మూడు శాంతి, కొడుకు సతీష్ (ఫైల్)
గార్ల(ఇల్లందు) : వ్యవసాయ మోటార్ ఆన్ చేసే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురైన కొడుకు, అతడిని కాపాడేందుకు వెళ్లిన తల్లి మృతిచెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం అంజనాపురంలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన మూడు రాములు, శాంతి(38) దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. రాములుకు గ్రామ సమీపంలో 20 గుంటల భూమి ఉంది.
వ్యవసాయ బావి అన్నదమ్ముల పొత్తుల ఉండటంతో వంతులవారీగా నీరు వాడుకుంటున్నారు. వీరి వంతు రావడంతో పొలాన్ని దమ్ము చేసేందుకు నీళ్లు పెట్టాలని శుక్రవారం తెల్లవారుజామున శాంతి, పెద్ద కొడుకు సతీష్(21) కలిసి వెళ్లారు. సతీష్ మోటార్ ఆన్ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై విలవిలా కొట్టుకుంటున్నాడు. ఇది చూసిన తల్లి శాంతి కేకలు వేసి రక్షించేందుకు వెళ్లి అతడిని తాకింది. దీంతో విద్యుదాఘాతానికి గురై ఇద్దరు మృతిచెందారు.
వారి కేకలు విన్న రవి అనే యువకుడు వెళ్లి చూడగా ఇద్దరు విగతజీవుల్లా పడి ఉన్నారు. సతీష్ కొన ఊపిరితో ఉండటంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. సతీష్ ఖమ్మంలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతూ, కానిస్టేబుల్ కోచింగ్‌కు వెళ్తున్నాడు. శాంతి రోజూ ఖమ్మంలో కూలీ పనులకు వెళ్తుండేది. భర్త రాములు కూలీ పనులకు వెళ్తున్నాడు. చిన్న కుమారుడు ఇంటర్ చదువుతున్నాడు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతిచెందడంతో అంజనాపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment