అణు వ్యతిరేక ఉద్యమం తప్పదు
-
నెల్లూరు, ప్రకాశం జిల్లా ప్రజలతో ఐక్యపోరాటాలు
నెల్లూరు(అర్బన్):
నెల్లూరు, ప్రకాశం జిల్లాల సరిహద్దులో కావలి పట్ణణానికి సమీపంలో నిర్మించనున్న అణువిద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని పలు ప్రజాసంఘాల నాయకులు, మేధావులు ప్రకటించారు. ఆదివారం స్థానిక హరనాథపురంలోని డాక్టర్ జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో జనవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో ‘అణువిద్యుత్‌కేంద్రం–పొంచి ఉన్న ప్రమాదం’ అనే అంÔ¶ ంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం చర్చను ప్రారంభించారు.
ప్రపంచ దేశాలు వరుస బెట్టి అణువిద్యుత్ కేంద్రాలను మూసేస్తున్నాయని తెలిపారు. దేశంలో గుజరాత్‌లో అణువిద్యుత్ కేంద్రాన్ని నిర్మించదలిస్తే అక్కడి ప్రజలు ఉద్యమించి అడ్డుకోవడంతో ఆ ప్రాజెక్టును తెచ్చి కావలి సమీపంలో ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పూనుకుందన్నారు. ఈ విషయంపై మేధావులు, శాస్త్రవేత్తలు, ఇంజనీర్లతో మహాసదస్సును ఏర్పాటు చేసి అణు ప్రమాదం గురించి ప్రజల్లో చర్చ జరపాలని సభ్యులకు సూచించారు. ప్రకాశం జిల్లాలో రైతులు కూడా ఉద్యమాల్లో పాల్గొనేందుకు ముందుకు వచ్చారని , నెల్లూరు ప్రజలను కలుపుకుని ఐక్యఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం గురించి తెలిపారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్, అంకాలజి డిపార్ట్‌మెంట్ హెడ్ డాక్టర్ ఎం.శ్రీనివాస్ మాట్లాడుతూ రష్యాలోని చెర్నోబిల్‌లో జరిగిన ఘటనలో ఇప్పటికీ అక్కడి ప్రజలు తీరని బాధలు అనుభవిస్తున్నారని తెలిపారు.
పుట్టే పిల్లల్లో 95 శాతం ఏదో ఒక లోపంతో పుడుతున్నారని తెలిపారు. అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్‌లో అణుకర్మాగారాలను మూసేస్తుంటే అలాంటి వాటిని మన రాష్ట్రంలో ఏర్పాటు చేయాలను కోవడం బాధాకరమన్నారు. ఎల్‌ఐసీ యూనియన్ డివిజన్ కార్యదర్శి ఆర్.నగేష్ మాట్లాడుతూ ఉద్యమానికి తమ వంతు సహకారమందిస్తామన్నారు. జేవీవీ ఆరోగ్య సబ్ కమిటీ కన్వీనర్ డాక్టర్ శ్రీనునాయక్ మాట్లాడుతూ అణు కర్మాగారం ఆగేంతవరకు పోరాటం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి మోహన్‌రావు, సీపీఐ నాయకులు ఆంజనేయులు, వ్యవసాయ సంఘం నాయకులు బలిజేపల్లి వెంకటేశ్వర్లు, జేవీవీ రాష్ట్ర నాయకులు మాల్యాద్రి, డాక్టర్లు ఎంవీ రమణయ్య, దత్తాత్రేయ, మెడికల్ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ భక్తవత్సలం, జేవీవీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బుజ్జయ్య, భాస్కర్‌రావు, ఆర్‌టీసీ యూనియన్ నాయకులు దశరథరామిరెడ్డి, ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చలపతి, బద్దెపూడి శ్రీనివాసులు పాల్గొన్నారు.