రైలు పట్టాల మధ్యలో మధులత, ఉదయ్‌కుమార్ మృతదేహాలు
జనగామ : రైలు కిందపడి బలవన్మరణం చెందిన ఆ ముగ్గురిని చూసి రైలు పట్టాలు చిన్నబోయా యి. విలవిలలాడుతూ ప్రాణాలొదిలిన వారి చివ రి క్షణాలను చూసిన ఆకాశం వర్షం రూపంలో కన్నీరుకార్చింది. తలలు తెగిన తల్లి, కుమారుల మృతదేహాలను చూసి బంధువులు, స్థానికులు కన్నీరు మున్నీరయ్యారు. అదనపు కట్నం వేధి ంపులు, పుట్టింటికి వెళ్లనీయకుండా భర్త పెట్టే ఇ బ్బందులు భరించలేక భార్య, ఇద్దరు పిల్లలు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన జనగామలోని రాజీవ్‌నగర్ సమీపంలోని రైలుపట్టాలపై ఆదివా రం జరిగింది.
నల్లగొండ జిల్లా మోత్కూరు గ్రామానికి చెం దిన దుడుక నర్సయ్య, పుషమ్మ దంపతుల ఒక్కగానొక్క కుమార్తె మధులత(27)కు జనగామ పట్ట ణంలోని వీవర్స్ కాలనీకి చెందిన మాదాసు మధుకర్‌తో తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లి సమయంలో రూ.2 లక్షల కట్నం, పెట్టుపోతల కింద రూ.40 వేల సామగ్రి ముట్టజెప్పారు. ఏడాది పా టు తల్లిదండ్రులు సిద్ధయ్య, కమలమ్మ వద్ద ఉన్న మధుకర్.. రెడ్డిస్ట్రీట్(17వ వార్డు)లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని కాపురం పెట్టాడు.
వారికి కుమారులు ఉదయ్ కుమార్(8), వినయ్(4) జన్మించారు. స్థానిక సెయింట్ పాల్స్ స్కూల్‌లో ఉదయ్ 4వ తరగతి, వినయ్ ఎల్‌కేజీ చదువుతున్నాడు. మధుకర్ హైదరాబాద్ సోమాజీగూడ ప్రాంతలోని జీ4ఎస్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పెళ్లయినప్పటి నుం చి అదనపుకట్నం కోసం భార్యను వేధించేవాడని పుట్టింటి వారు ఆరోపిస్తున్నారు. తరుచూ భర్త పెట్టే వేధింపులను భరిస్తూనే తన ఇద్దరు పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంది మధులత. గొడవలపై అనేకసార్లు ఆమె పుట్టింటివారు పంచాయతీ పెట్టి.. మధుకర్‌ను నిలదీశారు.
అన్న గృహప్రవేశానికి వెళ్లని చెల్లి
హైదరాబాద్ బోడుప్పల్‌లో నివాసముంటున్న మధులత అన్న సతీష్ ఇటీవల నూతన గృహ ప్రవేశం చేశాడు. బావ, చెల్లెలును మర్యాదపూర్వకంగా వేడుకకు రావాలని ఆహ్వానించాడు. అంతకుముందే మధులత తండ్రి నర్సయ్య ఆమెకు రూ.70 వేలతో పుస్తెల తాడు చేయించాడు. అయినా మరిన్ని డబ్బులు కావాలని అల్లుడు వేధించా డని చెప్పారు. అత్తంటివారు తన మాట వినలేదని.. భార్యను గృహ ప్రవేశానికి వెళ్లకుండా అడ్డుకున్నాడు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన మధులత నాలుగైదు రోజులుగా మదనపడుతూ ఎవరికీ చెప్పుకోలేదు. రాఖీ పండగ రావడంతో రెండు రోజుల క్రితం తండ్రికి ఫోన్ చేసి.. హైదరాబాద్ అన్న దగ్గరికి వస్తా.. మీరంతా అక్కడికే రండి అంటూ కబురు పంపించడంతో తండ్రి నర్సయ్య, తల్లి పుషమ్మ హైదరాబాద్‌కు వెళ్లారు.
రాఖీ పండగకని బయల్దేరి..
ఉదయం 9 గంటలకు ఇద్దరు పిల్లలను వెంటబెట్టుకుని నిద్రలోనే ఉన్న భర్తను పలకరించింది. రాఖీ కట్టేందుకు తన అన్న వద్దకు వెళ్తున్నట్లు చెప్పింది. ఇంటి నుంచి నేరుగా ఆర్టీసీ బస్టాండుకు వెళ్లి గంటపాటు అక్కడే కూర్చున్నట్లు తెలిసింది. ఏమైందోగానీ 11.30 గంటల సమయంలో రాజీ వ్‌నగర్(1వ వార్డు) ఏరియాలోని రైలు పట్టాల వద్దకు పిల్లలతో కలిసి చేరుకుంది. వరంగల్ ఉంచి హైదరాబాద్ వెళ్తున్న శాతవాహ న రైలు కింద పడుకుని తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. సంఘటన స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు అక్కడ లభించిన సెల్‌ఫోన్‌తో మధ్యాహ్నం 12.30 గంటలకు మధుకర్‌కు ఫోన్ చేశారు. దీంతో అతడితోపాటు కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని విగత జీవులుగా పడి ఉన్న తల్లి, పిల్లలను చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు.
అన్నకు ఆఖరి పలకరింపు
అన్నాచెల్లెలి అనుబంధాన్ని గుర్తుచేసే రాఖీ పండగ రోజు అన్నకు రాఖీ కట్టేందుకు బయల్దేరిన మహిళ ఆత్మహత్యకు పాల్పడడం స్థానికంగా విషాదాన్ని నింపింది. ఆమె ఉదయం 9.30 గం టల ప్రాంతంలో తన అన్న సతీష్‌కు ఫోన్ చేసి.. ‘నేను రావడం లేదు..’ అనే ఒకే ఒక్క మాట చెప్పి ఫోన్ స్విచ్‌ఆఫ్ చేసింది. వంద సార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో చివరికి మధుకర్‌కు చేయగా ‘ఇంకా రాలేదా అవులది.. ఏడికి పోయింది..’ అంటూ నిర్లక్ష్యం సమాధానం చెప్పాడని మృతురాలి తండ్రి నర్సయ్య తెలిపారు. పండగ రోజు రాఖీ కట్టించుకునేందుకు చెల్లెలి కోసం ఎదురు చూసిన అన్నలు గుండెలు బాదుకున్నారు. ఎంతపని చేశావంటూ రోదించారు.
మధుకర్‌ను చితకబాదిన పుట్టింటివారు..
మృతురాలి బంధువులు ఆమె భర్త మధుకర్‌ను సంఘటన స్థలంలో చితకబాదారు. చెప్పులతో కొడుతూ నా బిడ్డను చంపేశావురా అంటూ శాపనార్థాలు పెట్టారు. దీంతో రైల్వే పోలీసులు అడ్డుకుని మధుకర్‌ను స్టేషన్‌కు తరలించారు. అమ్మ ప్రేమమధులత తల ఎగిరి మొండెం మిగిలినా.. పెద్ద కుమారుడు తల్లిఒడిలోనే సేద తీరుతున్నట్లుగా కనిపించాడు. ఆత్మహత్యకు పాల్పడిన సమయంలో ఇద్దరు కుమారులను తన ఒడిలో పెట్టుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు అక్కడి దృశ్యాన్నిబట్టి తెలుస్తోంది. చిన్న కుమారుడు వంద మీటర్ల దూరం ఎగిరిపడి తల, మొండెం వేరుకాగా, తల్లి తల ఎగిరి చెట్ల పొదల్లో పడిపోయింది. రైల్వే పోలీసులు పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు.
కట్నం కోసం హింసించాడు
పెళ్లయినప్పటి నుంచి అదనపుకట్నం కోసం నా కూతురిని అల్లు డు మధుకర్ వేధించాడు. రూ.2 లక్షల కట్నం, రూ.40 వేలు పెట్టుపోతుల కింద ఇచ్చిన. ఈ మధ్యే రూ.70 వేలు పెట్టి పుస్తెల తాడు చేయించిన. అయినా వదిలిపెట్టలేదు. నా కొడుకు గృహ ప్రవేశం చేసినా రానివ్వలేదు. అల్లుడి పోరు భరించలేకనే పిల్లలతో కలిసి నా బిడ్డ ఆత్మహత్య చేసుకుంది. ఎన్నోసార్లు పంచాయతీ పెట్టి బుద్ధిగా ఉండాలని చెప్పినం. అయినా వినిపించుకోలేదు.
– దుడుక నర్సయ్య, మృతురాలి తండ్రి
నిద్రలో ఉండగానే వెళ్లిపోయింది..
మా మధ్య గొడవలు ఏమీ లేవు. అందరిలాగే చిన్నచిన్న తగాదాలు. అదనపు కట్నం అడగలేదు. ఇటీవల బావమరిది గృహ ప్రవేశానికి వెళ్లొద్దన్నా. రాఖీ పండగ ఉంది కదా..అప్పుడు వెళ్లమని చెప్పా. డ్యూటీకి వెళ్లి శనివారం రాత్రి 12 గంటలకు ఇంటికి వచ్చా. భోజనం చేసి పడుకునేసరికి అర్ధరాత్రి దాటింది. 9 గంటలకు నన్ను లేపి రాఖీ కట్టేందుకు హైదరాబాద్ వెళ్తున్నానని చెప్పింది. నిద్రలో సరిగ్గా చూడకుండానే.. సరే పో అన్నాను. మధ్యాహ్నం రైల్వే పోలీసులు నాకు ఫోన్ చేయడంతో ఇక్కడికి వచ్చాను. – మాదాసు మధుకర్, మృతురాలి భర్త
హన్మకొండలో ఎస్సై కోడలు..
కాజీపేట అర్బన్ : వరకట్న బాధితులకు అండగా నిలవాల్సిన ఎస్సై ఇంట్లోనే అదనపు కట్నం వేధింపులతో అతడి కోడలు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన హన్మకొండలోని సుబేదారి పోలీస్‌స్టేషన్ పరిధిలోని స్నేహనగర్‌లో ఆదివారం జరిగింది. సుబేదారి ఎస్సై సిరిపురం నవీన్‌కుమార్ కథనం ప్రకారం.. సుబేదారి పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న కందుకూరి ఎల్లయ్య కుటుంబం హన్మకొండ స్నేహనగర్‌లో నివాసముంటోంది. ఆయన కుమారుడు శ్రవణ్‌కు మూడేళ్ల క్రితం కరీంనగర్ జిల్లా సైదాపురం మండలంలోని వెంకటేశ్వరపల్లి గ్రామానికి చెందిన బొడిగె మచ్చయ్య కూతురు శ్రీలత(25)తో వివాహమైం ది.
పెళ్లి సమయంలో రూ.8 లక్షల కట్నం ఇచ్చారు. వారికి సంతా నం కలగలేదు. గతంలో ప్రైవేట్ కంపెనీలో పనిచేసే శ్రవణ్ రెండు నెలలుగా తండ్రి వద్దే ఉంటున్నాడు. రెండు రోజులుగా ఇంటికి రాలేదు. అత్తింటివారు తరచూ మరో రెండు లక్షల కట్నం తీసుకురావాలని శ్రీలతను వేధించడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన ఆమె తన గదిలో సూసైడ్ నోట్ రాసి సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి మచ్చయ్య ఫిర్యాదు మేరకు మామ ఎల్లయ్య, అత్త దేవికా రాణి, భర్త శ్రవణ్‌పై కేసు నమో దు చేసినట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment