విజయవాడ లీగల్: భార్యాభర్తలను హత్య చేయాలనే ఉద్దేశంతో పెట్రోల్ పోసి తగులబెట్టినట్లుగా దాఖలైన కేసులో ఐదుగురు నిందితులపై నేరం రుజువు కావడంతో ఒక్కొక్కరికీ పదేళ్ల జైలుశిక్షతో పాటు రూ.2 వేల జరిమానా విధిస్తూ మహిళా సెషన్స్ జడ్జి జి.ప్రతిభాదేవి బుధవారం తీర్పు చెప్పారు. కేసు వివరాల ప్రకారం.. కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన జూలూరి రమాదేవితో జూలూరి హనుమంతరావుకు రెండో వివాహం జరిగింది. ఈ వివాహం హనుమంతరావు మొదటి భార్య పిల్లలకు ఇష్టం లేదు. ఆస్తి వ్యవహారాల్లో వారికి తండ్రి హనుమంతరావుతో విభేదాలున్నాయి.
గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చింతలపూడికి చెందిన హనుమంతరావు కుమార్తె కొడుకు గూడూరు సత్యనారాయణ అలియాస్ మణికంఠ హనుమంతరావు వద్ద ఉండేవాడు. రమాదేవితో రెండో వివాహం తర్వాత సత్యనారాయణతో పాటు తమ పిల్లలను కూడా హనుమంతరావు దూరం పెట్టాడు. దీంతో మొదటి భార్య కుమారులయిన జూలూరి సుబ్బారావు, మాధవరావు తమ మేనల్లుడు సత్యనారాయణతో కలసి హనుమంతరావు, రమాదేవి హత్యకు కుట్ర పన్నారు. సత్యనారాయణ తమ స్వగ్రామమైన దుగ్గిరాల మండలం చింతలపూడికి చెందిన తన స్నేహితులు తెనాలికి చెందిన గూడూరు వినయ్‌కుమార్, వీణను 2014 అక్టోబర్ 28వ తేదీ మధ్యాహ్నం ముందుగా ఇబ్రహీంపట్నం తీసుకొచ్చాడు. పథకంలో భాగంగా గూడూరు వినయ్‌కుమార్, వీణ కలసి రమాదేవి ఇంటికి వెళ్లి మంచినీళ్లు అడిగారు.
అనంతరం తాము తెచ్చుకున్న ప్లాస్టిక్ సంచిలో నుంచి పెట్రోల్ బాటిల్‌ను తీసి రమాదేవి, హనుమంతరావుపై పోసి నిప్పంటించి పారిపోయారు. కాలిన గాయాలతో దంపతులిద్దరూ కేకలు వేయగా చుట్టుపక్కల వారు వచ్చి గొల్లపూడిలోని ఆంధ్ర ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో రమాదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులైన సుబ్బారావు, మాధవరావు, సత్యనారాయణ, వినయ్ కుమార్, వీణపై 307, 326, 452, 436, 120బి ఐపీసీ సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. ప్రాసిక్యూషన్ తరఫున సీఎంఎస్ పోలీసులు 24 మంది సాక్షులను ప్రవేశపెట్టగా ఏపీపీ జి.దైవప్రసాద్ విచారించారు. కోర్టు విచారణలో నిందితులపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి పైవిధంగా తీర్పు చెప్పారు.
హత్యాయత్నం కేసులో ఐదుగురికి పదేళ్ల జైలు
Published Thu, Mar 10 2022 5:01 AM | Last Updated on Thu, Mar 10 2022 5:01 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment