అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు తగదు
-
కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి
-
విరమించుకోకపోతే ఆమరణ దీక్ష
కావలి:
జన జీవనాన్ని సర్వనాశనం చేసే అణు విద్యుత్ కేంద్రాన్ని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి ప్రాంతంలో ఏర్పాటు చేయబోయే ప్రయత్నాన్ని ప్రభుత్వం విరమించకోకపోతే ఆమరణ దీక్ష చేపడతానని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. కావలిలోని ఆయన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. అణు విద్యుత్ కేంద్రాలను గుజరాత్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాలు వ్యతిరేకిస్తే మన రాష్ట్రం కావలిలో ఏర్పాటు చేస్తాననడం దారుణమన్నారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబునాయుడు స్వయంగా ప్రకటించడం చూస్తుంటే కావలిపై ఆయనకు ఎంత కక్ష ఉందో తెలుస్తుందన్నారు. కావలిలోని టీడీపీ నేతలు ఈ విషయంపై ఎందుకు స్పందించ లేదని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఇక్కడ ఏర్పాటు చేయనున్న అణు విద్యుత్ కేంద్రం ద్వారా 6,660 మెగావాట్ల విద్యుదుత్పతి చేయాలని సీఎం చూస్తున్నారని తెలిపారు. ఈ కేంద్రంలో ఏదైనా ప్రమాదం జరిగితే 100 కిలో మీటర్ల వరకు దీని ప్రభావం ఉంటుందని తెలిపారు. రేడియేషన్ వ్యాపించి జీవరాసులు అంతమవుతామన్నారు. ఈ విషయాన్ని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్స్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ప్రాణాలు అడ్డుపెట్టి అయినా ప్రజల కోసం అణు విద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా పార్టీ తరపున పోరాడుతానని ఎమ్మెల్యే ప్రకటించారు. ప్రజల జీవితాలతో ఆడుకునే ప్రయత్నం చేయవద్దని ముఖ్యమంత్రికి కావలి ప్రజల తరుపున చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. సమావేశంలో కావలి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కనమర్లపూడి వెంకటనారాయణ, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి, డీఆర్‌యూసీసీ సభ్యుడు కుందుర్తి కామయ్య, జిల్లా కార్యదర్శి గంధం ప్రసన్నాంజనేయులు, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు జంపాని రాఘవులు, కౌన్సిలర్ ఎం.శ్రీనివాసులు పాల్గొన్నారు.