రుత్విక్, సరిత (ఫైల్)
వరంగల్ క్రైం: రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న తల్లీ, కొడుకులను ఆర్టీసీ బస్సు రూపంలో మృత్యువు బలితీసుకుంది. కళ్లముందే కట్టుకున్న భార్య, కన్న కొడుకు ఇద్దరు రక్తం మడుగులో కొట్టుకుంటుంటే ఆ తండ్రి పడిన వేదన అందరి చేత కంటతడి పెట్టించాయి. సీఐ సంపత్‌కుమార్ కథనం ప్రకారం.. ఆత్మకూర్ మండలానికి చెంగిన పాపని సరిత (32), శ్రీనివాస్ దంపతులు బ్రాహ్మణవాడలో అద్దెకు ఉంటున్నారు.
వారికి కుమారుడు రుత్విక్ (7) ఉన్నాడు. శ్రీనివాస్ కేబుల్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. సరిత, రిత్విక్ ఆదివారం ఉదయం ఇంటర్నెట్‌లో పని ఉండి హన్మకొండ చౌరస్తాకు వచ్చారు. పని ముగించుకొని భర్త శ్రీనివాస్‌కు ఫోన్ చేయగా తాను కూడా చౌరస్తాకు వచ్చానని, అశోకా జంక్షన్ దగ్గర ఉండాలని ఫోన్‌లో చెప్పాడు. సరిత, రిత్విక్ ఇద్దరు చౌరస్తా నుంచి అశోక్ జంక్షన్ వైపు నడుచుకుంటూ వస్తున్నారు.
వారి వెనక సుమారు 5 నుంచి 10 మీటర్ల దూరంలో వెనక నుంచి శ్రీనివాస్ నడుచుకుంటూ వస్తున్నాడు. ఉదయం 10.43 గంటలకు హన్మకొండ పెట్రోల్ పంపు నుంచి బస్టాండ్ వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు జంక్షన్‌లో మూల తిరుగుతూ రోడ్డు దాటుతున్న సరిత, రిత్విక్‌ను బస్సు ఢీకొట్టి వారి మీది నుంచి వెళ్లిపోయింది. ఈ సంఘటన చూసిన స్థానికులు బస్సును నిలిపి వేశారు.
రిత్విక్ తల పగిలి అత్యంత దారుణంగా అక్కడికక్కడే మృతిచెందగా.. కొనఊపిరితో ఉన్న సరితను ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందినట్లు సీఐ సంపత్‌రావు తెలిపారు. తన కళ్ల ముందే భార్య సరిత, కొడుకు రిత్విక్‌లు ఇద్దరు రక్తం మడుగులో కొట్టుకుంటుంటే శ్రీనివాస్ గుండెలవిసెలా విలపించిన తీరు అందరి చేత కన్నీరు పెట్టించింది.
డ్రైవర్ నిర్లక్ష్యం..
హన్మకొండ పెట్రోల్‌పంపు నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు అశోక జంక్షన్‌లో మూల తిరగాల్సిన దగ్గర తిరగకుండా, చౌరస్తా నుంచి బస్టాండ్ వైపుకు ఉన్న ఫ్రీ లెప్ట్ నుంచి బస్సు మూల మలుపు తిరిగింది. ప్రభుత్వ జూనియర్ కళాశాల మూలమలుపులో నీళ్లు నిలిచిఉన్నాయి. డ్రైవర్ అజాగ్రత్తగా, మూలమలుపులో కూడా వేగంగా ఉండటం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు.
మిన్నంటిన బంధువుల రోదనలు..
ఎంజీఎం: రోడ్డు ప్రమాదంలో తల్లితో సహా కొడు కు సైతం మృతిచెందడంతో వారి బంధుమిత్రులు విషాదంలో మునిగిపోయారు. ఎంజీఎం ఆస్పత్రిలో ఆ మృతదేహాలకు ఆదివారం పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం స్వగ్రామమైన ఆత్మకూర్‌కు మృతదేహాలను తరలించారు. కాగా, మా ర్చురీ వద్ద కుటుంబసభ్యులను పరకాల ఎమ్మెల్యే చల్లాధర్మారెడ్డి, ధర్మరాజు పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment