Arvindar Singh Lovely
-
ఎన్నికలకు ముందు బీజేపీకి బూస్ట్
న్యూఢిల్లీ: ఎన్నికలకు ముందు బీజేపీకి మంచి ఊపు వచ్చింది. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీని యర్ నాయకుడు బూటాసింగ్ కుమారుడు అర్విందర్‌సింగ్ లవ్లీతోపాటు అనేకమంది మంగళవారం రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. వీరితోపాటు ఆప్, కాం గ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు కూడా కమలతీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ మీడియాతో మాట్లాడుతూ లవ్లీ... తమ పార్టీలో చేరికతో దళిత ఓటర్ల మద్దతు బాగా పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల తర్వాత ఢిల్లీలో తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ ధీమా వ్యక్తం చేశారు. అనంతరం అర్విందర్‌సింగ్ లవ్లీ మీడియాతో మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో తన తండ్రికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం టికెట్ ఇవ్వలేదన్నారు. ఈ కారణంగా ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాల్సి వచ్చిందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పనితీరు తనకు ఎంతో బాగా నచ్చిందన్నారు. ఆయన సారథ్యంలో దేశం ఎంతో బాగా పురోగమిస్తుందన్నారు. మళ్లీ ‘దేవ్లీ’నుంచే బరిలోకి... 2008లో జరిగిన విధానసభ ఎన్నికల్లో దేవ్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీచేసిన లవ్లీ విజయం సాధించారు. అయితే 2013 నాటి ఎన్నికల్లో ఆప్ అభ్యర్థి ప్రకాశ్ చేతిలో పరాజయం పాలయ్యారు. లవ్లీ చేరిక విషయమై బీజేపీ నాయకుడొకరు మాట్లాడుతూ తండ్రి ప్రతిష్టను ఓట్లుగా మలుచుకోవాలనుకుంటున్నారన్నారు. వచ్చే నెల ఏడో తేదీన జరగనున్న విధానసభ ఎన్నికల్లోనూ లవ్లీని దేవ్లి నియోజకవర్గంనుంచే బరిలోకి దించుతామన్నారు. ఇదిలాఉంచితే ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి సందీప్ దూబే, చంద్రకాంత్ దూబేలు బీజేపీలో చేరారు. ఇంకా రాష్ట్రీయ లోక్‌దళ్ కౌన్సిలర్ అనితా త్యాగి, కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్ దీపక్ చౌదరి, డీపీసీసీ కార్యదర్శి శశికాంత్ దీక్షిత్, గోపాల్ పహరియాలు కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. -
ఆప్, బీజేపీలు నాణేనికి రెండు ముఖాలు
న్యూఢిల్లీ: బీజేపీ, ఆప్‌లు నాణానికి రెండు ముఖాల వంటివని, వాటి తప్పుడు వాగ్దానాలకు మోసపోకూడదని ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నగర ఓటర్లను హెచ్చరించింది. ఇప్పటివరకు ఆ రెండు పార్టీలు ఏమి సాధించాయో చూసి అందుకనుగుణంగా ఓటు వేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి హరూన్ యూసఫ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ 130వ వ్యవస్థాపక దినోత్సవాల సందర్భంగా జరిగిన సమావేశాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఆమ్ ఆద్మీ పార్టీ చాలా ఉధృతంగా ప్రచారం చేస్తోందని, ఆ పార్టీకి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయని డీపీసీసీ అధ్యక్షుడు అర్విందర్ సింగ్ లవ్లీ ప్రశ్నించారు. ఢిల్లీ అంతటా ఏర్పాటు చేసిన హోర్డింగ్‌లకు సుమారు 300 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని, రేడియో ప్రకటనలకు ఐదు కోట్లు వెచ్చించారని చెప్పారు. దశాబ్దాల క్రితం ఏర్పడిన కాంగ్రెస్ పార్టీకి హోర్డింగులు, అడ్వర్టయిజ్మెంట్ల కోసం ఖర్చు పెట్టేందుకు ఇంత పెద్ద మొత్తంలో నిధులు రావడం లేదని అన్నారు. కేవలం రెండేళ్ల క్రితం ఏర్పడిన పార్టీకి ఆర్థిక మద్దతు ఎక్కడి నుంచి లభిస్తోందని అన్నారు. సామాన్యుని గొంతుకగా ఉంటామని పార్టీని ఏర్పాటు చేశారని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన 49 రోజుల్లోనే జన్‌లోక్‌పాల్ బిల్లు కోసం రాజీనామా చేశారని అన్నారు. ఇప్పుడు వారు నెలకొల్పిన హోర్డింగుల్లో జన్‌లోక్‌పాల్ ప్రస్తావనే లేదని విమర్శించారు. 49 రోజుల పాలనలో చౌకగా విద్యుత్, తాగునీరు అందించామని చెబుతున్నారని, ఆ సదుపాయాలను పొందిన వ్యక్తి ఒక్కరు కూడా తమకు ఎదురు పడలేదని లవ్లీ ఎద్దేవా చేశారు. -
ప్రజావ్యతిరేక బడ్జెట్: డీపీసీసీ
న్యూఢిల్లీ: ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ దిశానిర్దేశం లేనిదని, ప్రజావ్యతిరేకమని ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (డీపీసీసీ) విమర్శించింది. ఇది పేదలకు ఎలాంటి మేలూ చేయకపోగా, నిరుద్యోగాన్ని ప్రోత్సహించేలా ఉందని డీపీసీసీ అధ్యక్షుడు అర్విందర్ సింగ్ లవ్లీ ఆరోపించారు. ధరల పెరుగుదలను అడ్డుకోవడానికి ఒక్క చర్యను కూడా ప్రకటించలేదని మండిపడ్డారు. కరెంటు, నీటి సమస్యల పరిష్కారానికి నిధులు అంటూ ఢిల్లీవాసులను కేంద్రం మోసగించిందని లవ్లీ అన్నారు. -
కాంగ్రెస్ నేతల అరెస్టు, ఆపై విడుదల
సాక్షి, న్యూఢిల్లీ: విద్యుత్, నీటి సరఫరాలో కోతలకు నిరసనగా భారీ ఆందోళనకు దిగిన కాంగ్రెస్ నేతలు అర్విందర్ సింగ్ లవ్లీ, సజ్జన్‌కుమార్, ముఖేష్ శర్మ అదుపులోకి తీసుకున్న పోలీసులు గంట సేపటి తర్వాత విడుదల చేశారు. తొలుత వీరంతా నాంగ్లోయ్ రైల్వే స్టేషన్లో రైళ్ల రాకపోకలను అడ్డుకునేందుకు యత్నించారు. ఉదయం తొమ్మిదిన్నర గంటల సమయంలో డీపీసీసీ అధ్యక్షుడు అర్విందర్ సింగ్ లవ్లీ, మాజీ ఎంపీ సజ్జన్‌కుమార్, కాంగ్రెస్ ప్రతినిధి ముఖేష్ శర్మతో పాటు దాదాపు 150 మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఉత్తర ఢిల్లీలోని నాంగ్లోయ్ రైల్వే స్టేషన్లో పట్టాలపై బైఠాయించారు. రైళ్ల రాకపోకలను ఆడ్డుకునేందుకు యత్నించారు. పట్టాలపై నుంచి వెళ్లిపోవాలంటూ పోలీసులు విన్నవించినప్పటికీ కాంగ్రెస్ నేతలు పట్టించుకోలేదు. దీంతో పోలీసులు వారిపై వాటర్ కేనన ్లను ప్రయోగించారు. అయినప్పటికీ కదలకపోవడంతో వారిని బలవంతంగా పట్టాలపై నుంచి లేవదీసి నాంగ్లోయ్, గోండా పోలీస్ స్టేషన్లకు తరలించారు. లవ్లీ, శర్మతో పాటుకొందరు కార్యకర్తలను గోండా పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లినట్లు పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. గంటసేపటి తర్వాత వారినందరినీ విడుదల చేశారు. కాగా పోలీసుల చర్యను ముఖేశ్ శర్మ ఖండించారు. విద్యుత్, నీటి సరఫరా మెరుగయ్యేదాకా తాము చేపట్టిన ఆందోళన కొనసాగుతుందన్నారు. అనంతరం ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (డీపీసీసీ) అధ్యక్షుడు అర్వింద్‌సింగ్ లవ్లీ మీడియాతో మాట్లాడుతూ తమను సమీపంలో ఉన్న స్టేషన్‌కు కాకుండా ముండ్కాతనా స్టేషన్‌కు పోలీసులు తరలించారన్నారు. ప్రజల గొంతును తొక్కిపెట్టడానికి ఇదొక మార్గమని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్య సూత్రాల గురించి గొప్పలు చెప్పుకునే బీజేపీ ఇప్పుడు అదే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందన్నారు.ప్రభుత్వం తమను అరెస్టు చేసినా లేదా కారాగారానికి పంపినా లేదా తమపై నీటి ఫిరంగులు ప్రయోగించినా విద్యుత్, నీటి సమస్యలపై ఆందోళనను మాత్రం కొనసాగిస్తామని హెచ్చరించారు. 15 ఏళ్ల తమ పార్టీ పాలనలో నగరంలో విద్యుత్ సమస్య తలెత్తలేదని లవ్లీ చెప్పారు. ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.