తొలుత గొంతు కోసి హత్య చేసి.. ఆ తరువాత.. | Warangal Old Husband And Wife Died Followup Story | Sakshi
Sakshi News home page

ప్రాధేయ పడినా.. కనికరించని కసాయి

Published Fri, Nov 1 2019 12:49 PM | Last Updated on Fri, Nov 1 2019 12:50 PM

Warangal Old Husband And Wife Died Followup Story - Sakshi

విలపిస్తున్న దస్రు కుమార్తెలు, బంధువులు

సాక్షి, నెక్కొండ(వరంగల్‌): వృద్ధ తల్లిదండ్రులపై మమకారాన్ని మరచిన కన్న కొడుకు, మనువడు కలిసి కిరాతకంగా గొంతు కోసి కడతేర్చిన ఘటనలో నిందితులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా నెక్కొండ మండలం మడిపల్లి పరిధిలోని భూక్యా తండాలో వృద్ధ దంపతులు భూక్యా దస్రూ – బాజిని స్వయాన కుమారుడు, మనవడు కలిసి బుధవారం రాత్రి సజీవ దహనం చేసిన విషయం విదితమే. అయితే, సజీవ దహనం కాదని.. తొలుత గొంతు కోసి హత్య చేశాక.. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు పెట్రోల్‌ పోసి నిప్పంటించారని తేలింది. ముందుగా నిందితులు కేతురాం, వెంకన్నలు బుధవారం సాయంత్రం భూక్యా దస్రూ – బాజి ఇంటికి వెళ్లి వెళ్లగానే దస్రూపై దాడికి పాల్పడి గొంతు కోశాడు.

ఆ తరువాత తల్లి బాజిపై దాడికి పాల్పడుతుండగా ప్రాధేయపడినా గొంతు కోసి ఉండొచ్చని భావిస్తున్నారు. ఎవరికి అనుమానం కలగకుండా ఉండేందుకు ఇంట్లో, శవాలను మం చంపై ఉంచి పెట్రోలు పోసి, నిప్పు అంటించారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే నిందితుల కు గాయాలయ్యాయని వారు చెప్పారు. వృద్ధ దంపతులు వారి పనులు వారే చేసుకుంటూ ఆరోగ్యంగా ఉండేవారని.. అలాంటిది సజీవ దహనం చేస్తే కనుక కేకలు వినిపించేవని తండా వాసులు చెబుతున్నారు. హత్య చేశాక మంచంపై వేసి పెట్రోలు వేసి నిప్పు అంటివచ్చినట్లు తెలుస్తోంది.

అసలు ఏం జరిగింది..!
నెక్కొండ మండలం మడిపల్లి పరిధిలోని భూక్యా తండాకు చెందిన దస్రూకు ఇద్దరు కుమారులు కేతురాం, వీరన్నతో పాటు నలుగురు కుమార్తెలు ఉన్నారు. దస్రూకు ఉన్న భూమిలో పెద్దకొడుకు కేతురాంకు 3–30 ఎకరాలు, చిన్నకొడుకు వీరన్నకు 4 ఎకరాలు బీడు భూమి పంచి ఇచ్చాడు. అయితే కానిస్టేబుల్‌ అయిన వీరన్న భార్య ఝాన్సీతో ఏర్పడిన గొడవలతో విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. ఈక్రమంలోనే తన నాలుగు ఎకరాల భూమిని అమ్మకానికి పెట్టాడు. దీంతో ఏడేళ్ల క్రితం దస్రూ మూడో కుమార్తె భద్రమ్మ ఆ భూమిని కొనుగోలు చేసినట్లు తెలిపింది. వీరన్న రెండో వివాహం చేసుకున్న కొన్నేళ్లకు అనారోగ్యంతో మృతి చెందాడు. తన తమ్ముడికి అర ఎకరం భూమి ఎక్కువ ఇచ్చావని. సోదరి అయిన భద్రమ్మ కొనుగోలు చేసిన భూమి విషయంలో అప్పటి నుంచి కేతురాం గొడవ చేస్తున్నాడు.

భూమి సాగు చేసినేందుకు వచ్చిన క్రమంలో కేతురాం కుటుంబ సభ్యులు దాడి చేశారని భద్రమ్మ పేర్కొన్నారు. దీంతో స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కోర్టులో కేసు వేశామని తెలిపింది. తరచూ గొడవలు జరుగుతుండడంతో ఈనెల 30న బుధవారం నెక్కొండ సీఐ పెద్దన్నకుమార్‌.. దస్రూ, బాజి, కుమార్తె భద్రమ్మ కుటుంబ సభ్యులు, కేతురాం కుటుంబ సభ్యులు, పెద్ద మనుషులను పిలిచి విచారణ చేశారు. భద్రమ్మ దగ్గర నాలుగు ఎకరాల భూమికి రిజిస్ట్రేషన్‌ ఉందని, ఆమెకే సాగు హక్కు ఉందని స్పష్టం చేయడంతో సమస్య పరిష్కారమైందని భావించినట్లు ఆమె తెలిపారు. ఆ తర్వాత తండాకు వెళ్తే గొడవలు జరుగుతాయని పోలీసులు చెప్పడంతో భద్రమ్మ తాము నివాసముంటున్న ఖమ్మం వెళ్లిపోయింది. ఇంతలోనే సాయంత్రం తన తల్లిదండ్రులను కేతరాం, వెంకన్న పొట్టన పెట్టుకున్నారని కన్నీరుమున్నీరయ్యారు.

తల్లిదండ్రులు చేతబడి చేయించారని అనుమానం
కేతురాం చిన్నకుమారుడు బాలకృష్ణ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో మూఢనమ్మకాలను నమ్మిన కేతురాం తన తల్లిదండ్రులే చేతబడి చేయించారని అనుమానం పెంచుకున్నాడు. అటు భూమి విషయం కొడుకు అనారోగ్యం విషయంలో తనకు అన్యాయం జరిగిందని కేతురాం కక్ష కట్టి కన్న తల్లిదండ్రులనే కడ తేర్చారని తండాలో చర్చించుకుంటున్నారు. తండ్రి వద్ద ఉన్న భూమిలో వాటా ఇవ్వాలని కొంత కాలంగా కేతురాం ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. దస్రూ తన వాటాగా ఉంచుకున్న 2–5 ఎకరాల భూమిలో చిన్న కోడలుకు అర ఎకరం ఇవ్వగా అమ్ముకుంది. అలాగే, కేతురాంకు అర ఎకరం ఇచ్చి, మరో అర ఎకరం దస్రూ అమ్మకున్నాడు.

మిగిలిన ఎకరం భూమితో పాటు దస్రూ నివసిస్తున్న ఇంటిని ఇప్పుడే తన పేర చేయాలని కేతురాం కొంతకాలంగా పట్టుబడుతున్నాడు. తన తదనంతరం మాత్రమే ఇస్తానని దస్రూ చెప్పడంతో కేతురాం కుటుంబసభ్యులు ఆగ్రహంతో ఉన్నారు. కాగా, నిందితులను కఠనంగా శిక్షించాలని దస్రు కుమార్తెలు కమలమ్మ, భద్రమ్మ, యాకమ్మ కుటుంబ సభ్యులు విలపిస్తూ కోరారు. భద్రమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నట్లు సీఐ పెద్దన్నకుమార్, ఎస్సై నవీన్‌కుమార్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement