నిందితుడి వివరాలు తెలుపుతున్న సీఐ శివరామయ్య, ఎస్సైలు
సాక్షి, గీసుకొండ(పరకాల): గ్రేటర్ వరంగల్ నగరం జాన్‌పిరీలు వద్ద ఉన్న సాయివైన్స్‌లో పని చేసే వర్కర్ సంగ రమేశ్ హత్య కేసులో నిందితుడు రామగిరి ప్రభాకర్‌ను అరెస్టు చేసినట్లు గీసుకొండ సీఐ శివరామయ్య తెలిపారు. సోమవారం సాయంత్రం గీసుకొండ పోలీస్ స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో సీఐ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. సాయివైన్స్ వద్ద గడిచిన ఆరు సంవత్సరాలుగా రామగిరి ప్రభాకర్ పాన్‌షాపు పెట్టుకుని జీవిస్తున్నాడు. అదే వైన్స్‌లో సంగ రమేశ్ క్లీనర్‌గా పని చేస్తుండగా.. ఈ నెల 9న హోళీ పండుగ రోజు రాత్రి 12.30 గంటలకు మృతుడు రమేశ్ అక్కడే ఉన్న ప్రభాకర్‌ను బిర్యానీ కావాలని అడగటంతో తన సెల్‌ఫోన్ ద్వారా ఆర్డర్ చేయడానికి ప్రయత్నింగా ఫోన్‌లో బ్యాలెన్స్ లేకపోవడంతో వీలు కాలేదు.
వేరే వారి ఫోన్ ద్వారా ఆర్డర్ చేస్తానని రమేశ్ కోరగా అందుకు ప్రభాకర్ ఒప్పుకోకపోగా డబ్బులు ఇవ్వనని బుకాయించాడు. అయితే బిర్యానీ తెప్పిస్తానని చెప్పి ఎందుకు మాటమార్చావని రమేశ్ అతడిని తిట్టడంతో దాన్ని మనసులో పెట్టుకున్న ప్రభాకర్ గతంలో తన పాన్‌షాపును తీసివేయిస్తానని బెదరించిన అతడిని ఎలాగైనా హత్య చేయాలని పథకం పన్నాడు. అర్ధరాత్రి వైన్‌షాపు ముందు నిద్రిస్తున్న రమేశ్‌ను తిట్టి, కాళ్లతో తన్ని, బీరుసీసా పగులగొట్టి దాంతో రమేశ్ మెడపై పొడవడంతో రమేష్ అక్కడికక్కడే మృతి చెందగా ప్రభాకర్ అక్కడినుంచి పారిపోయాడు. నిందితుడి కోసం గాలిస్తుండగా వరంగల్ రైల్వేస్టేషన్ వద్ద గుర్తించి సోమవారం అరెస్ట్ చేసినట్లు సీఐ శివరామయ్య తెలిపారు. హత్య జరిగిన వారం రోజుల్లోనే నిందితుడిని గీసుకొండ పోలీసులు పట్టుకోవడం విశేషం. విలేకర్ల సమావేశంలో ఎస్సైలు అబ్దుల్ రహీం, నాగరాజు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment