
సిద్ధాంతికి పాదాభివందనం చేసి ఆశీస్సులు పొందుతున్న సీఎం కేసీఆర్(ఫైల్)
కొడకండ్ల : శ్రీవిద్యాలంకార, దైవజ్ఞకుల శిరోమణి, వైదిక ఆగమ శిరోమణి, స్మార్త సరస్వతిగా ఖ్యాతి గడించిన జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రానికి చెందిన ప్రముఖ వేదపండితుడు, సిద్ధాంతి పాలకుర్తి నృసింహరామశర్మ(96) పరమపదించారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తొర్రూరులోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మరణించారు. పాలకుర్తి లక్ష్మీనారాయణ శాస్త్రి–రాధమ్మ దంపతుల కుమారుడు నృసింహరామశర్మ సిద్ధాంతి 1922 జూలై 20న జన్మించారు.
తొమ్మిదేళ్ల ప్రాయంలోనే పితృ వియోగం కావడంతో కుటుంబ భారం పైనపడడంతో విద్యాభ్యాసానికి స్వస్తి పలకాల్సి వచ్చింది. సంచార బ్రహ్మణుడిగా గ్రామానికి వచ్చిన సత్యవాద రామమూర్తి శాస్త్రి వద్ద సంస్కృత భాష నేర్చుకున్నారు. సీతారామ శాస్త్రి వద్ద శ్రీవిద్యోపాసన పొందారు. మండల కేంద్రంలో శ్రీయోగలింగేశ్వర సహిత రాజరాజేశ్వరీ ఆలయాన్ని స్వయంగా నిర్మించారు. అందులోనే గురువు గారి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించి గురుభక్తిని చాటుకున్నారు. అసంఖ్యాక దేవాలయాల నిర్మాణానికి ప్రోత్సహించి ఆయన తన జీవితాన్ని ధర్మ ప్రచారానికి అంకిత చేశారు.
నిరంతర గ్రంథ పరిశీలకుడు
నృసింహరామశర్మ నిరంతరం ఏదో ఒక గ్రంథ పరిశీలనలో గడిపేవారు. మూడు వేలకు పైగా దేవాలయాల ప్రతిష్ఠాపనులు చేశారు. 75 సంవత్సరాలుగా శాక్తేయ ధీక్ష చేపట్టారు. ప్రతి ఏటా పదిహేను రోజులపాటు తన ఆలయంలో శరన్నవరాత్రోత్సవాలను నిర్వహించారు. రాష్ట్రంలోనే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని పుణ్యక్షేత్రాల్లో వైదిక కార్యక్రమాలు, వేల సంఖ్యలో చండీయాలు నిర్వహించారు. ఆగమ, ధర్మ శాస్త్ర జ్ఞాన సంపన్నుడైన ఆయన ఎటువంటి సందేహాలు అడిగినా సశాస్త్రీయంగా, సంతృప్తికరంగా సమాధానాలు ఇచ్చేవారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత తొలి గోదావరి పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున శృంగేరి భారతీ తీర్థ స్వామిని ఆహ్వానించారు.
విశిష్ట పీఠాధిపతులతో అనుబంధం
ప్రముఖ విశిష్ట పీఠాధిపతులతోనూ సిద్ధాంతికి అనుబంధం ఉంది. శృంగేరి జగద్గురువులు, కంచికామకోటి జగద్గురువులు, హంపి పీఠాధిపతులు, శ్రీకరపాత్ర స్వామి, బసవకళ్యాణ్ శ్రీమదనానంద సరస్వతీ స్వామి, తంజావూరు రాంబాబా, కుర్తాళం పీఠాధిపతులు, సిద్ధేశ్వరానంద భారతీ స్వామి, చిన్నజీయర్ స్వామి, పుష్పగిరి పీఠాధీపతి, విజయదుర్గ పీఠాధిపతి, శ్రీకృష్ణానంద సరస్వతీ స్వామి, శ్రీమాధవానంద సరస్వతీ స్వామి, సద్గురు శివానందమూర్తి వంటి ఎందరో మహనీయులతో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉంది.
రచించిన గ్రంథాలు
నృసింహరామశర్మ ధర్మశాస్త్రానికి సంబంధించిన అనేక గ్రంథాలను రచించారు. శ్రీ నిత్య పారాయణ పద్ధతి, శ్రీవిద్యా సపర్య, శ్రీవిద్య లఘుచక్ర పూజ, రుద్ర స్వాహాకార పద్ధతి, శ్రీ విద్యా నిత్యాహ్నకము, సర్వ ప్రతిష్టా మందారం, చండీ హోమం విధానం, గురుపూజా విధానం, శ్రీ రుద్ర స్వాహాకార పద్ధతి, శ్రీక్రమోక్త కలశ స్థాపన విధి వంటి గ్రంథాలను రచించారు.
ధార్మిక వరేణ్య బిరుదాంకితుడు
పలు అవార్డులతో పాటు అనేక సన్మానాలు పొందిన సిద్ధాంతి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1999లో అప్పటి సీఎం నారా చంద్రాబాబునాయుడు, తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా రెండు మార్లు ఉగాది పురస్కారాలను అందుకున్నారు. ‘దర్శనం’ ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక తొమ్మిదో వార్షికోత్సవంలో సిద్ధాంతికి స్వర్ణ కంకణం, జీవన సాఫల్య పురస్కారం ప్రదానం చేసి ధార్మిక వరేణ్య బిరుదును ఇచ్చారు. కార్యక్రమానికి సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరై సిద్ధాంతి పల్లకీ సేవలో పాల్గొని మోయడం విశేషం.
పుట్టినరోజుకు రెండు రోజుల ముందే..
సిద్ధాంతి పుట్టిన రోజును శనివారం ఘనంగా నిర్వహించడానికి కుటుంబసభ్యులు అవసరమైన ఏ ర్పాట్లు చేయడంతోపాటు బంధు, మిత్రులు, భక్తులు, శిష్యులను ఆహ్వానించారు. నాలుగు రోజులపాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన కొంత కొలుకోవడంతో గురువారం ఇంటికి తీసుకెళ్ల వచ్చని వైద్యులు సూచించారు. ఆ మేరకు సిద్ధమవతుండగానే ఒక్కసారిగా అస్వస్తతకు గురై కన్నుమూశారు. విషయం తెలియగానే రాష్ట్రం లోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో బంధు, మిత్రులు, భక్తులు తరలివచ్చారు. అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు సాయంత్రం జరిగాయి. రాష్ట్రం లోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రముఖులు, సిద్ధాంతులు, వేదపండితులు, బంధువులు, భక్తులు, శిష్యులు తరలివచ్చి సిద్ధాంతిని కడసారి వీక్షించి పాదాభివందనం చేశారు.
పలువురు నివాళి
నృసింహరామశర్మకు పలువురు నివాళులర్పించారు. పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు, గిరిజన కార్పొరేషన్ చైర్మన్ గాంధీనాయక్, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్‌రావు, డీసీసీబీ మాజీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, జెడ్‌ఆర్‌సీసీయూ మెంబర్ అన్నావజ్జుల సూర్యప్రకాష్, కేసీఆర్ గురువు మృత్యుంజయశర్మ, దర్శనం ఎడిటర్ వెంకటరమణ, సిద్ధాంతులు దివ్యజ్ఞాని, జెడ్పీటీసీ బాకి లలితప్రేమ్‌కుమార్, ఎంపీపీ జ్యోతి వెంకన్న, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కుందూరు వెంకటేశ్వర్‌రెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యు డు సిందె రామోజీ, మండల కన్వీనర్ ధీకొండ వెంకటేశ్వర్‌రావు, మాజీ సర్పంచ్ జక్కుల విజయమ్మ నివాళులర్పించిన వారిలో ఉన్నారు.
రాష్ట్ర జ్యోతిష్య సభల ప్రాంగనానికి సిద్ధాంతి పేరు..
హైదరాబాద్ రవీంద్రభారతిలో ఈనెల 13, 14 తేదీల్లో ప్రభుత్వం తరఫున నిర్వహించే రాష్ట్ర జ్యోతిష్య మహాసభల ప్రాంగణానికి పాలకుర్తి నృసింహరామశర్మ నామకరణం చేస్తామని దర్శనం ఎడిటర్ వెంకటరమణ, జ్యోతిష్యపండితుడు దివ్యజ్ఞాని, బ్రాహ్మణ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు వెన్నంపెల్లి జగన్మోహన్‌శర్మ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment