ప్రేమోన్మాది సాయిఅన్వేష్, రవళి
వరంగల్ క్రైం: ప్రేమను నిరాకరించిదనన్న అక్కసుతో పెట్రోల్ పోసి నిప్పుపెట్టిన ఘటనలో తీ వ్రంగా గాయపడిన తోపుచర్ల రవళి(22) మృత్యువుతో పోరాడి చివరకు సోమవారం యశోద ఆస్పత్రిలో కన్ను మూసింది. హన్మకొండ రాంగనర్‌లో ఫిబ్రవరి 27న లలితారెడ్డి హాస్టల్ ముందు ప్రేమోన్మాది పెండ్యాల సాయిఅన్వేష్ చేతిలో దాడికి గురైన విద్యార్థిని ఆరు రోజుల పాటు నరకం అనుభవించి మృత్యువు ఒడిలోకి చేరింది.
ఐసీయూలో ఆరు రోజుల నరకయాతన..
ఫిబ్రవరి 27వ తేదీన హన్మకొండలోని రాంనగర్‌లో ఉదయం 9.05 గంటలకు హాస్టల్ నుంచి నడుచుకుంటూ వస్తున్న రవళిపై ప్రేమోన్మాది సాయిఅన్వేష్ పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన తరువాత చివరగా తన స్నేహితురాలు కావ్యతో నిందితుని వివరాలు చెప్పింది. ఆ తరువాత ఎంజీఎం ఆస్పత్రికి ఉదయం 9.30 గంటలకు చేరుకున్న రవళి మధ్యాహ్నం 12 గంటల వరకు చికిత్స పొందింది. మెరుగైన వైద్యం కోసం హైదరబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించగా 3.15 గంటలకు యశోద ఆస్ప త్రిలో ఐసీయూలో చేర్చారు. అప్పటి నుంచి సోమవారం సాయంత్రం 6.10 గంటల వరకు ప్రాణా లతో పోరాడింది. ఆరు రోజుల పాటు నరకయాతన అనుభవించి చివరకు రవళి ప్రాణాలను వదిలింది.
శ్వాస నాళాలు ఉబ్బి..
పెట్రోల్ దాడిలో గాయపడిన రవళి ముఖం ఎక్కువ మొత్తంలో కాలిపోయింది. తీవ్రమైన గాయాల వల్ల శ్వాసనాళాలు ఉబ్బిపోయాయి. చర్మంపై ఉన్న మూడు పొరలు పూర్తి స్థాయిలో దెబ్బతిని, ఊపిరితిత్తులు పాడైపోయాయి. ప్లేట్‌లేట్స్ తగ్గిపోయాయి. శ్వాస నాళాలు దెబ్బతినడం వల్ల శ్వాస తీసుకోలేక మృతి చెందినట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. ఐసీయూలో ఆరు రోజుల పాటు వెంటిలేటర్‌పైనే చికిత్స చేసినట్లు వైద్యులు తెలిపారు.
నేడు గాంధీలో పోస్టుమార్టం..
మృతదేహానికి సోమవారం పంచనామా అనంతరం ముషీరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేస్తారు. సెంట్రల్ జైల్లో ప్రేమోన్మాది సాయిఅన్వేష్
27న దాడి జరిగిన తరువాత 28వ తేదీన మధ్యాహ్నం కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపిం చారు. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. నిందితుడు సాయిఅన్వేష్‌పై ఐసీసీ 341, 354–డీ, 326–ఏ, 307 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రవళి మృతి చెందటంతో నిందితుడు సాయి అన్వేష్‌పై 302 కింద హత్య కేసు నమోదు చేయనున్నారు.
హన్మకొండ ఇన్‌స్పెక్టర్ సంపత్‌రావు విచారణ అధికారిగా వ్యవహరిస్తున్నారు. హైదరబాద్‌లో పంచనామా నిర్వహించిన తరువాతనే పోస్టుమార్టం చేపడుతారు. ఆరు రోజుల పాటు హన్మకొండ పోలీసు స్టేషన్‌కు చెందిన ఓ ఎస్సై రవళి ఆరోగ్య పరిస్థితిని దగ్గర ఉండి పర్యవేక్షించారు.
సెంట్రల్ జైల్లో పేమోన్మాది సాయిఅన్వేష్
పెట్రోల్ పోసి అత్యంత దారుణంగా కాల్చిన ప్రేమోన్మాది సాయిఅన్వేష్ వరంగల్ సెంట్రల్ జైల్లో ఉన్నారు. హన్మకొండ పోలీసులు 27న దాడి జరిగిన తరువాత 28వ తేదీన మధ్యాహ్నం కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపించారు. న్యాయమూర్తి 14 రోజుల రిమైండ్ విధించారు. మృతురాలు రవళి ఇచ్చిన ఫిర్యాదులో నిందితుడు సాయిఅన్వేష్‌పై ఐసీసీ 341, 354–డీ, 326–ఏ, 307 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రవళి మృతి చెందటం నిందితుడు సాయి అన్వేష్‌పై 302 కింద హత్య కేసు నమోదు చేయనున్నారు.
రవళి మృతిపై మంత్రి ఎర్రబెల్లి సంతాపం
పాలకుర్తి: ఇటీవల హన్మకొండలో ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ రవళి సోమవారం మృతి చెందింది. ఈ విషయంపై స్పందించిన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాలకుర్తిలో విలేకరులతో మాట్లాడారు. రవళి మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. రవళి కుటుంబ సభ్యులకు అవసరమైన సహాయం అందిస్తామని తెలిపారు.
అత్యంత భాధకరం
పెట్రోల్ దాడిలో గాయపడి చికిత్స పొందుతూ రవళి మృతి చెందటం అత్యంత బాధాకరం. ప్రేమోన్మాది సాయిఅన్వేష్‌ను అరెస్టు చేసి జైలుకు పంపించడం జరిగింది. ఇన్‌స్పెక్టర్ సంపత్‌రావును హైదరాబాద్‌కు పంపించి పోస్టుమార్టం నిర్వహిస్తాం. పోలీసు శాఖాపరంగా సరైన అధారాలు కోర్టుకు అందజేసి శిక్ష పడేవిధంగా చర్యలు తీసుకుంటాను. యువతులు, మహిళలను ఎవరైనా ప్రేమ పేరుతో వేధిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. షీ టీమ్స్, 100కు డయల్ చేయాలి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ రవీందర్, సీపీ
సంగెం : రవళి స్వగ్రామం రామచంద్రాపురంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సంగెం ఎస్సై ఎం.నాగరాజు పోలీసు సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నారు. మంగళవారం రవళి మృతదేçహాన్ని స్వగ్రామానికి తీసుకురానున్న క్రమంలో ఎలాంటి గొడవలు చోటుచేసుకోకుండా ముందస్తుగా పోలీసులు తగిన
చర్యలు చేపట్టారు.
మరో తల్లికి గర్భశోకం లేకుండా చూడాలి..
ప్రేమ పేరుతో రవళిని వేధించి చివరకు పెట్రోల్ పోసి నిప్పటించి తన పైశాచికానికి బలి చేసిన ప్రేమోన్మాదిని కఠినంగా శిక్షించాలి. అతడికి విధించిన శిక్షను చూసి మరో మృగాడు ఏ ఆడపిల్ల వైపు కూడా కన్నెత్తి చూడకూడదు. రవళి తల్లితండ్రులకు కలిగిన గర్భశోకం మరే తల్లిదండ్రులకు రాకుండా చూడాలి. ప్రేమ పేరుతో వేధించే వారి పట్ల చట్టాలు కఠినంగా అమలు చేయాలి. బొంపల్లి జయశ్రీ, సర్పంచ్, రామచంద్రాపురం
ఆడపిల్లలకు రక్షణ కల్పించాలి..
సమాజంలో అన్ని రంగాల్లో మగవారితో సమానంగా ముందుకు పోతున్న ఆడపిల్లలకు రక్షణ కల్పించాలి. దీంతో వారిని కళాశాలలకు పంపించాలంటే తల్లిదండ్రులు భయపడుతున్నారు. ప్రేమ పేరుతో వేధించేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలి. ఒక్కగానోక్క కూతురును పొట్టన పెట్టుకున్న అన్వేష్‌ను కఠినంగా శిక్షించాలి. రవళి తల్లిదండ్రులకు తగిన న్యాయం జరిగేలా అతనిని శిక్షించాలి. కత్తి రాధిక, ఎంపీటీసీ సభ్యురాలు,రామచంద్రాపురం
Comments
Please login to add a commentAdd a comment