నిర్వ హించిన నిరసన కార్యక్రమంలో ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయా కాలేజీల్లో టాపర్లుగా ఉన్న విద్యార్థులు తాజాగా ఫెయిల్‌ కావడం వారి కాలేజీ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఫెయిలైన సబ్జెకును మినహాయిస్తే మొత్తంగా వారి మార్కులు 900 దాటడం గమనార్హం. కొందరు విద్యార్థులకు పలు సబ్జెక్టుల్లో నూటికి నూరుశాతం మార్కులొచ్చినా ఒక సబ్జెక్టులో మాత్రం అనూహ్యంగా 15%–20% మార్కులు రావడంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అన్నింట్లో గరిష్టంగా మార్కులు సాధించి.. ఒక సబ్జెక్టులో ఫెయిలవడంపైనా తల్లిదండ్రులు తీవ్రంగా స్పందిస్తున్నారు. మూల్యాంకనంలో పొరపాట్లు చేసి వాటికి విద్యార్థులను బలిచేస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరైనా.. ఫలితాల్లో మాత్రం పాస్‌ (ఏపీ)అని చూపించారు. మరికొందరు అన్ని పరీక్షలు రాసినా ఫలితాల్లో మాత్రం ఆబ్సెంట్‌ ఫెయిల్‌ (ఏఎఫ్‌)గా చూపించడం గందరగోళం సృష్టిస్తోంది.

జాగ్రఫీ విద్యార్థుల అయోమయం
మరోవైపు, ఆర్ట్స్‌ విద్యార్థులు ఫలితాలు నివ్వెరపరుస్తున్నాయి. ఆర్ట్స్, హ్యుమానిటీస్‌ కోర్సుల్లో జాగ్రఫీ ఉన్న విద్యార్థుల పరిస్థితి అయోమయంగా మారింది. ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో జాగ్రఫీ థియరీతో పాటు ప్రాక్టికల్‌ మార్కులను పరిగణలోకి తీసుకోవల్సి ఉండగా.. కొందరికి ప్రాక్టికల్‌ మార్కులు యాడ్‌ కాలేదు. దీంతో వారి స్కోర్‌ భారీగా తగ్గింది. కొందరికి ప్రాక్టికల్‌ మార్కులు జాబితాలో చూపుతున్నా మొత్తం మార్కులతో లెక్కించలేదు.

ఆర్‌వీ, ఆర్సీకి దరఖాస్తు చేసుకొండి
ఇన్ని తప్పిదాలు కళ్లముందు కనబడుతున్నా.. ఇంటర్మీడియట్‌ బోర్డు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. తప్పిదాలపై తమను ప్రశ్నించాలనుకున్న తల్లిదండ్రులను కనీసం కార్యాలయం లోపలకు అనుమతించలేదు. అంతేకాదు.. కనీసం బోర్డు తరఫున ప్రతినిధులెవరూ వారికి సమాధానం ఇవ్వలేదు. అసలు ఇదేం పెద్ద సమస్యే కాదన్నట్లు వ్యవహరిస్తూ.. సాయంత్రం తాపీగా ఓ ప్రకటన విడుదల చేసింది. ‘ప్రతిఏడాది మాదిరిగానే డేటా క్యాప్చరింగ్‌ను ప్రభుత్వ రంగ సంస్థ సీజీజీ ద్వారా చేయించాం. సాంకేతిక అర్హత, ప్రభుత్వ అనుమతి ఉన్న ‘గ్లోబరీనా ఏజెన్సీ’ద్వారా హాల్‌టిక్కెట్లు జారీచేసి.. ఫలితాలను ప్రాసెసింగ్‌ చేశాం. శనివారం విద్యార్థుల తల్లిదండ్రులు బోర్డుకు 146 ఫెయిల్‌ మార్కులు సమర్పించారు. వాటిని నిర్ధారించి వివరాలు వారికి తెలియజేశాం. ఫలితాల్లో ఎలాంటి పొరపాట్లు దొర్లలేదు. మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవం. అనుమానాలు, అపోహలుంటే రూ.600 చెల్లించి ఆర్‌వీ (రీ–వెరిఫికేషన్‌)కి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి. రీ–కౌంటింగ్‌(ఆర్‌సీ)కు రూ.100 చొప్పున సబ్జెక్టుకు చెల్లించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దు. వదంతులు నమ్మొద్దు. ఏదైనా సమాచారం కావాలంటే 040–24600110 ఫోన్‌ నెంబర్‌లో లేదా బోర్డు వెబ్‌సైట్‌లో లేదా జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాధికారి (డీఐఈఓ)ను సంప్రదించాలి’అని పేర్కొంది.
 
అనర్హులతో మూల్యాంకనమా?

ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో వెల్లడైన తప్పిదాలపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. పేపర్లు దిద్దకుండానే కంప్యూటర్ల మీద కూర్చుని మార్కులు సరిచేశారని ఆరోపించారు. పేపర్లు దిద్దకుండా మార్కులెలా వేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం నాంపల్లిలోని తెలంగాణ ఇంటర్మీడియట్‌ బోర్డు ఎదుట తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు, ఫెయిలైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ధర్నా చేపట్టారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బోర్డు ఎదుట బైఠాయించి నిరసన తెలియజేశారు. జవాబుపత్రాల ముల్యాంకనం అడ్డగోలుగా, అశాస్త్రీయంగా జరిగిందని.. అర్హులతో కాకుండా పదోతరగతి, ఇంటర్‌ చదవిన వారితో జవాబు పత్రాలను దిద్దించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యుత్తమ ప్రతిభ కనబర్చే విద్యార్థులు ఒకట్రెండు మార్కులకు పరిమితం చేశారని, బోర్డు చేసిన తప్పిదంతో విద్యార్థులు డిప్రెషన్‌లోకి వెళ్లే పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. రాష్ట్రం నలుమూలల నుంచి బాధిత విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్దఎత్తున నాంపల్లికి చేరుకోవడంతో విద్యార్థులను అదుపు చేయడం పోలీసులకు కష్టంగా మారింది. ఆందోళనకారులను బోర్డు కార్యాలయంలోకి వెళ్లనీయకుండా గేట్‌లకు తాళాలు వేశారు. దీంతో విద్యార్థుల తల్లిందండ్రుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఫలితాల్లో పొరపాట్లకు బోర్డు అధికారులే బాధ్యత వహించాలని నినాదాలు చేశారు. బోర్డు కార్యదర్శి వచ్చి స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి
బోర్డు వ్యవహారం లోపభూయిష్టంగా మారిందని, పరీక్షకు హాజరైన విద్యార్థులను గైర్హాజరైనట్లుగా మెమోలో పేర్కొన్నారని తల్లిదండ్రులు మండిపడ్డారు. మెరిట్‌ స్టూడెంట్లకు సున్నా మార్కులు సాధ్యమేనా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి తప్పిదాలు గతంలో కూడా జరిగాయని, అధికారులు మాత్రం తప్పులు సరిదిద్దుకోకుండా నిర్లక్ష ధోరణితో వ్యవహరిస్తున్నారని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. అవినీతి, అక్రమాలకు పాల్పడిన బోర్డు అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బయటకు వచ్చిన బోర్డు కార్యదర్శి అశోక్‌ను ఈ సందర్భంగా విద్యార్థులు ఘెరావ్‌ చేశారు.

బోర్డు కార్యదర్శిని సస్పెండ్‌ చేయండి: బీజేవైఎం
ఇంటర్‌ విద్యార్థుల పేపర్ల మూల్యాంకనాన్ని థర్డ్‌ పార్టీకి అప్పగించి అమాయక విద్యార్థులకు తీరని అన్యాయం చేశారని బీజేవైఎం మండిపడింది. ఈ మూల్యాంకనంపై వెంటనే న్యాయవిచారణ చేపట్టాలని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భరత్‌ గౌడ్‌ డిమాండ్‌ చేశారు. బోర్డు తప్పిదాలతో ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రీ–వెరిఫికేషన్‌ కోసం రూ.600 ఫీజు కట్టుకోవాలంటూ బోర్డు కార్యదర్శి అశోక్‌ సూచించడాన్ని తీవ్రంగా ఖండించారు. బోర్డు అధికారులు తప్పుచేస్తే విద్యార్థులు రీ–వెరిఫికేషన్‌కు ఫీజు ఎందుకు కట్టాలని ప్రశ్నించారు. విద్యార్థుల నుంచి ఇలా ఫీజు వసూలు చేయకుండా అడిగిన వారందరి పేపర్లు ఉచితంగానే దిద్దించాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని.. తెలంగాణ ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌ను సర్వీస్‌ నుంచి తొలగించేంతవరకు ఆందోళన కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.

ఫస్టియర్‌లో 92%తో పాసయినా..
ఇంటర్మీడియట్‌ ఫస్టియర్‌లో మా అబ్బాయికి 92% మార్కులు వచ్చాయి. కానీ సెకండియర్‌ ఫలితాల్లో మాత్రం రెండు సబ్జెక్టులు ఫెయిల్‌ చేశారు. గణితంలో రెండు, మూడు మార్కులు చొప్పున వేశారు. 90%కు పైగా మార్కులు వచ్చిన వాడికి రెండు, మూడు మార్కులెలా వస్తాయి? – రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ విద్యార్థి తండ్రి

రెండింటికీ డబ్బులు కట్టాలట
మా అబ్బాయికి మూడు సబ్జెక్టుల్లో బార్డర్‌ మార్కులు వేశారు. వాస్తవానికి ఫస్టియర్‌లో 89% మార్కులు వస్తే.. సెకండియర్‌లో మాత్రం బార్డర్‌ మార్కులెలా వస్తాయి? నిర్లక్ష్యంగా పేపర్లు దిద్దడంతోనే ఇలా జరిగింది. రీ–వెరిఫికేషన్‌ కోసం దరఖాస్తు చేసుకోండని బోర్డు అధికారులు సలహా ఇస్తున్నారు. వాటి ఫలితాలు 15రోజుల్లో ఇస్తామంటున్నారు. మరోవైపు ఇంప్రూవ్‌మెంట్‌కు గడువు ఈనెల 25వరకే ఉంది. రీ–వెరిఫికేషన్‌ వివరాలు రాకుండానే ఇంప్రూవ్‌మెంట్‌కు ఎలా వెళ్లాలి? గడువు తేదీని పెంచాలని అడిగితే.. రెండింటికీ డబ్బులు కట్టుకోమంటున్నారు – మేడ్చల్‌ జిల్లాకు చెందిన విద్యార్థి తల్లి

విచారణ చేపట్టాలి.
ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో నెలకొన్న తప్పిదాలపై ప్రభుత్వం పూర్తిస్థాయి విచారణ చేపట్టాలి. ఈ అక్రమాలకు కారకులను గుర్తించి చర్యలు తీసుకోవాలి. అధికారులు చేసిన పొరపాట్లకు విద్యార్థులు బలవుతున్నారు. ఏడాదంతా చదివిన పిల్లల్ని ఒకేసారి పాతాళంలోకి నెడితే ఎలా? చాలామంది మానసిక ఒత్తిడికి గురై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని చర్యలు చేపట్టకుంటే ఆందోళన తీవ్రం చేస్తాం. – హైదరాబాద్‌ జిల్లా విద్యార్థి తండ్రి
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement