
సృజన్ ఇంటి ఎదుట బైఠాయించిన యువతి, తల్లిదండ్రులు
వరంగల్ చౌరస్తా: ప్రేమ పేరుతో మోసం చేసిన యువకుడి ఇంటి ఎదుట బాధిత యువతి కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళనకు దిగిన సంఘటన వరంగల్ 16వ డివిజన్‌లో గురువారం చోటుచేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం.. లక్ష్మిపురానికి చెందిన పోలెపాక సృజన్‌కు అదే ప్రాంతానికి చెందిన యువతి పరిచమైంది. ఆరేళ్ల కిందట ప్రేమ పేరుతో వెంబడించడం, యువతి తల్లిదండ్రులు ఇంట్లోలేని సమయంలో వెళ్లి మాట్లాడటం చేశాడు. కాల క్రమేణ శారీరకంగా బలవంతం చేశాడు. అందుకు యువతి నిరాకరించడంతో పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి లొంగదీసుకున్నాడు. పెళ్లి విషయంపై యువకుడి తల్లి విజయ, చెల్లెలికి వివరించిగా, వారు అంగీకరించినట్లు తెలిపింది. నెల రోజుల క్రితం పెళ్లి చేసుకోవాలని గట్టిగా నిలదీయగా చేసుకోనని, తిట్టి పంపించాడు.
దీంతో యువతికి ఇంతేంజార్ గంజ్ పోలీసులను ఆశ్రయించగా పోలీసులు ఇద్దరిని పిలిచి వయస్సు నిర్ధారణకు ఆధార్ కార్డులు తీసుకురావాలని సూచించారు. అంగీకరించిన సృజన్ మర్నాడు మరో యువతిని పెళ్లి చేసుకున్నట్లు స్థానికుల ద్వారా తెలిసింది. దీంతో బాధిత యువతి తల్లిదండ్రులతో కలిసి యువకుడి ఇంటి ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు. న్యాయం చేయాలని, వివాహం జరిపించాలని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు మీసాల ప్రకాశ్, టీఆర్‌ఎస్ నాయకుడు సీతయ్య తదితరులు యువతికి అండగా మద్దతు పలికారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి యువకుడిని మందలించగా, మరో యువతిని ఒక రోజు ముందే పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు సృజన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడితో పాటు కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసినట్లు ఇంతేంజార్ గంజ్ పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment