పట్టపగలు అందరూ చూస్తుండగా అత్యంత ఘోరమైన నేరాలు, ఘోరాలు జరిగినా దోషులు దర్జాగా తప్పించుకోవచ్చునని నిరూపించిన సిక్కుల ఊచకోత ఉదంతాల్లో తొలిసారి ఒక బడా కాంగ్రెస్ నాయకునికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ఆ పార్టీకి చెందిన మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ తన శేష జీవితాన్ని జైల్లో గడపాలంటూ ఢిల్లీ హైకోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. రాజకీయ ప్రాపకం ఉన్న నేరగాళ్ల ముందు అధికార వ్యవస్థలన్నీ సాగిలబడుతున్న తీరును నిశితంగా విమర్శించింది. ఈ కారణం వల్లనే ఒక దాని తర్వాత మరో ఊచకోత అడ్డూ ఆపూ లేకుండా కొనసాగుతున్నాయని అభిప్రాయపడింది. వీటిపై ఒక చట్టం తీసుకురాలేని పాలకుల తీరును ప్రశ్నించింది. ముంబైలో 1993లో జరిగిన నరమేథం, 2002నాటి గుజరాత్ నరమేథం, 2008లో ఒదిశాలోని కంథమాల్‌లో చోటుచేసుకున్న దురంతం, 2013నాటి ముజఫర్‌నగర్ మూకుమ్మడి హత్యకాండలను ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఈ తీర్పులో ప్రస్తావించిన సిగ్గుమాలిన ఉదంతాలన్నీ దిగ్భ్రాంతి కలిగించేవే.
ఎందులోనూ బాధిత కుటుంబాలకు సరైన న్యాయం లభిం చలేదు. అది లేకపోగా కోర్టు మెట్లెక్కినందుకు సకల వ్యవస్థలూ కక్షబూని వేటకుక్కల్లా వెంటబడి వేధించిన వైనం తాజా కేసులో వెల్లడవుతుంది. తన తండ్రిని కళ్లముందే నిప్పంటించిన ఉదంతాన్ని చూసి, వారికి శిక్ష పడేలా చేయాలని ప్రయత్నించిన నిర్‌ప్రీత్ కౌర్‌పై ఒక దాని తర్వాత మరో కేసు బనాయించారు. చేయని నేరానికి వివిధ జైళ్లలో ఆమె తొమ్మిదేళ్లపాటు మగ్గింది. ఆమెపై అత్యంత కఠినమైన టాడా చట్టం కింద రెండు కేసులు పెట్టి జైలుకు పంపారు. కొన్నేళ్ల తర్వాత ఆ రెండు కేసుల్నీ న్యాయస్థానాలు కొట్టేశాయి.
తీర్పు వెలువడ్డాక సజ్జన్‌కుమార్ కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన వల్ల పార్టీ ఇరకాటంలో పడకూడదని భావించి ఆయన తప్పుకున్నాడని సజ్జన్ సహాయకుడు చెబు తున్నాడు. చిత్రమేమంటే ఇలాంటి కేసులోనే నిందపడిన మరో కాంగ్రెస్ నాయకుడు కమల్‌నాథ్ సజ్జన్‌కుమార్‌కు శిక్షపడిన రోజే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించారు. సిక్కుల ఊచకోత కొనసాగుతుండగానే ప్రధాని పదవిని అధిష్టించిన రాజీవ్‌గాంధీ ‘వటవృక్షం నేలకొరిగినప్పుడు భూమి కంపించడం అత్యంత సహజమ’ని వ్యాఖ్యానించి అందరినీ నివ్వెర పరిచారు. కాంగ్రెస్‌లో ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఉంటున్నవారే ఈ నరమేథానికి నాయకత్వం వహిం చారని అప్పటికి ఆయనకు తెలుసునో లేదో ఎవరికీ తెలియదు.
కనీసం తర్వాతైనా మీడియాలో వారి పేర్లు మార్మోగినప్పుడు చర్యలకు ఉపక్రమించి ఉంటే ఆయన ప్రతిష్ట వందల రెట్లు పెరిగేది. అది లేకపోగా బాధిత కుటుంబాలకు బెదిరింపులు రివాజుగా మారాయి. దుండగులు కొందరి ప్రాణాలు తీశారు. మరికొందరిపై దొంగ కేసులు బనాయించారు. ఈ వరసంతా గమనించి చాలా మంది పోలీసులను ఆశ్రయించడం మానుకున్నారు. హంతకులు అధికార మదంతో చెలరేగుతుంటే కేసులకు, బెదిరింపులకు జడిసిన పలు బాధిత కుటుంబాలు అనామకంగా బతికాయి. కనుకనే ఈ మాదిరి ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు నాయకులు ఏమీ ఎరగనట్టు, ఏమీ జరగనట్టు, తమకసలు సంబంధం లేనట్టు ఉంటున్నారు. సజ్జన్ కూడా అలాగే చెబుతూ వచ్చారు. కానీ ఆయ నపై వచ్చిన ఆరోపణల తీవ్రత, సాక్షుల పట్టుదల సంగతి పార్టీ నాయకత్వానికి బాగా తెలిసి ఉంటుంది. అందుకే ఇన్నాళ్లుగా ఆయనకు ఏ పదవీ ఇవ్వలేదు.
చాలా కేసుల్లో కాంగ్రెస్‌కు చెందిన సాధారణ కార్యకర్తలకు మాత్రమే శిక్షలు పడ్డాయి. 1984 నవంబర్ 1న ఇద్దరు సిక్కు యువకులను పొట్టనబెట్టుకున్న యశ్‌పాల్‌సింగ్ అనే నేరగాడికి గత నెలలో ఢిల్లీ కోర్టు ఉరిశిక్ష విధించింది. మరో నేరగాడు నరేష్ షెరావత్‌కు యావజ్జీవ శిక్ష పడింది. కింది కోర్టుల్లో శిక్షలు పడిన కేసులు, నిందితులు నిర్దోషులంటూ తీర్పు వెలువడిన కేసులు ఉన్నత న్యాయస్థానాలకు అప్పీల్‌కు వెళ్లాయి. సజ్జన్ కేసు కూడా అలా అప్పీల్‌కి వచ్చిందే. ఆయనపై వచ్చిన అభియోగాలను మేజిస్ట్రేట్ కోర్టు మొదలుకొని సెషన్స్ కోర్టు వరకూ అన్నీ తోసిపుచ్చాయి. కానీ ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం ఈ కేసు లోతుపాతుల్లోకి వెళ్లి ముగ్గురు సాక్షుల వాంగ్మూలాలు సక్రమ మైనవేనని తేల్చింది. పట్టపగలు సాగించిన ఈ దురంతాల గురించి 10 కమిటీలు, కమిషన్‌లు రావడం, అవి చేతగాని రీతిలో వ్యవహరించడం ఆశ్చర్యకరం. చెప్పిన విషయాల్నే ఈ 34 ఏళ్లనుంచీ ఎందరికో పదే పదే చెబుతూ వచ్చామని, న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేకపోయినా దీన్ని కొనసాగిస్తూ వచ్చామని నిర్‌ప్రీత్ కౌర్ అనడం ఆమెకున్న సహనానికి, వ్యవస్థలపై ఉన్న విశ్వాసా నికి అద్దం పడుతుంది. కానీ బాధితులంతా అలా లేరు. తిరిగి తిరిగి విసిగి వేసారి మిలిటెన్సీ బాట పట్టారు.
ఈ నరమేథంలో ప్రమేయమున్నదని హక్కుల సంఘాలు వెల్లడించిన ఎంపీ లలిత్ మాకెన్‌నూ, ఆయన భార్యనూ 1985లో మిలిటెంట్లు కాల్చిచంపడం దీనికి ఉదాహరణ. ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం ఆత్రుతైనా, ప్రజాస్వామికవాదుల భావనైనా సమాజంలో ఇలాంటి ప్రతీకార న్యాయానికి తావుండరాదనే. నేరం చేసింది ఎంతటివారైనా చట్టప్రకారం చర్యలు ప్రారంభిస్తే... బాధితులకు సత్వర న్యాయం లభించడానికి అన్ని వ్యవస్థలూ కృషి చేస్తే ఈ పరిస్థితి తలెత్తదు. దుర దృష్టవశాత్తూ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమైనా, అనంతరకాలంలో వచ్చిన వేర్వేరు కూటమి ప్రభు త్వాలైనా, ఆఖరికి ఎన్‌డీఏ సర్కారైనా బాధితుల విషయంలో ఉదాసీనత ప్రదర్శించాయి. వారిపైనే ఎదురు కేసులు పెట్టి జైళ్లపాలు చేస్తుంటే కనీస మానవత్వం లేకుండా ప్రవర్తించాయి. కాబట్టే ఈ కేసులో ఇంత జాప్యం జరిగింది. కానీ ఇదింకా సుప్రీంకోర్టుకు అప్పీల్‌కెళ్తుంది. చివరిగా శిక్ష ఖరారు కావడానికి మరెన్నేళ్లు పడుతుందో వేచిచూడాలి. ఇలాంటి కేసులే మరో 186 ఉన్నాయి. వాటి సంగతి తేలడానికి మరెన్ని తరాలు గడవాలో చూడాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment