అమ్మాయికి మద్దతుగా ఆందోళన చేస్తున్న బంధువులు, కుల పెద్దలు
జఫర్‌గఢ్: రెండేళ్ల పాటు ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మొహం చాటేసిన ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు తన కుటుంబ సభ్యులతో కలిసి నిరసనకు దిగిన సంఘటన మండలంలోని హిమ్మత్‌నగర్‌లో గ్రామంలో బుధవారం సాయంత్రం జరిగింది. బాధితురాలు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన గుడికందుల కుమార్, స్వరూప దపంతుల కూతురు అశ్వినితో మండలంలోని హిమ్మత్‌నగర్ గ్రామానికి చెందిన మేర్గు ఎల్లగౌడ్, శోభ దంపతుల కుమారుడు మేర్గు శ్రీకాంత్ ప్రేమాయణం సాగించాడు. అశ్విని మైనర్ కావడంతో రెండు సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకుందామని నమ్మబలికాడు.
అయితే గత డిసెంబర్ 31న అమ్మాయి ఇంటికి వచ్చిన శ్రీకాంత్‌ను పెళ్లి చేసుకోవమని నిలదీయగా అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించాడు. ఈ విషయంపై అమ్మాయి కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసుల ఆదేశాల మేరకు ఇరువర్గాలకు సంబంధించిన పెద్ద మనుషులు పంచాయితీ నిర్వహించి అశ్వినిని పెళ్లి చేసుకోమని చెప్పడంతో ఇందుకు శ్రీకాంత్, అతడి కుటుంబ సభ్యులు నిరాకరించారు.
దీంతో కలత చెందిన అశ్విని, కుటుంబ సభ్యులు శ్రీకాంత్ ఇంటి ఎదుట నిరసన తెలుపగా మహిళలు, పలువురు కుల పెద్దలు ఆమెకు మద్దతుగా నిలిచారు. ప్రియురాలు నిరసనకు దిగిన సమయంలో ప్రియుడి కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి పరారయ్యారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై వెంకటకృష్ణ ఘటన స్థలానికి చేరుకుని ఆమెకు, కుటుంబ సభ్యులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ వారు శాంతించలేదు. అశ్వినికి న్యాయం జరిగే తాము ఆందోళన విరమించేది లేదని తెగేసి చెప్పారు. దీంతో వారు రాత్రి వరకు నిరసన కొనసాగించారు.
Comments
Please login to add a commentAdd a comment