చెట్టుకు కట్టేసి.. ఒంటికి నిప్పంటించి.. | Husband Killed Wife In Warangal | Sakshi
Sakshi News home page

భార్యను సజీవ దహనం చేసిన భర్త 

Aug 6 2018 12:54 PM | Updated on Aug 10 2018 1:17 PM

Husband Killed Wife In Warangal  - Sakshi

చెట్టుకు కట్టేసి నిప్పంటించిన ప్రదేశం(ఇన్‌సెట్‌) రజిత (ఫైల్‌)

పర్వతగిరి : వరంగల్‌ రూరల్‌ జిల్లా పర్వతగిరి మండలం తూర్పుతండాలో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భర్తే కాలయముడైయ్యాడు. వివాహేతర సంబంధం, మద్యం తాగటాన్ని ప్రశ్నించినందుకు బానోత్‌ రజిత(28)ను భర్త బానోత్‌ బాలు చెట్టుకు కట్టేసి ఒంటిపై కిరోసిన్‌ పోసి నిప్పంటించి సజీవ దహనానికి పాల్పడ్డాడు. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖానాపూర్‌ మండలం భూపతిపుటకు చెందిన లక్ష్మికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు.

కుమార్తె రజితను గత 9 సంవత్సరాల క్రితం పర్వతగిరి మండలం తూర్పుతండాకు చెందిన బానోత్‌ బాలుకు ఇచ్చి వివాహం చేశారు. బాలు, రజిత దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. కొద్ది రోజులు కాపురం సజావుగా సాగినప్పటికీ బాలు అదే గ్రామానికి చెందిన బంధువుతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్నారు. దీనిపై స్థానిక పీఎస్‌లో కేసు నమోదుతో పాటు కోర్టుకు కూడా హాజరైనాడు.  కొద్ది రోజులుగా సమసిపోయిన సమస్య మళ్లీ మొదటికి వచ్చింది.

మళ్లీ అక్రమ సంబంధం కొనసాగించడంతో పాటు నిత్యం మద్యం తాగి వచ్చి భార్య రజితతో గొడవ జరిగేదని చెప్పారు. వద్దని పలుమార్లు చెప్పినా వినకపోయేవాడని స్థానికులు అంటున్నారు. అర్ధరాత్రి సమయంలో మద్యం మత్తులో భార్యను కొట్టడంతో పాటు నింద కూడా వేసేవాడని పలువులు అంటున్నారు. అదే క్రమంలో శనివారం అర్ధరాత్రి 12 గంటల వరకు బాలు మద్యం మత్తులో ఇంటికి చేరుకుని భార్య రజితపై గొడవ చేశాడని తెలిపారు.

అయితే గతంలో అనేకమార్లు గొడవలకు భయపడి రజిత ఇతరుల ఇంట్లో తలదాచుకునేదన్నారు. అలా తప్పించుకోకుండా భర్త బాలు రజితను ఇంటి పక్కనే ఉన్న చెట్టుకు కట్టేసి కిరోసిన్‌ పోసి నిప్పంటించాడు. అరుపులు కేకలు చుట్టు పక్కల వారికి వినపడకుండా నోట్లో గుడ్డ నొక్కాడన్నారు. నోట్లో ఉన్న గుడ్డ కాలిపోవడంతో రజిత అరుపులు కేకలు వేసింది. మద్యం మత్తు నుంచి జారుకున్న బాలు భార్యను కట్లు విప్పే ప్రయత్నం చేశాడు. దీంతో బాలుకు కూడా చేతులు, కాళ్లు కాలిపోయాయి.

గమనించిన చుట్టు పక్కల వారు సంఘటన స్థలానికి చేరుకుని రజితను కాపాడే ప్రయత్నం చేశారు. 108లో ఎంజీఎంకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. రజిత మృతితో తూర్పుతండాలో విషాదం చోటుచేసుకుంది. చుట్టు పక్కల వారితో కలుపుగోలుగా ఉండేదని స్థానికులు విలపించారు.

మత్తులో ఉంటే చిత్రహింసలే..

మద్యం మత్తులో ఉన్నంత వరకు భార్యను చిత్రహింసలకు గురి చేసే వాడని, మత్తు దిగిన తర్వాత ఏమీ తెలియని అమాయకుడిలా ఉండే వాడని స్థానికులు అంటున్నారు. గతంలో మద్యం మత్తులో రజితను భూమిలోపల తల భాగం పైకి కనిపించే విధంగా పాతిపెట్టినట్లు వారు వాపోయారు. అనంతరం గమనించిన స్థానికులు భూమిలో నుంచి బయటకు తీసినట్లు చెప్పారు.  అయితే విచ్చలవిడిగా అర్ధరాత్రి వరకు బెల్టు షాపులు తెరచి ఉండటంతోనే బాలు మద్యం తాగి వచ్చే వాడని తండా వాసులు ఆరోపిస్తున్నారు.

సంఘటన స్థలాన్ని పరిశీలించిన డీసీపీ

తూర్పుతండాలో జరిగిన సంఘటన స్థలాన్ని డీసీపీ ఆర్‌. వెంకటేశ్వర్లు. ఏసీపీ శోభన్‌కుమార్‌లు పరిశీలించారు. స్థానికులు, బంధువులను సంఘటనకు దారి తీసిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. రజిత తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు బాలుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై కరుణాకర్‌రావు తెలిపారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement