ఖిలా వరంగల్/కాశిబుగ్గ: కొడుకుపై ఆ తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. బీటెక్ తరువాత విదేశాలకు పంపాలని ప్లాన్ చేసుకున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లోని ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మిషన్ కూడా పొందారు. మరో ఐదు రోజుల్లో కాలేజీకి వెళ్లాలి. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదం ఆ యువకుడిని బలితీసుకుంది. స్నేహితుడి ఇంటికి వెళ్లొస్తుండగా వీధి కుక్క అడ్డురావడంతో తప్పించబోగా బైక్ అదుపుతప్పి సైకిల్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న యువకుడితోపాటు సైకిల్‌పై ఉన్న వ్యక్తి కూడా అక్కడికక్కడే దుర్మరణం చెందారు. వరంగల్–నర్సంపేట రహదారిపై దయానందకాలనీ కనకదుర్గమ్మ దేవాలయం సమీపాన మంగళవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది.
స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. ములుగు జిల్లా ఏటూరునాగరం మండలం చిన్నబోయినపల్లి గ్రామానికి చెందిన తుమ్మ సంజీవరెడ్డి–నాగశ్రీ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు తుమ్మ జయసింహారెడ్డి, అలియాస్ టున్న(19) ఉన్నారు. ప్రస్తుతం వీరి కుటుంబం వరంగల్ పోచమ్మమైదానం సమీపంలోని టీచర్స్‌కాలనీలో నివాసం ఉంటుంది. కాగా, జయసింహారెడ్డి సోమవారం రాత్రి రంగశాయిపేటలోని స్నేహితుడి ఇంటికి వెళ్లొస్తానని తల్లిదండ్రులు చెప్పి బైక్‌పై వెళ్లాడు. తిరిగి మంగళవారం తెల్లవారుజామున సుమారు 2.40 గంటలకు టీచర్స్‌కాలనీలోని ఇంటికి బయలుదేరాడు.
వరంగల్–నర్సంపేట రహదారిలోని దయానందకాలనీ కనకదుర్గమ్మ దేవాలయం సమీపానికి రాగానే వేగంగా ఉన్న బైక్‌కు వీధి కుక్క అడ్డు వచ్చింది. కుక్కను తప్పించబోయే క్రమంలో సైకిల్‌పై కూరగాయల మార్కెట్‌కు బయలుదేరిన వరంగల్ గాంధీనగర్‌కు చెందిన ముదిగొండ నాగవీరం(47)ను బైక్ బలంగా ఢీకొట్టింది. దీంతో ఇద్దరు రోడ్డుపై పడిపోయి అక్కడికక్కడే మృతి చెందారు. జయసింహారెడ్డి మొబైల్ ఫొన్, నోట్లోని పళ్లు ఊడిపోయి రోడ్డుపై ఎగిరిపడ్డాయి. సమాచారం అందుకున్న మిల్స్‌కాలనీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతుల కుటుంబీలకు సమాచారం అందజేశారు.
అనంతరం మృతదేహాలను ఎంజీఎం మార్చురీకి తరలించారు. జయసింహారెడ్డి ఇటీవలే ఇంటర్ పూర్తి చేసి బీటెక్‌లో చేరేందుకు సిద్ధమయ్యాడు. చేతికొస్తున్న కొడుకు అకాల మరణం చెందడంతో కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. అలాగే, నాగవీరం పనికి వెళ్తేగాని కుటుంబం పూటగడవదు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు. చిన్నబోయినపల్లి, వరంగల్ టీచర్స్ కాలనీ, గాంధీనగర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడు ముదిగొండ నాగవీరం బావమరిది రాజనాల శ్రీనివాసప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు మిల్స్‌కాలనీ ఇన్‌స్పెక్టర్ ముస్కే శ్రీనివాస్ తెలిపారు.
అధ్వానంగా రహదారి..
దయానందకాలనీ నుంచి వెంకట్రామ జంక్షన్ వరకు ఇరువైపులా రోడ్డు ఇరుకుగా ఉందని, దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదని, రాంకీ వరకు రోడ్డు విస్తరణ చేసి వెంకట్రామ జంక్షన్ వరకు ఎందుకు చేయడంలేదో చెప్పాలంటున్నారు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు స్పందించి దయానందకాలనీ నుంచి వెంకట్రామ జంక్షన్ వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment