పెట్రోల్ పోసి నిప్పంటించడంతో బాలిక కాలిపోయిన ప్రదేశం
ఇంటర్మీడియెట్ విద్యార్థిని దారుణ హత్య
బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కిరాతకుడు
ఘటనా స్థలంలోనే నిందితుడ్ని అరెస్టు చేసిన పోలీసులు
40 శాతం శరీరం కాలిపోవడంతో నంద్యాల ఆస్పత్రికి తరలింపు
పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు సర్వజనాస్పత్రికి బాలిక మృతదేహం
నంద్యాల జిల్లాలో మరో ఘోరం
గత జూలైలో ఇదే జిల్లా ముచ్చుమర్రిలో బాలికపై సామూహిక హత్యాచారం
నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణం బైరెడ్డి నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. తనను ప్రేమించలేదన్న కోపంతో ఓ ప్రేమోన్మాది బాలికపై సోమవారం తెల్లవారుజామున పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తీవ్రంగా గాయపడిన బాలిక అక్కడికక్కడే మరణించగా.. ఇదే ఘటనలో ప్రేమోన్మాదికి కూడా 40 శాతం గాయాలయ్యాయి. నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో ఓ బాలిక సామూహిత హత్యాచారం ఘటన మరకముందే నందికొట్కూరు పట్టణంలోని బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్యచేసిన సంఘటన తీవ్ర సంచలనం రేకెత్తించింది.
ఏం జరిగిందంటే..
కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తి మండలంలోని రామళ్లకోట గ్రామానికి చెందిన రామకృష్ణ, లక్ష్మి దంపతుల కుమార్తె లహరి (17). చిన్నతనంలో లహరి తండ్రి చనిపోవడంతో బాలిక అవ్వాతాతలు ఆమెను తమవద్దే ఉంచుకుని ఉన్నత చదువులు చదివిస్తామని నందికొట్కూరుకు తీసుకొచ్చి నంది జూనియర్ కళాశాలలో ఇంటర్‌లో చేర్పించారు. ప్రస్తుతం ఆమె రెండో సంవత్సరం చదువుతోంది.
ఆదివారం రాత్రి లహరి అవ్వాతాత ఓ గదిలో పడుకోగా, చదువుకుంటానంటూ లహరి మరో గదిలో నిద్రించింది. ఏమైందో ఏమో ఆదివారం తెల్లవారుజామున లహరి ఉన్న గదిలోంచి ఒక్కసారిగా పొగలు, మంటలు వచ్చాయి. దీంతో లహరి అవ్వాతాత వెంటనే గట్టిగా కేకలు వేశారు. ఇరుగుపొరుగు వారు వచ్చి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వచ్చి చూసేసరికి లహరి పూర్తిగా కాలిపోయి అక్కడే మృతిచెందింది.
అదే గదిలో వెల్దుర్తి మండలం కలుగోట్ల గ్రామానికి చెందిన బోయ ఆకుల సుబ్బారాయుడు, గిరిజా దంపతుల కుమారుడు రాఘవేంద్ర 40 శాతం కాలిన గాయాలతో కనిపించాడు. దీంతో పోలీసులు వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం 108 వాహనంలో రాఘవేంద్రకు ప్రాథమిక చికిత్స చేయించి మెరుగైన వైద్యం అందించేందుకు నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనా స్థలంలోనే మృతిచెందిన లహరి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
టెన్త్ వరకు ఇద్దరూ కలిసి చదువుకున్నారు..
ఇక లహరి, రాఘవేంద్ర ఇద్దరూ 10వ తరగతి వరకు రామళ్లకోటలోని జిల్లా పరిషత్ హైస్కూల్‌లో కలిసి చదువుకున్నారు. ఈ నేపథ్యంలోనే రాఘవేంద్ర బాలికను ప్రేమించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పసిగట్టిన లహరి తల్లి తన కుమార్తెను తన తల్లిదండ్రుల వద్దకు పంపినట్లు సమాచారం. మరోవైపు.. పదో తరగతితో చదువు ఆపేసిన రాఘవేంద్ర ప్రస్తుతం పెళ్లిళ్లకు డెకరేషన్ పనులు పనిచేస్తున్నాడు.
తరచూ నందికొట్కూరులోని బాలిక వద్దకు రాత్రి వేళ్లల్లో వచ్చిపోయేవాడని స్థానికులు చర్చించుకుంటున్నారు. రెండు మూడ్రోజుల క్రితం కూడా వచ్చినట్లు తెలుస్తోంది. ఆదివారం అర్థరాత్రి కూడా బాలిక వద్దకు వచ్చిన రాఘవేంద్ర తెల్లవారుజామున ఆమెపై పెట్రోల్ పోసి చంపేశాడని బంధువుల చెబుతున్నారు. సంఘటన స్థలాన్ని డీఎస్పీ రామాంజునాయక్, సీఐలు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఎస్‌ఐలు చంద్రశేఖర్, సురేష్‌బాబు, ఓబులేసు పరిశీలించారు.
అలాగే, నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్‌సింగ్ రాణా కూడా నందికొట్కూరులో లహరి ఉంటున్న ఇంటిని సందర్శించారు. ప్రాథమిక విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సంఘటనపై సమగ్ర విచారణ చేపడతామన్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టి వాస్తవాలను వెల్లడిస్తామని చెప్పారు.
వాడిని చంపేయండి..
నా మనరాలిని పెట్రోల్ పోసి నిప్పంటించి చంపేసిన వాడిని పోలీసులే చంపేయాలి. మీతో కాకపోతే వాడిని మాకు అప్పగించండి. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నాం. ఉన్నత చదువులు చదివి ఉద్యోగం చేయాల్సిన నా మనవరాలిని అన్యాయంగా చంపేశాడు. అమ్మాయిలపై దాడులు చేసేవారిని పోలీసులు వదలకుండా కాల్చియాలి. వాడి మరణం చూసి ఎవరికీ ఇలాంటి ఆలోచనలు రాకూడదు.
– పార్వతమ్మ, లహరి అవ్వ
Comments
Please login to add a commentAdd a comment