నెలరోజుల నుంచి కర్ణాటకలో ఎడతెగకుండా సాగుతున్న రాజకీయ సంక్షోభం ముగింపునకు చేరువవుతున్న సూచనలు కనబడటం హర్షించదగ్గది. కుమారస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్– జేడీ(ఎస్) సర్కారుకు గురువారం విశ్వాసపరీక్ష ఉంటుందని స్పీకర్ కేఆర్ రమేష్ కుమార్ చేసిన ప్రకటన వైరి పక్షాల సవాళ్లు, ప్రతి సవాళ్లతో... స్థిరత్వం లేని ఎమ్మెల్యేల విచిత్ర రాజకీయ విన్యాసా లతో అస్తవ్యస్థంగా తయారైన ఆ రాష్ట్ర పరిస్థితుల్ని కాస్తయినా చక్కదిద్దగలదని భావించాలి. ఏం చేసైనా అధికార పగ్గాలు అందుకుని తీరాలని బీజేపీ ఉవ్విళ్లూరుతుంటే, ఏదోవిధంగా ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని కూటమి తాపత్రయపడుతోంది.
కట్టుదాటినవారిపై ఒత్తిళ్లున్నాయని, వారందరికీ స్వేచ్ఛనిస్తే తిరిగి తమ గూటికి చేరతారని ఆ కూటమి చేస్తున్న ప్రకటనలు మేకపోతు గాంభీర్య మేనని జరుగుతున్న పరిణామాలు గమనిస్తున్న వారికి స్పష్టంగానే అర్ధమవుతోంది. కర్ణాటక మంత్రి డీకే శివకుమార్ స్వయంగా ముంబై వెళ్లి అక్కడి హోటల్‌లో బస చేసి ఉన్న తిరుగుబాటు ఎమ్మెల్యేలతో మాట్లాడాలని చూడటం, పోలీసులు అనుమతించకుండాఅరెస్టు చేయడం... చివరకు ఆయన ఉత్త చేతులతో వెనుదిరగడం అందరూ చూశారు. చివరకు ఒక ఎమ్మెల్యేను ఒప్పించా మనుకుంటే... ఆయన కాస్తా ముంబై పోయాక స్వరం మార్చారు.
విశ్వాస పరీక్ష గురువారం ఉంటుందని స్పీకర్ ప్రకటించగానే ప్రధాన పక్షాలన్నీ విలాస వంతమైన రిసార్ట్స్‌లో శిబిరాలు ప్రారంభించడం, ఎమ్మెల్యేలను వాటికి తరలించడం సాధారణ ప్రజానీకంలో కంపరం కలిగిస్తుంది. తమను ఎన్నుకున్నవారు ఎలాంటి సమస్యలు ఎదుర్కొం టున్నారో, తాము చేయాల్సిందేమిటో కనీసం ఒక్క ఎమ్మెల్యే అయినా ఆలోచిస్తున్న దాఖలా లేదు. ఈ శిబిరాలకూ, తరచుగా ప్రత్యేక విమానాల్లో రాకపోకలకూ అయ్యే కోట్లాది రూపాయల వ్యయాన్ని ఎవరు భరిస్తున్నారో, ఎందుకు భరిస్తున్నారో అంతుచిక్కదు. తగిన సంఖ్యాబలం ఉన్నవారు అధికారంలో ఉండటం, అది కోల్పోయినప్పుడు రాజీనామా చేసి నిష్క్రమించడం ప్రజా స్వామ్యంలో సహజంగా జరగాల్సిన ప్రక్రియ. కర్ణాటకలో ఆ ప్రక్రియ వెర్రితలలు వేసింది. ప్రమా దకరంగా మారిన రహదారిని చక్కదిద్దమంటే... పాఠశాలకు భవనం లేక విద్యార్థులు ఆరుబయట చదువుకోవాల్సి వస్తున్నదని మొత్తుకుంటే ప్రభుత్వాలకు నిధుల లేమి అడ్డొస్తుంది. ప్రభుత్వం చేయకపోతే మేం చేస్తామన్న మాట విపక్షం నుంచి కూడా వినబడదు. కానీ రాజకీయ సంక్షోభాలు సృష్టించడానికి, వాటినుంచి బయటపడటానికి అన్ని పక్షాలూ డబ్బును మంచినీళ్లప్రాయంగా ఖర్చు చేస్తాయి.
కూటమిలో ఉండే అసంతృప్తి వగైరాలతోపాటు కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికి చెల్లుచీటి ఇచ్చిన వైనం కూడా కర్ణాటక పరిణామాలను ప్రభావితం చేసిందని చెప్పవచ్చు. ఒకపక్క కూటమి ప్రభుత్వాన్ని కాపాడుకోవటానికి శివకుమార్ ముంబై వెళ్లి పాట్లు పడుతుంటే ఆ విషయంలో రాహుల్ నుంచి పెద్దగా స్పందన లేదు. తనను ఓడించిన అమేఠీ నియోజకవర్గానికి అదే సమయంలో వెళ్లి స్థానికులను కలిసే కార్యక్రమంలో ఆయన తలమునక లయ్యారు. నిజానికి ఆయన కూడా ముంబై వెళ్లి శివకుమార్ తదితరులతో కలిసి హడావుడి చేసి ఉంటే బీజేపీతోపాటు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా కాస్త ఇరకాటంలో పడేది. ఇందువల్ల ఏం ఒరుగుతుందన్న ప్రశ్న అర్ధరహితమైనది. అది కాంగ్రెస్‌కు తక్షణ ప్రయోజనం చేకూర్చకపోయినా, రాజకీయంగా ఎంతోకొంత మేలు చేస్తుంది.
దివంగత ఎన్టీఆర్‌ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచి అధికారం హస్తగతం చేసుకోవడానికి ఎమ్మెల్యేలను పోగేసి వైస్రాయ్ హోటల్‌లో శిబిరం నడిపి నప్పుడు సీఎం స్థానంలో ఉన్నా ఎన్టీఆర్ అక్కడికెళ్లారు. ఆ సమయంలో ఆయనపై చెప్పులేయించిన ఘటన విషయంలో ఇప్పటికీ చంద్రబాబు జవాబు చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు. ఆ ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఆయన తేలుకుట్టిన దొంగలా నోరు మెదపడం లేదు. అధ్యక్ష పదవి ఉందా లేదా అన్న అంశంతో సంబంధం లేకుండా రాహుల్‌గాంధీ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు. దశాబ్దాల నుంచి కాంగ్రెస్‌ను నడిపిస్తున్న కుటుంబానికి ప్రతినిధి. కనీసం అందుకోసమైనా ఆయన బెంగ ళూరులో మకాం వేసి ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి పట్టుదలగా ప్రయత్నిస్తున్నారన్న అభి ప్రాయం కలిగించి ఉన్నా ఈ గోడ దూకుళ్లు కాస్తయినా అదుపులో ఉండేవి. ఎవరికి వారే యమున తీరే అన్నట్టు వ్యవహరిస్తున్న రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కలిసి అడుగు వేసేవారు.
ఇప్పుడు అందరి దృష్టీ సహజంగానే విశ్వాస పరీక్ష ఉంటుంది. 2010లో యడ్యూరప్ప నేతృ త్వంలోని బీజేపీ ప్రభుత్వానికి 11 మంది బీజేపీ ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకున్నప్పుడు వారందరినీ అప్పటి స్పీకర్ బోపయ్య అనర్హులను చేశారు. దీన్ని సుప్రీంకోర్టు తప్పు బట్టింది. స్పీకర్ చర్య సహజ న్యాయానికి విరుద్ధమైనదని వ్యాఖ్యానించింది. ఇప్పుడు బీజేపీ పక్షానికి ఫిరాయించిన 16మంది ఎమ్మెల్యేల రాజీనామాల విషయంలో నాన్చుడు ధోరణి అవలంబిస్తున్నందుకు సుప్రీం కోర్టు ధర్మాసనం మొదట తప్పుపట్టినా, ఇందులో ప్రధానమైన సమస్యలు ఇమిడి ఉన్నాయని అంగీకరించి 16న మరోసారి విచారిస్తామని తేల్చింది. ఈలోగా ఎమ్మెల్యేలపై ఏ చర్యా తీసు కోవద్దని కూడా స్పీకర్‌కు ఆదేశాలిచ్చింది. గురువారం జరిగే విశ్వాసపరీక్షపై ఈ ఆదేశం ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచిచూడాలి. ఆ ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదించడమే సరైందని సుప్రీంకోర్టు మంగళవారం అభిప్రాయపడితే సర్కారు మైనారిటీలో పడినట్టే. అది గురువారం వరకూ కూడా వేచిచూడనవసరం లేదు. ఫలానావిధంగా నిర్ణయించాలని స్పీకర్‌ను తాము ఆదేశిం చలేమని చెబితే పరిణామాలు వేరే విధంగా ఉంటాయి. ఏదేమైనా కర్ణాటకను తరచు రాజకీయ సంక్షోభాల్లోకి నెడుతున్న ఈ తరహా కార్యకలాపాలకు రాజకీయ పక్షాలు ఎంత త్వరగా స్వస్తి చెబితే అంత మంచిది.
Comments
Please login to add a commentAdd a comment