నిందితులు సుమన్, గణేష్, సరిత
నర్సింహులపేట : మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని వస్రాతండా పాశంబోడు గుట్టపై కాలిన మృతదేహం కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌లో మంగళవారం మానుకోట ఎస్పీ కోటిరెడ్డి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి హత్య వివరాలను వెల్లడిం చారు. మండలంలోని వస్రాంతండా శివారులోని పాశంబోడు గుట్టపై ఈనెల 10వ తేదీన కాలిన మృతదేహం ఆనవాళ్లను గొర్రెల కాపరులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారని తెలిపారు.
స్థానిక ఎస్సై సతీష్‌కుమార్ అనుమానాస్పద స్థితి మృతి కేసును నమోదు చేసుకుని, సీఐ చేరాలుతో ఆధ్వర్యంలో విచారణ చేపట్టారని పేర్కొన్నారు. మృతదేహం ముంగిమడుగు శివారు లాలితండాకు చెందిన గుగులోతు సురేష్ (38)గా గుర్తించారన్నారు. అనంతరం అతడి భార్య సరిత, బంధువులను విచారించగా విషయాలు బయటికొచ్చాయన్నారు. నెల రోజులుగా మద్యం తాగివచ్చి వేధిస్తున్న భర్తను ఎలాగైన హతమార్చాలని భార్య సరిత పూనుకుందని, బంధువులైన సుమన్, గణేష్ సాయంతో ముందుగా పథకం వేసుకున్నారని ఎస్పీ తెలిపారు.
ఈ క్రమంలో ఈనెల 9వ తేదీన రాత్రి తన తల్లిగారి గ్రామమైన వస్రాంతండాలో అతడికి బాగా మద్యం తాగించారు. అనంతరం విసురురాయి బండతో తలపై మోదీ హతమార్చారని ఎస్పీ పేర్కొన్నారు. సమీపంలోని పాశంబోడు గుట్టపైకి మృతదేహాన్ని పెట్రోల్‌తో కాల్చివేశారు. ఈ సందర్భంగా హత్యకు ఉపయోగించిన వస్తువులను ఎస్పీ స్వాధీనం చేసుకుని సమావేశంలో హాజరుపరిచారు. భార్య సరితతోపాటు హత్యకు సహకరించిన బంధువులు సుమన్, గణేష్‌ను అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు వివరించారు. కేసును ఛేదించిన డీఎస్పీ, సీఐ, ఎస్సైని ఎస్పీ అభినందించారు. విలేకరుల సమావేశంలో డీఎస్పీ రాజారత్నం, సీఐ చేరాలు, ఎస్సై సతీష్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
కీలక ఆధారమైన నల్ల నువ్వులు..
సురేష్ మృతదేహం చుట్టూ చల్లిన నల్ల నువ్వులు నిందితులను పట్టించడానికి కీలక ఆధారంగా మారినట్లు తెలుస్తోంది. ఈనెల 10వ తేదీన పాశంబోడు గుట్టపై మృతదేహం ఉందని గొర్రెల కాపరులు చెప్పడంతో అక్కడికి వెళ్లిన పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. కాగా, కాల్చిన మృతదేహం చుట్టూ నల్ల నువ్వులు, కళ్లలో సూదులు గుచ్చి ఉండడం ఫోరెన్సిక్ విచారణలో తేలినట్లు సమాచారం. అయితే లంబాడీలు.. చనిపోయిన వ్యక్తి చుట్టూ నల్లనువ్వులు చల్లి, కళ్లలో సూదులతో గుచ్చి అంత్యక్రియలు చేస్తారు. దీంతో చనిపోయిన వ్యక్తి తండావాసిగా గుర్తించి సంబంధిత కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. నల్ల నువ్వలతో కేసును ఛేదించడం పోలీసులకు తేలికైనట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment