మృతి చెందిన శిశువును ఎత్తుకుని రోదిస్తున్న బంధువులు
మహబూబాబాద్ రూరల్ : వైద్యురాలి నిర్లక్ష్యం కారణంగా గర్భంలోని పిండం మృతి చెందిందని బాధితురాలి బంధువులు మానుకోట ఏరియా ఆస్పత్రిలో ఆందోళనకు దిగారు. బుధవారం చోటుచేసుకున్న ఈ ఘటనపై బాధితురాలి భర్త పల్ల సందీప్ తెలిపిన వివరాల ప్రకారం.. కురవి మండలం సూదనపల్లికి చెందిన పల్ల భార్గవి నెలలు నిండి వారం రోజులు పూర్తయ్యాక పురుటి నొప్పులు రావడంతో మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఏరియా ఆస్పత్రికి వచ్చింది.
విధుల్లో ఉన్న గైనకాలజిస్టు ఆశాదేవి భార్గవిని పరీక్షించి ఓ ఇంజక్షన్ తెప్పించి ఇవ్వడంతో కొంత ఉపశమనం లభించింది. డెలివరీ కోసం అక్కడే ఉండిపోయింది. రాత్రి 8 గంటల సమయంలో స్కానింగ్ తీయించిన డాక్టర్ ఆశాదేవి రిపోర్టు చూసి చిన్న నొప్పులే.. నార్మల్ డెలివరీ అవుతుంది.. గర్భంలో శిశువు హార్ట్‌బీట్ బాగానే ఉందని చెప్పింది. కొంచెం నొప్పులు వస్తున్నాయని భార్గవి చెప్పినా పట్టించుకోలేదని సందీప్ తెలిపాడు.
బుధవారం ఉదయం 10 గంటల సమయంలో రౌండ్స్‌కు వచ్చిన సూపరిండెంటెంట్, గైనకాలజిస్టు వెంకట్రాములు భార్గవిని పరీక్షించి స్కానింగ్ చేసి కడుపులో శిశువు మృతి చెందిందని చెప్పారు. రాత్రి డాక్టర్ చెప్పిన విషయం ఆయన దృష్టికి తీసుకురాగా మరో వారం రోజుల వరకు కూడా డెలివరీ చేసేందుకు అవకాశం ఉందని చెప్పి వెళ్లారు. మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఎవరు పట్టించుకోలేదు. ఒంటి గంట సమయంలో భార్గవిని ఆపరేషన్ థియేటర్‌లోకి తీసుకెళ్లి అనంతరం మృతి చెందిన ఆడ శిశువును కుటుంబ సభ్యుల చేతిలో పెట్టారు. దీంతో వారు బోరున విలపించారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే శిశువు గర్భంలోనే మృతి చెందిందని, ఇందుకు బాధ్యులైన వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు.
Comments
Please login to add a commentAdd a comment