
ప్రమాదానికి గురైన లారీ మృతులు కిషన్‌రెడ్డి, అక్రమ్‌సందానీ
ఎల్కతుర్తి: మితిమీరిన వేగంతో వెళ్తున్న ఓ గ్రానైట్ లారీ మరో గ్రానైట్ లారీని ఢీ కొట్టిన సంఘటనలో డ్రైవర్, క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని సూరారం బస్‌స్టేజీ సమీపంలో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. సీఐ శ్రీనివాస్ జీ కథనం ప్రకారం...కరీంనగర్ జిల్లా రేకూర్తికి చెందిన రొంటాల కిషన్(అలియాస్) కిషన్‌రెడ్డి(47), కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు చెందిన క్లీనర్ ఎస్‌కె. అక్రమ్‌సందానీ(35) గ్రానైట్ లారీని కరీంనగర్ నుంచి కాకినాడకు తీసుకెళ్తున్నారు. మార్గమధ్యలో గల సూరారం బస్‌స్టేజీ సమీపంలోని కరీంనగర్–వరంగల్ ప్రధాన రహదారిపై మరో గ్రానైట్ లారీని అతి వేగంగా వెళ్లి ఢీకొట్టింది.
ఈ క్రమంలో లారీలో ఉన్న గ్రానైట్ రాళ్లు క్యాబిన్‌పై పడి నుజ్జునుజ్జు కావడంతో అందులో ఉన్న డ్రైవర్, క్లీనర్ అక్కడిక్కడే మృతి చెందాడు. ప్రమాదం జరిగిందన్న సమాచారం అందుకున్న సీఐ శ్రీనివాస్ జీ, ఎస్సై శ్రీధర్‌లు తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే ఒకరు మృతి చెందగా మరో వ్యక్తి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న కిషన్‌రెడ్డిని బయటకు తీసేక్రమంలోనే పరిస్థితి విషమించి మృతి చెందాడని సీఐ వివరించారు. దీంతో రోడ్డుకు ఇరువైపులా భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇద్దరు మృతదేహాలను బయటకు తీసి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
ముందు లారీలో ఉన్న డ్రైవర్ శ్రీరాంమూర్తి, క్లీనర్ రవికుమార్‌లకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. మృతుల కుంటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సీఐ కేసు నమోదు చేసుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం హుజురాబాద్ మార్చురీకి తరలించినట్లు సీఐ తెలిపారు. మృతులు ఇద్దరికీ భార్య పిల్లలు ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి గురైన లారీ విఘ్నేశ్వర ట్రాన్స్‌పోర్టుకు చెందింది కాగా మరో లారీ శరభ క్వారీకి చెందిందని పోలీసులు తెలిపారు.