కూతురు రమ్యతో సహా నిరాహార దీక్ష చేస్తున్న స్వప్న
కురవి(డోర్నకల్): భర్త ఇంటి వద్ద భార్య రెండు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న సంఘటన సోమవారం వెలుగుచూసింది. బాధితురాలి కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కాంపల్లి శివారు తునికిచెట్టు తండాకు చెందిన బానోత్ రాజా, కమిలి దంపతుల కుమార్తె స్వప్నను సక్రాంనాయక్ తండా కు చెందిన బాదావత్ వెంకన్నకు ఇచ్చి ఆరేళ్ల క్రితం వివాహం చేశారు. రూ.10లక్షల కట్నంగా ఇచ్చి పలు వస్తువులు పెట్టారు. వెంకన్న రైల్వే శాఖలో ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్లయ్యాక ఉద్యోగరీత్య ఆంధ్రప్రదేశ్‌లోని గూడూరు జంక్షన్ వద్ద నివసిస్తున్నారు. వీరికి పాప రమ్య ఉంది. మూడేళ్లుగా స్వప్న, వెంకన్న మధ్య గొడవలు జరుగుతున్నాయి.
తనను వేధిస్తుండటంతో అక్కడి నుంచి పుట్టింటికి వచ్చానని, పోలీస్‌స్టేషన్‌లో గతంలో కేసు పెట్టగా తనకు ఖర్చులకు నెలకు రూ.3వేల చొప్పున చెల్లిస్తున్నాడని వివరించింది. మూడు నెలలుగా ఖర్చులు ఇవ్వలేదని తెలిపింది. దీంతో ఆదివారం తన భర్త కావాలంటూ సక్రాంనాయక్ తండాలో అతడి ఇంటికి వచ్చి తిండి లేకుండా నిరశన దీక్ష చేపట్టింది. అత్తామామ, కుటుంబ సభ్యులందరూ వేరే గదిలో ఉంటూ అన్నం తిని తాళం వేసుకుని బయటకు వెళ్తున్నారని, తన కూతురుకు కూడా అన్నం పెట్టడంలేదని రోధించింది. కాగా ఈ విషయంపై సీరోలు ఎ స్సై రాణాప్రతాప్‌ను వివరణ కోరగా ఆమెను స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చామని, అయినా మళ్లీ సోమవారం ఆందోళన చేస్తోందని, వారి కేసు కోర్టులో ఉందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment