సాక్షి, న్యూఢిల్లీ: 1984లో సిక్కు అల్లర్లను రెచ్చగొట్టారనే ఆరోపణలు ఎదుర్కొన్న కారణంగా ఇంతకా లం పక్కన పెట్టిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జగ్‌దీశ్ టైట్లర్, సజ్జన్‌కుమార్‌కు ఎట్టకేలకు విముక్తి కల్పించనుంది. వారిద్దరికి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కీలక బాధ్యతలను అధిష్ఠానం అప్పగించనుంది. సీనియర్ నాయకులతో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమావేశమై ఈ మేరకు నిర్ణయించినట్లు తెలిసింది. పైగా సిక్కుల అల్లర్లకు కారణమనే ఆరోపణలు ఎదుర్కొన్న టైట్లర్, సజ్జన్‌కు అవకాశం ఇవ్వడం, ఢిల్లీకి 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న షీలాదీక్షిత్‌కు తగినంత ప్రాధాన్యత ఇవ్వకపోవడం అంతటా చర్చనీయాంశంగా మారింది. ఏదిఏమైనా అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రె స్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని కొందరు ఆ పార్టీ నాయకులు అంటున్నారు.
8 మందితో కమిటీ?
రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం కోసం 8 మంది సభ్యల కమిటీని నియమించారని ఈ కమిటీలో టైట్లర్, సజ్జన్‌కుమార్‌లతో పాటు అర్విందర్ సింగ్ లవ్లీ, జై ప్రకాశ్ అగర్వాల్, హరూన్ యూసఫ్, జైకిషన్ , మహాబల్ మిశ్రా, మతీన్ అహ్మద్‌కు చోటు కల్పించారని వార్తలు వచ్చాయి. షీలాదీక్షిత్‌కు ఈ కమిటీలో చోటు దక్కలేదని తెలిసింది.
కమిటీని ఏర్పాటు చేయలేదు: ముఖేష్
కానీ, కాంగ్రెస్ పార్టీ ఈ వార్తలను ఖండించింది. రాహుల్ గాంధీ ఎటువంటి కమిటీని ఏర్పాటు చే యలేదని కాంగ్రెస్ ప్రతినిధి ముఖేష్ శర్మ చెప్పారు. కమిటీ ఏర్పాటు చేయనప్పటికీ కొందరు కాంగ్రెస్ నేతలకు రాహుల్ గాంధీ కీలక ఎన్నికల బాధ్యతలు అప్పగించారని అంటున్నారు. సజ్జన్‌కుమార్‌కు అనధికార కాలనీలు, జుగ్గా జుగ్గీ జోపిడీవాసుల ఓట్లు తెచ్చే బాధ్యతలు, సదర్ ఓటర్ల మనసు గెలచుకునే బాధ్యతను జగదీశ్‌టైట్లర్‌కు అప్పగించారని అంటున్నారు. రాహుల్ గాంధీ బుధవారం ఉదయం జరిపిన సమావేశంలో ఈ వివాదస్పద నేతలు ఇరువురు పాల్గొన్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
విస్మయం: ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ సిక్కు ఓటర్లను మచ్చిక చేసుకోవడానికి విశ్వప్రయత్నిస్తుండగా, కాంగ్రెస్ పార్టీ పుండుమీద కారం చల్లిన చందంగా సిక్కు వ్యతిరేకత మూటకట్టుకొన్న జైట్లీ, సజ్జన్‌కు ఎన్నికల ప్రచార బాధ్యతలు అప్పగించనుండడంపై రాజకీయ పరిశీలకుల్లో విస్మయం వ్యక్తమవుతోంది. ఈ చర్య కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో నష్టపర్చుతుందనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బీజేపీ ప్రతినిధి సంబిత్‌పాత్ర కాంగ్రెస్ పార్టీ వైఖరిపై ఆందోళన వ్యక్తం చేశారు.