
కవిత మృతదేహం
సాక్షి, హసన్‌పర్తి(వరంగల్): క్షుద్ర పూజలు చేయించావంటూ ఓ కుటుంబం చేస్తున్న వేధింపులు భరించలేక ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. వరంగల్ అర్బన్ హసన్‌పర్తి మండలం హరిశ్చంద్రు నాయక్ తండాలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. హరిశ్చంద్రునాయక్ తండాకు చెందిన కవిత(18) పదో తరగతి పూర్తిచేసింది. ఆమెకు జ్యోతితో పాటు మరో ఇద్దరు యువతులు స్నేహితులు ఉన్నారు. ఇటీవల కోమటిపల్లిలో జ్యోతి ఫొటోకు క్షుద్రపూజలు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇందుకు కవితే కారణమని జ్యోతి, ఆమె తండ్రి బిక్షపతి, సోదరుడు అనిల్ వేధించడం ప్రారంభించారు. క్షుద్ర పూజలు ఎవరు చేశారు, ఎవరు చేయించారో చెప్పాలని వేధించారని కవిత బంధువులు తెలిపారు.
ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని వారే బెదిరింపులకు గురి చేశారని కుటుంబసభ్యులు చెప్పారు. దీంతో వారి వేధింపులు భరించలేక కవిత స్థానికంగా ఉన్న బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ మేరకు జ్యోతి, బిక్షపతి, అనిల్ వేధింపులతోనే కవిత ఆత్మహత్య చేసుకుందని ఆరోపిస్తూ ఆమె కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. జ్యోతి ఇంటి ఎదుట మృతదేహంతో ధర్నా చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బంధువులకు నచ్చచెప్పి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment