atomic power plant
-
అణు వ్యతిరేక ఉద్యమం తప్పదు
నెల్లూరు, ప్రకాశం జిల్లా ప్రజలతో ఐక్యపోరాటాలు నెల్లూరు(అర్బన్): నెల్లూరు, ప్రకాశం జిల్లాల సరిహద్దులో కావలి పట్ణణానికి సమీపంలో నిర్మించనున్న అణువిద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని పలు ప్రజాసంఘాల నాయకులు, మేధావులు ప్రకటించారు. ఆదివారం స్థానిక హరనాథపురంలోని డాక్టర్ జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో జనవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో ‘అణువిద్యుత్కేంద్రం–పొంచి ఉన్న ప్రమాదం’ అనే అంÔ¶ ంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం చర్చను ప్రారంభించారు. ప్రపంచ దేశాలు వరుస బెట్టి అణువిద్యుత్ కేంద్రాలను మూసేస్తున్నాయని తెలిపారు. దేశంలో గుజరాత్లో అణువిద్యుత్ కేంద్రాన్ని నిర్మించదలిస్తే అక్కడి ప్రజలు ఉద్యమించి అడ్డుకోవడంతో ఆ ప్రాజెక్టును తెచ్చి కావలి సమీపంలో ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పూనుకుందన్నారు. ఈ విషయంపై మేధావులు, శాస్త్రవేత్తలు, ఇంజనీర్లతో మహాసదస్సును ఏర్పాటు చేసి అణు ప్రమాదం గురించి ప్రజల్లో చర్చ జరపాలని సభ్యులకు సూచించారు. ప్రకాశం జిల్లాలో రైతులు కూడా ఉద్యమాల్లో పాల్గొనేందుకు ముందుకు వచ్చారని , నెల్లూరు ప్రజలను కలుపుకుని ఐక్యఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం గురించి తెలిపారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్, అంకాలజి డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ ఎం.శ్రీనివాస్ మాట్లాడుతూ రష్యాలోని చెర్నోబిల్‌లో జరిగిన ఘటనలో ఇప్పటికీ అక్కడి ప్రజలు తీరని బాధలు అనుభవిస్తున్నారని తెలిపారు. పుట్టే పిల్లల్లో 95 శాతం ఏదో ఒక లోపంతో పుడుతున్నారని తెలిపారు. అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్‌లో అణుకర్మాగారాలను మూసేస్తుంటే అలాంటి వాటిని మన రాష్ట్రంలో ఏర్పాటు చేయాలను కోవడం బాధాకరమన్నారు. ఎల్ఐసీ యూనియన్ డివిజన్ కార్యదర్శి ఆర్.నగేష్ మాట్లాడుతూ ఉద్యమానికి తమ వంతు సహకారమందిస్తామన్నారు. జేవీవీ ఆరోగ్య సబ్ కమిటీ కన్వీనర్ డాక్టర్ శ్రీనునాయక్ మాట్లాడుతూ అణు కర్మాగారం ఆగేంతవరకు పోరాటం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి మోహన్‌రావు, సీపీఐ నాయకులు ఆంజనేయులు, వ్యవసాయ సంఘం నాయకులు బలిజేపల్లి వెంకటేశ్వర్లు, జేవీవీ రాష్ట్ర నాయకులు మాల్యాద్రి, డాక్టర్లు ఎంవీ రమణయ్య, దత్తాత్రేయ, మెడికల్ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ భక్తవత్సలం, జేవీవీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బుజ్జయ్య, భాస్కర్‌రావు, ఆర్టీసీ యూనియన్ నాయకులు దశరథరామిరెడ్డి, ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చలపతి, బద్దెపూడి శ్రీనివాసులు పాల్గొన్నారు. -
అణు విద్యుత్ కేంద్రాన్ని అడ్డుకునేందుకు యత్నాలు
కావలిరూరల్: కావలిలో అణువిద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనివ్వకూడదని సంకల్పించిన ఎమ్మెల్యే తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో పోరాటానికి ప్రణాళికలు తయారు చేసుకుంటున్న ఆయన బుధవారం ఢిల్లీ వెళ్లారు. అక్కడ నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఒంగోలు ఎంపీ వై.వి.సుబ్బారెడ్డిలను కలిశారు. అణువిద్యుత్ వల్ల జనజీవనానికి ఏవిధంగా ముప్పు వాటిల్లుతుందో పార్లమెంటు దృష్టికి తీసుకుకెళ్లేందుకు వారి సహాయాన్ని కోరారు. లోక్‌సభలోనే అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటుపై పూర్తి వివరాలు చెప్పాలని కేంద్ర ప్రభుత్వం ద్వారా తెలుసుకునేందుకు లోక్‌సభ సెక్రటేరియట్లో అడిగేందుకు ఇరువురు ఎంపీలను లిఖితపూర్వకంగా అడిగారు. కావలి పట్టణానికి సమీపంలో ఉన్న రామాయపట్నంలో పోర్టు కమ్ షిప్‌యార్డును ఏర్పాటు చేస్తే కావలి ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, పోర్టు ఏర్పాటుకు కృషిచేయాలని ఈ సందర్భంగా ఎంపీలను ఎమ్మెల్యే కోరారు. పోర్ట్ కమ్ షిప్‌యార్డు నిర్మాణం గురించి కేంద్రమంత్రి నితిన్‌గడ్కారి అపాయింట్మెంట్ కోసం ఆయన ప్రయత్నిస్తున్నారు. -
అణు ప్లాంట్లను వ్యతిరేకించాలి
నెల్లూరు(అర్బన్): సమాజానికి పొంచి ఉన్న ముప్పును అరికట్టాలంటే ప్రమాదకరమైన అణు ప్లాంట్లను ప్రజలు వ్యతిరేకించాలని ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం విజ్ఞప్తి చేశారు. జనవిజ్ఞానవేదిక నగర కమిటీ ఆధ్వర్యంలో స్థానిక బాలాజీనగర్‌లోని ఆదిత్య డిగ్రీ కళాశాలలో మంగళవారం హిరోషిమా.. నాగసాకి డే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అణుధార్మిక విస్పోటనం వల్ల కలిగే నష్టాలను వివరించారు. జనవిజ్ఞానవేదిక ఆరోగ్య సబ్‌కమిటీ జిల్లా కన్వీనర్ డాక్టర్ శ్రీనునాయక్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అణుధార్మికత వల్ల కలిగే నష్టాలను వివరించారు. కార్యక్రమంలో ఆ వేదిక నగర అధ్యక్ష, కార్యదర్శులు విద్యాచరణ్, మాదాల రాము, కోశాధికారి మోహన్‌రెడ్డి, నాయకులు విజయకుమార్, విజయ, ఆదిత్య కళాశాల కరస్పాండెంట్ ఆచార్య ఆదిత్య పాల్గొన్నారు. -
అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు తగదు
కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి విరమించుకోకపోతే ఆమరణ దీక్ష కావలి: జన జీవనాన్ని సర్వనాశనం చేసే అణు విద్యుత్ కేంద్రాన్ని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి ప్రాంతంలో ఏర్పాటు చేయబోయే ప్రయత్నాన్ని ప్రభుత్వం విరమించకోకపోతే ఆమరణ దీక్ష చేపడతానని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. కావలిలోని ఆయన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. అణు విద్యుత్ కేంద్రాలను గుజరాత్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాలు వ్యతిరేకిస్తే మన రాష్ట్రం కావలిలో ఏర్పాటు చేస్తాననడం దారుణమన్నారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబునాయుడు స్వయంగా ప్రకటించడం చూస్తుంటే కావలిపై ఆయనకు ఎంత కక్ష ఉందో తెలుస్తుందన్నారు. కావలిలోని టీడీపీ నేతలు ఈ విషయంపై ఎందుకు స్పందించ లేదని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఇక్కడ ఏర్పాటు చేయనున్న అణు విద్యుత్ కేంద్రం ద్వారా 6,660 మెగావాట్ల విద్యుదుత్పతి చేయాలని సీఎం చూస్తున్నారని తెలిపారు. ఈ కేంద్రంలో ఏదైనా ప్రమాదం జరిగితే 100 కిలో మీటర్ల వరకు దీని ప్రభావం ఉంటుందని తెలిపారు. రేడియేషన్ వ్యాపించి జీవరాసులు అంతమవుతామన్నారు. ఈ విషయాన్ని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్స్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ప్రాణాలు అడ్డుపెట్టి అయినా ప్రజల కోసం అణు విద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా పార్టీ తరపున పోరాడుతానని ఎమ్మెల్యే ప్రకటించారు. ప్రజల జీవితాలతో ఆడుకునే ప్రయత్నం చేయవద్దని ముఖ్యమంత్రికి కావలి ప్రజల తరుపున చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. సమావేశంలో కావలి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కనమర్లపూడి వెంకటనారాయణ, వైఎస్సార్సీపీ రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి, డీఆర్‌యూసీసీ సభ్యుడు కుందుర్తి కామయ్య, జిల్లా కార్యదర్శి గంధం ప్రసన్నాంజనేయులు, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు జంపాని రాఘవులు, కౌన్సిలర్ ఎం.శ్రీనివాసులు పాల్గొన్నారు.