మృతుడు మాలోత్ లింగన్న మేనమామ భద్రు, అత్త నాగమణి(ఫైల్) మాలోత్ లింగన్న మృతదేహం
కురవి(డోర్నకల్): వివాహేతర సంబంధం ఒకరి హత్యకు దారితీసింది. తన భార్యతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడని ఓ వ్యక్తి సొంత మేనల్లుడినే గొడ్డలితో నరికి చంపేశాడు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలం నారా యణపురం శివారు కొత్తతండాలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. మహబూబాబాద్ రూరల్ సీఐ ముత్తిలింగయ్య, కురవి ఎస్సై నాగభూషణం, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం... కొత్తతండాకు చెందిన బానోత్ భద్రు, నాగమణి భార్యభర్తలు. భద్రు మేనల్లుడు మాలోత్ లింగన్న(25) నాగమణితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు.
దీంతో లింగన్నను హత్య చేయాలని భద్రు నిర్ణయించుకున్నాడు. ఆదివారం రాత్రి తండాలోని గణేష్ విగ్రహాన్ని యువకులు డీజే సౌండ్‌కు నృత్యాలు చేస్తూ నిమజ్జనానికి ఊరేగింపుగా తరలిస్తున్నారు. వారిలో మేనల్లుడు లింగన్న కూడా ఉండటాన్ని భద్రు చూశాడు. వెనుక నుంచి వచ్చి గొడ్డలితో అతడి తలపై నరికాడు. దీంతో లింగన్న తల పగిలి కింద పడ్డాడు. వెంటనే భద్రు అక్కడి నుంచి పరారయ్యాడు. రక్తపు మడుగులో ఉన్న లింగన్న తలకు ఓ వ్యక్తి తన షర్ట్ గట్టిగా కట్టి మరో వ్యక్తి సాయంతో బైక్‌పై కూర్చోబెట్టుకుని మానుకోట ఏరియా ఆసుపత్రికి తరలించాడు. అక్కడ స్టెచర్‌పై పడుకోబెడుతుండగా లింగన్న మృతిచెందాడు. భద్రు గొడ్డలతో సహా కురవి పోలీసుల ఎదుట లొంగిపోయాడు.
భద్రు మూడో భార్య నాగమణి..
బానోతు భద్రు సొంత అక్క బిడ్డ సేవిరిని మొదట వివాహం చేసుకోగా విడాకులయ్యాయి. రెండో భార్య సరోజ ముగ్గురు కొడుకులు జన్మించాక మృతిచెందింది. ఆతర్వాత నాగమణిని పెళ్లి చేసుకున్నాడు. అతడి మేనల్లుడు మాలోత్ లింగన్న వ్యవసాయం చేస్తూనే అప్పుడప్పుడు కారు డ్రైవింగ్ చేస్తుంటాడు. రెండేళ్లుగా నాగమణితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయంలో భద్రు, లింగన్న మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. అయినా మార్పు లేకపోవడంతో రెండేళ్ల క్రితం పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించగా రూ.10వేల జరిమానా విధించారు. ఆ తర్వాత వారం రోజులకే నాగమణి తల్లిగారింటికి వెళ్లిపోయింది. కొద్ది రోజులకు అక్కడా లేదని మేనల్లుడు లింగన్న, నాగమణి మరో చోట సహజీవనం చేస్తున్నారని లింగన్నపై భద్రు పగపెంచుకున్నాడు. దీంతో అతడిని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి అందరు చూస్తుండగానే నడిరోడ్డుపై గొడ్డలితో నరికి చంపేశాడు.
లింగన్న రెండు సుపారీ హత్యల్లో నిందితుడు
మాలోత్ లింగన్న అప్పుడప్పుడు కారు డ్రైవింగ్ చేసేవాడు. ఈ క్రమంలో మహబూబ్‌నగర్ జిల్లా మరికల్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడి అక్కడ రూ.5లక్షల సుపారీ తీసుకుని ఒకరి హత్య చేశాడు. అలాగే నల్గొండ జిల్లా సూర్యాపేట సమీపంలోని నూతనకల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మరొకరి వద్ద రూ.3లక్షలు సుపారీ తీసుకుని హత్య చేశాడు. ఆయా కేసులు పోలీస్‌స్టేషన్లలో నమోదై ఉన్నాయి. ఆయా హత్య కేసుల్లో లింగన్న వెంట నలుగురు వ్యక్తులు ఉన్నట్లు సమాచారం.
పోలీసుల విచారణ
లింగన్నను గొడ్డలితో నరికి చంపిన ఘటనా స్థలికి సీఐ ముత్తిలింగయ్య, ఎస్సై నాగభూషణం సోమవారం విచారణ చేపట్టారు. ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరించారు. మృతుడు లింగన్న తండ్రి మాలోత్ సేవ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తుచేస్తున్నారు. శవపంచనామా చేసి పోస్టుమార్టం తర్వాత మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అందచేశారు. కాగా హత్య జరిగిన తర్వాత భద్రు ఇంట్లోని వస్తువులను లింగన్న బంధువులు ధ్వంసం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment