కాంగ్రెస్ నేతల అరెస్టు, ఆపై విడుదల
సాక్షి, న్యూఢిల్లీ: విద్యుత్, నీటి సరఫరాలో కోతలకు నిరసనగా భారీ ఆందోళనకు దిగిన కాంగ్రెస్ నేతలు అర్విందర్ సింగ్ లవ్లీ, సజ్జన్‌కుమార్, ముఖేష్ శర్మ అదుపులోకి తీసుకున్న పోలీసులు గంట సేపటి తర్వాత విడుదల చేశారు. తొలుత వీరంతా నాంగ్లోయ్ రైల్వే స్టేషన్‌లో రైళ్ల రాకపోకలను అడ్డుకునేందుకు యత్నించారు. ఉదయం తొమ్మిదిన్నర గంటల సమయంలో డీపీసీసీ అధ్యక్షుడు అర్విందర్ సింగ్ లవ్లీ, మాజీ ఎంపీ సజ్జన్‌కుమార్, కాంగ్రెస్ ప్రతినిధి ముఖేష్ శర్మతో పాటు దాదాపు 150 మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఉత్తర ఢిల్లీలోని నాంగ్లోయ్ రైల్వే స్టేషన్‌లో పట్టాలపై బైఠాయించారు. రైళ్ల రాకపోకలను ఆడ్డుకునేందుకు యత్నించారు. పట్టాలపై నుంచి వెళ్లిపోవాలంటూ పోలీసులు విన్నవించినప్పటికీ కాంగ్రెస్ నేతలు పట్టించుకోలేదు. దీంతో పోలీసులు వారిపై వాటర్ కేనన ్లను ప్రయోగించారు. అయినప్పటికీ కదలకపోవడంతో వారిని బలవంతంగా పట్టాలపై నుంచి లేవదీసి నాంగ్లోయ్, గోండా పోలీస్ స్టేషన్లకు తరలించారు. లవ్లీ, శర్మతో పాటుకొందరు కార్యకర్తలను గోండా పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లినట్లు పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.
గంటసేపటి తర్వాత వారినందరినీ విడుదల చేశారు. కాగా పోలీసుల చర్యను ముఖేశ్ శర్మ ఖండించారు. విద్యుత్, నీటి సరఫరా మెరుగయ్యేదాకా తాము చేపట్టిన ఆందోళన కొనసాగుతుందన్నారు. అనంతరం ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (డీపీసీసీ) అధ్యక్షుడు అర్వింద్‌సింగ్ లవ్లీ మీడియాతో మాట్లాడుతూ తమను సమీపంలో ఉన్న స్టేషన్‌కు కాకుండా ముండ్కాతనా స్టేషన్‌కు పోలీసులు తరలించారన్నారు. ప్రజల గొంతును తొక్కిపెట్టడానికి ఇదొక మార్గమని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్య సూత్రాల గురించి గొప్పలు చెప్పుకునే బీజేపీ ఇప్పుడు అదే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందన్నారు.ప్రభుత్వం తమను అరెస్టు చేసినా లేదా కారాగారానికి పంపినా లేదా తమపై నీటి ఫిరంగులు ప్రయోగించినా విద్యుత్, నీటి సమస్యలపై ఆందోళనను మాత్రం కొనసాగిస్తామని హెచ్చరించారు. 15 ఏళ్ల తమ పార్టీ పాలనలో నగరంలో విద్యుత్ సమస్య తలెత్తలేదని లవ్లీ చెప్పారు. ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.