కీర్తి మృతదేహం వద్ద రోదిస్తున్న తల్లి, బంధువులు, కీర్తి (ఫైల్)
దంతాలపల్లి (వరంగల్): తమ కుమార్తెను అల్లుడే హత్య చేశాడని ఆరోపిస్తూ.. మృతదేహంతో తల్లిదండ్రులు ఆందోళన చేసిన సంఘటన మండల కేంద్రంలో జరిగింది. మృతురాలి బంధువులు, స్థానికుల కథనం ప్రకారం.. బయ్యారం మండల శివారు కంకరబోడు తండాకు చెందిన జాటోతు కీర్తి(28)కి దంతాలపల్లి మండల కేంద్రం శివారు రాగితండాకు చెందిన జాటోతు రామోజీ, అమ్ముల చిన్న కుమారుడు బాలుతో సంవత్సరం క్రితం వివాహమైంది. కాగా, బాలు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. భార్య కీర్తితో హైదరాబాద్‌లోనే ఉంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఈనెల 10వ తేదీన వరంగల్ సమీపంలో చింతలపల్లి–ఎలుగూరు రైల్వే స్టేషన్ల మధ్య అప్‌లైన్‌లో పట్టాల పక్కన ఉన్న మోరీలో కీర్తి శవమై కనిపించింది.
జీఆర్పీ సిబ్బంది గుర్తుతెలియని మృతదేహంగా కేసు నమోదు చేసి, మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీలో భద్రపరిచారు. పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా సమాచారం తెలుసుకున్న మృతురాలి బంధువులు మంగళవారం మృతదేహాన్ని గుర్తించారు. జీఆర్పీ సిబ్బంది మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. అనంతరం వారు మంగళవారం రాత్రి దంతాలపల్లి మండల కేంద్రం శివారులోని రాగితండాకు చేరుకుని కీర్తి అత్తింటి ఎదుట మృతదేహంతో ఆందోళన చేశారు. తమ కుమార్తెను అల్లుడే హత్య చేశాడని ఆరోపించారు. రెండు రోజులుగా మృతదేహానికి అంత్యక్రియలు చేయలేదు. ఈ విషయమై ఎస్సై నందీప్‌ను వివరణ కోరగా జీఆర్‌పీ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిర్వహించారన్నారు. బంధువుల నుంచి కూడా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment