
ఆటవిడుపు అనర్థాలకు కారణం కావొచ్చు
అటవీ జంతువులకు ఆహారం ఇవ్వడం శిక్షార్హం
జంతు సంరక్షణకూ కొన్ని పరిమితులున్నాయి
పెంపుడు జీవాలకు మాత్రమే ఆహారం అందించాలంటున్న అధికారులు
హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో ఆవులు, కుక్కలు, పిల్లులతో పాటు విభిన్న రకాల పక్షులు వంటి మూగ జీవాలకు కొదవలేదు. అయితే వాటి సహజ జీవనాన్ని కొనసాగించడానికి అనువైన, అవసరమైన పర్యావరణ వ్యవస్థ లేదనేది వాస్తవ సత్యం. ఈ నేపథ్యంలో ఇలాంటి మూగజీవాలకు నగరవాసులు ఆహారం పెట్టడం అనేది సాధారణ అంశంగా మారింది. దయతో నగర పౌరులు వీధి కుక్కలు, పిల్లులు, పక్షులు వంటి జీవులకు ఆహారం పెడుతున్నారు. ఇది మానవీయతకు నిదర్శనం అయినప్పటికీ చట్ట పరంగా, పర్యావరణ పరంగా కొన్ని పరిమితులు, నిబంధనలూ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఈ అంశానికి సంబంధించి కొన్ని ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఈ అంశాలపైన నగరవాసులు దృష్టి కేంద్రీకరించారు. – సాక్షి, సిటీబ్యూరో
మూగ జీవాల పట్ల కనికరంగా ఉండడం అనేది సాటి ప్రాణిగా, మనుషులుగా మన బాధ్యత. ఇందులో భాగంగా వీధిలో నివసించే జంతువులు.. ముఖ్యంగా కుక్కలు, పిల్లులు వంటి జీవులు నిరాశ్రయంగా, ఆకలితో అలమటిస్తుంటాయి. నగరంలోని ఇలాంటి ప్రాణులకు నగరవాసులు, కొన్ని స్వచ్ఛంద సంస్థలు, జంతు ప్రేమికులు ఆహారం అందించడం అతి సహజంగా కనిపిస్తుంది. హైదరాబాద్ నగరంలో ఐతే కుక్కలకు అన్నం పెట్టడం, పక్షులకు గింజలు, నీళ్లు పెట్టడం కూడా తరచూ కనిపించే దృశ్యం. అయితే నగరం, శివారు ప్రాంతాలు అటవీ ప్రాంతాలతో కలసిపోయి ఉంటుంది. ఈ నేపథ్యంలో నగరంలో సాధారణ సాధు జంతువులతో పాటు పలు సందర్భాల్లో వన్యప్రాణులు కనిపిస్తుంటాయి. ఇలా అన్ని జంతువులకూ ఆహారం అందించడంలో చట్టపరంగా కొన్ని నిబంధనలు, పరిమితులు ఉన్నాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు.
చట్టం ఏం చెబుతోంది..
మూగ జీవాలను కాపాడేందుకు భారతదేశంలో ప్రివెన్షన్ ఆఫ్ క్రూరిటీ టు యానిమల్ (పీసీఏ) యాక్ట్ – 1960 అమలులో ఉంది. ఈ యాక్ట్ ప్రకారం జీవాలకు ఉద్దేశపూర్వకంగా హాని చేయడం నేరం. కానీ జీవాలకు ఆహారం పెట్టే విషయంలో ప్రత్యేకంగా నిషేధం లేదు. అయితే, కొన్ని సందర్భాల్లో ఇది ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే, స్థానిక మున్సిపల్ చట్టాలు, గృహ సంఘాలు నిబంధనలు విధించవచ్చు.
ఏ జీవాలకు ఆహారం వేయవచ్చు?
సాధారణంగా మనుషులతో మమేకమై జీవనం కొనసాగిస్తున్న వీధి కుక్కలు, పిల్లులు వంటి జీవాలకు ప్రజలు ఆహారం అందించవచ్చు. అయితే అది బహిరంగ ప్రదేశాల్లో కాకుండా, నివాస ప్రాంగణాల్లో ఇవ్వడం మంచిది. అనవసరంగా రోడ్లపై జంతువులు గుమిగూడడం వల్ల ప్రమాదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా నగరంలో అధికంగా ఉండే ట్రాఫిక్‌కు ఇది అంతరాయంగా మారుతుంది. నగరంలో ఎక్కువ సంఖ్యలో ఉండే పక్షులకు నీళ్లు, గింజలు వంటివి పెట్టవచ్చు. కాని అది ఎలక్ట్రిక్ వైర్ల దగ్గర, అపరిశుభ్ర ప్రాంతాల్లో ఉండకూడదు. ఆవులు, ఇతర జంతువుకు ఆహారం పెట్టే వారు రోడ్ల పైన కాకుండా సురక్షిత ప్రాతాల్లో పెట్టడం మంచిదని, అంతేకాకుండా ఆ జీవులు తినే ఆహారాన్ని మాత్రమే అందించాలని నిపుణులు సూచిస్తున్నారు.
వన్యప్రాణుల పట్ల జాగ్రత్త..
నగరంలో అరుదుగా కనిపించినా, అటవీ ప్రాంతానికి శివార్లలో నివసించేవారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. జింకలు, పులులు, ఎలుగుబంట్లు వంటి అటవీ జంతువులకు ఆహారం ఇవ్వడం అటవీ చట్టం ప్రకారం నేరం. అడవి జంతువులకు ఆహారం అందించడం, వాటిని ఆకర్షించేలా చేయడం, వాటి సహజ జీవన విధానాన్ని భంగపెట్టేలా చేయడం చట్టవిరుద్ధం. వీటిని ఉపేక్షిస్తే చట్టరిత్యా కఠిన చర్యలకు, శిక్షలకు గురికాక తప్పదు. అధిక సంఖ్యలో తారసపడే కోతుల వంటి వన్య ప్రాణులకు ఆహారం అందించకూడదు. దీని వల్ల అవి సహాజంగా ఆహారాన్ని సేకరించడం క్రమంగా కోల్పోవడమే కాకుండా సులభంగా లభించే ఆహారం కోసం జనావాసాల్లోకి వలసపడతాయి. ప్రమాదకరమైన విషసర్పాల వంటి ఇతర ప్రాణులకు ఆహారం ఇవ్వకూడదు. ముఖ్యంగా ప్రమాదకర వన్యప్రాణులను ఏ విధంగా ఆకర్షించినా వాటికి, మనుషులకు శ్రేయస్కరం కాదు.
భద్రతకు భంగం కలగకుండా..
మూగజీవాల పట్ల మానవీయతతో ఉండటం, వాటి సంరక్షణకు మన వంతు బాధ్యతను అందించడం మంచి విషయమే.. కానీ మానవీయత పేరుతో మనం జంతువులకు ఆహారం పెడితే, అది ఇతరుల హక్కులను, భద్రతను హరించేలా ఉండకూడదు. చట్టాన్నీ, సమాజాన్నీ గౌరవిస్తూ, జంతు సంక్షేమం పట్ల మన బాధ్యతను సమతుల్యంగా నిర్వహించాలని నిబంధలను సూచిస్తున్నాయి. ప్రభుత్వ మార్గదర్శకాలు, గృహ సంఘాల నిబంధనలు పాటిస్తూ.. మనుషుల ప్రేమను, కనికరాన్ని సమర్థవంతంగా చాటుకోవాలని జంతు ప్రేమికులు నినదిస్తున్నారు.