ఐదుగురు స్నేహితులను కబళించిన ప్రమాదం | Lorry Accident: 5 Friends Assassinate In Accident In Warangal | Sakshi
Sakshi News home page

వాహనంలోనే ఇరుక్కున్న మృతదేహాలు

Published Thu, Sep 3 2020 12:16 PM | Last Updated on Thu, Sep 3 2020 1:02 PM

Lorry Accident: 5 Friends Assassinate In Accident In Warangal - Sakshi

మృతదేహాలను కారు నుంచి బయటకు తీస్తున్న పోలీసులు

అందరూ మంచి స్నేహితులు.. అందులో ఓ మిత్రుడి సోదరుడి పుట్టిన రోజు వేడుకలకు హాజరయ్యారు. ఆనందంగా కార్యక్రమం ముగించుకున్నాక ఒక మిత్రుడిని స్వస్థలంలో దింపడానికి కారులో బయలుదేరారు. అప్పుడే తెల్లవారుతోంది. మసక మసక చీకటికి తోడు నిద్ర ఆవహించే సమయమది. జాతీయ రహదారిపై వేగంగా దూసుకెళ్తున్న వాహనాలు. కనులు తెరుస్తూ మూస్తూ డ్రైవింగ్‌ చేస్తున్నారు వాహనదారులు. ఈ క్రమంలో వేగంగా దూసుకొచ్చిన ఇసుక లారీ కారును ఢీకొనడంతో భారీ శబ్దం. తేరుకునేలోపే అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు యువకులు విగతజీవులుగా మారారు.

సాక్షి, దామెర(వరంగల్‌) : మిత్రుడి సోదరుడి పుట్టిన రోజు వేడుకలకు హాజరైన స్నేహితులను మృత్యురూపంలో వచ్చిన ఇసుక లారీ పొట్టన పెట్టుకుంది. గమ్యం చేరకముందే కారులో అందరూ విగతజీవులుగా మారారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా దామెర మండలం పసరగొండ క్రాస్‌ రోడ్డు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో వరంగల్‌ అర్బన్‌ జిల్లా పెద్దమ్మగడ్డకు చెందిన కండె జయప్రకాష్‌(23), పోచమ్మమైదాన్‌కు చెందిన మేకల రాకేష్‌(23), హసన్‌పర్తికి చెందిన గజవెల్లి రోహిత్‌(20), ములుగుకు చెందిన కొండబోయిన నరేష్‌(23), వరంగల్‌ రూరల్‌ జిల్లా నర్సంపేటకు చెందిన షేక్‌ షాబీర్‌(19) మృత్యువాత పడ్డారు. మృతుల్లో అందరూ పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారే కావడం గమనార్హం. 

వివరాలు.. పోలీసులు, మృతుల బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. గజవెల్లి రోహిత్‌(20), కండె జయప్రకాష్‌(23), షేక్‌ సాబీర్‌(19), మేకల రాకేష్‌(23) వీరంతా నగరంలోని పలు ప్రాంతాల్లో నివసిస్తుండగా కొండవేన నరేష్‌(23) మాత్రం ములుగుకు చెందిన వాడు. జయప్రకాష్‌ నగరంలోని ఓ కళాశాలలో డిగ్రీ చదువుతుండా మిగతావారంతా ప్రైవేట్‌ జాబ్‌ చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. మేకల రాకేష్‌ బంధువైన మేకల ప్రవీణ్‌ పుట్టిన రోజు వేడుకల కోసం మంగళవారం అర్ధరాత్రి అందరూ కలుసుకుని కేక్‌ కట్‌ చేసిన అనంతరం విందు చేసుకున్నారు. అనంతరం బుధవారం తెల్లవారుజామున నరేష్‌ను ములుగులో దింపడానికి కారులో బయలు దేరారు.

ఈ క్రమంలో దామెర మండలంలోని పసరగొండ క్రాస్‌ వద్దకు రాగానే కారు మరో వాహనాన్ని ఓవర్‌ టేక్‌ చేస్తున్న క్రమంలో ఎదురుగా వచ్చిన ఇసుక లారీ ఢీ కొట్టింది. కారు నుజ్జునుజ్జు కావడమే కాకుండా అందులోని వారంతా విగతజీవులుగా మారారు. విషయం తెలియగానే సంఘటనా స్థలాన్ని పరకాల ఏసీపీ శ్రీనివాస్, ఆత్మకూరు, శాయంపేట సీఐలు వెంకటేశ్వర్‌రావు, రంజిత్‌ కుమార్, ఎస్సై భాస్కర్‌ రెడ్డి, రాజబాబులు చేరుకొని కారులో ఇరుక్కుపోయిన మృత దేహాలను బయటికి తీసి మార్చురీకి తరలించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. మేకల చంద్రమౌళి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


మిన్నంటిన బంధువుల రోదనలు
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువకులు కుటుంబాల సభ్యుల రోదలను మిన్నుముట్టాయి. మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎంకు తరలించగా బంధువులు పెద్ద ఎత్తున మార్చూరీకి చేరుకున్నారు. చేతికొచ్చిన చెట్టంత కొడుకులను పోగొట్టుకున్న తల్లిదండ్రులు, వారి స్నేహితుల బోరున విలపించారు. 

బైక్‌ పెట్టి కారు అద్దె..?
జయప్రకాష్‌ అలియాస్‌ చందు తన బైక్‌ను హన్మకొండలోని హనుమాన్‌నగర్‌లో ఓ వడ్డీ వ్యాపారి వద్ద తనకా పెట్టి ఆ డబ్బుతో కారును అద్దెకు తీసుకుని వెళ్లినట్లు తెలుస్తోంది. అలాగే బైక్‌ రైడర్‌గా పేరున్న జయప్రకాష్‌ ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవింగ్‌ చేస్తూ ఉన్నాడని సమాచారం.

ప్రైవేట్‌ కంపెనీలో.. మేకల రాకేష్‌...
వరంగల్‌ : వరంగల్‌ పోచమ్మమైదాన్‌కు చెందిన మేకల చంద్రమౌళి, స్వరూప దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు రాకేష్‌ ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఏడాది క్రితం మహేశ్వరీని ప్రేమించి పెళ్లి చేసుకోగా రెండు నెలల క్రితం పాప జన్మించింది. ఎదిగిన కొడుకు మృతి చెందడంతో కుటుంబం సభ్యులు విలపిస్తున్నారు. 

బేకరీలో పనిచేస్తూ.. షేక్‌సాబీర్‌.. 
నర్సంపేట రూరల్‌ : వరంగల్‌ రూరల్‌ జిల్లా నర్సంపేట పట్టణానికి చెందిన షేక్‌ యాకూబ్‌– నూర్జాన్‌ దంపతుల కుమారుడు సాబీర్‌(19). చిన్నతనంలో తండ్రి యాకూబ్‌ మృతిచెందాడు. సాబీర్‌ కొంతకాలంగా వరంగల్‌ పోచమ్మమైదాన్‌లోని ఒక బేకరీలో పనిచేస్తూ ఆటోనగర్‌లో అద్దెకు ఉంటున్నాడు. సాబీర్‌ తల్లి ఖానాపూర్‌ బీసీ హాస్టల్‌ వర్కర్‌గా పనిచేస్తోంది. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు విలిపస్తున్నారు. 

బైక్‌ రైడింగ్‌లో ఫేమస్‌..జయప్రకాష్
హన్మకొండ చౌరస్తా : హన్మకొండలోని పెద్దమ్మగడ్డకు చెందిన మేడి జయప్రకాష్‌(23) అలియాస్‌ చందు కమ్యూనిస్టు నాయకుడిగా పేరున్న నర్సయ్యకు ఒక్కేఒక్క కుమారుడు. దీంతో తల్లిదండ్రులు చిన్న నాటి నుంచి గారాబంగా పెంచారు. పాఠశాల విద్యతోనే చదువు మానేసిన జయప్రకాష్‌ చెడు అలవాట్లకు బానిసయ్యాడు. బైక్‌ రైడింగ్‌లో ఫేమస్‌ అయిన ఇతడు సినీ నటుడు పవన్‌ కళ్యాణ్‌ అభిమాని. అయితే ఈనెల 2న పవన్‌ కళ్యాణ్‌ పుట్టినరోజు కావడంతో మంగళవారం కాళేశ్వరానికి వెళ్లి అక్కడి నుంచి బొగత జలపాతం చేరుకుని పుట్టిన రోజు వేడుకుల జరుపుకున్నట్లు స్థానికంగా చర్చించుకుంటున్నారు.  

క్యాటరింగ్, డెకరేషన్‌ : రోహిత్
నయీంనగర్‌ : హన్మకొండ నయీంనగర్‌ లష్కర్‌ సింగారానికి చెందిన గజవల్లి రోహిత్‌(20) అలియాస్‌ కెన్ని స్వస్థలం హసన్‌పర్తి మండలం వంగపాడు గ్రామం. రోహిత్‌ తాత గజవల్లి శంభులింగం చిందు నాటకాలు చేసే వారు. రోహిత్‌ తండ్రి గజవల్లి యాదగిరి ఎల్లాపూర్‌లో పాస్టర్‌గా పని చేస్తున్నారు. ఏళ్ల క్రితమే శంభులింగం తన కుమారులతో హనుమకొండ లష్కర్‌ సింగారానికి వచ్చి నివసిస్తున్నారు. రోహిత్‌ పదో తరగతి మధ్యలోనే మానేసి క్యాటరింగ్, డెకరేషన్‌ పనులు చేస్తున్నాడు. పనిచేసే చోట పరిచయమైన వారితో కలసి వెళ్లి మృత్యువాత పడ్డారని కుటుంబ సభ్యులు రోదిస్తూ తెలిపారు. 

కొండవేన నరేష్‌..
ములుగు రూరల్‌: ములుగుకు చెందిన కొండవేన సరోజన–సాంబయ్య దంపతుల కుమారుడు నరేష్‌. అతడి తండ్రి 20 ఏళ్ల క్రితమే అనారోగ్యంతో మృతి చెందాడు. నరేష్‌ కొంతకాలం హైదరాబాద్‌లో పని చేసుకుంటూ జీవనం కొనసాగించి.. కొంత కాలంగా ములుగులో ఉంటున్నాడు.

ప్రాణాలు దక్కించుకున్న ప్రవీణ్‌ 
మేకల ప్రవీణ్‌ పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న అనంతరం ప్రవీణ్‌ కూడా కారులో వెళ్లాల్సి ఉంది. అయితే కారులో ఐదుగురే కూర్చునే వీలుండడంతో ప్రవీణ్‌ ఇంటి వద్దే ఉండిపోయాడు. దీంతో అతను ప్రాణాలతో బయటపడ్డాడు. అప్పటి వరకు తనతో ఆనందంగా ఉన్న మిత్రులందరూ ఒక్కసారిగా విగత జీవులుగా మారడంతో ప్రవీణ్‌ బోరున విలపించాడు. 

అతి వేగం కూడా కారణమే..
కారు అతి వేగం కూడా ప్రమాదానికి కారణమని పోలీసులు చెపుతున్నారు. కారులో ఉన్న వారు సీట్‌ బెల్టులు పెట్టుకొని ప్రయాణిస్తున్నా బెలూన్లు తెరుచుకుని అవి పూర్తిగా పగిలి పోయాయని తెలిపారు. కారు వేగంగా వెళ్లకుంటే ప్రాణాలు దక్కేవని పేర్కొంటున్నారు.

సంఘటనా స్థలాన్ని పరిశీలించిన డీసీపీ
పసరగొండ క్రాస్‌ వద్ద బుధవారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ఇన్‌చార్జి డీసీపీ వెంకటలక్ష్మి మధ్యాహ్నం పరిశీలించారు. ఘటన జరగడానికి గల కారణాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆమె వెంట ఏసీపీ శ్రీనివాస్, శాయంపేట్, ఆత్మకూర్‌ సీఐలు వెంకటేశ్వర్‌ రావు, రంజిత్‌ కుమార్, ఎస్సైలు భాస్కర్‌రెడ్డి, రాజబాబు ఉన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

ప్రమాద స్థలంలో లారీ, కారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement