friends dead
-
ప్రాణస్నేహితులు.. విధి ఆడిన ఆటలో ఆ నలుగురు నాలుగేళ్లలో...
చంద్రగిరి(చిత్తూరు జిల్లా): ఆ నలుగురు ప్రాణస్నేహితులు.. వారి స్నేహాన్ని చూసి స్థానికులు ముచ్చట పడేవారు. అలాంటి వారు విధి ఆడిన ఆటలో ఓడిపోయారు. ఆ నలుగురూ నాలుగేళ్లలో వేర్వేరు ప్రమాదాల్లో మృత్యుఒడికి చేరుకున్నారు. వివరాల్లోకెళ్తే.. రామచంద్రాపురం మండలం ఉప్పలవంకకు చెందిన సురేంద్ర రెడ్డి, వెంకటాచలం రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, శేఖర్‌రెడ్డి చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. వీరు వ్యవసాయంతో పాటు కూలి పనులు చేసుకునేవారు. 2018లో ఉప్పలవంక సమీపంలో బైక్‌పై వస్తున్న సురేంద్ర రెడ్డిని ట్రాక్టర్ ఢీకొనడంతో మృతి చెందాడు. చదవండి: పెళ్లి మధ్యలో సొమ్మసిల్లిన వరుడు.. వధువుకి షాక్, ఆగిపోయిన పెళ్లి 2021లో గ్రామ సమీపంలోని బావిలో మోటారు తెస్తుండగా వెంకటాచలంరెడ్డి మృతిచెందాడు. చంద్రగిరి సమీపంలోని ఇందిరమ్మ కాలనీ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రాజశేఖరరెడ్డి అక్కడికక్కడే చనిపోగా, శేఖర్‌రెడ్డి(27) తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని తిరుపతి రుయాకు తరలించారు. అక్కడి నుంచి స్విమ్స్‌కు, మళ్లీ వేలూరు సీఎంసీకి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం చెన్నై తరలించాలని సూచించారు. చెన్నై తరలిస్తుండగా ఆదివారం ఉదయం మార్గమధ్యలో మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నాలుగేళ్లలో నలుగురు స్నేహితులు వివిధ ప్రమాదాల్లో మృతి చెందడంతో ఆ గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. వారి కుటుంబ సభ్యులు మనోవేదన చెందుతున్నారు. -
ధర్మవరంలో విషాదం: మరణంలోనూ వీడని స్నేహం
ధర్మవరం రూరల్: ఆ యువకులు ప్రాణ స్నేహితులు. చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకున్నారు.. చదువుకున్నారు. ఇప్పుడు ఒకే రకమైన వ్యాపారం చేసుకుంటూ వారి కుటుంబాలకు చేదోడువాదోడుగా ఉంటున్నారు. అవివాహితులైన వీరిద్దరిని రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు కబళించింది. రెండు కుటుంబాల్లోనూ తీరని విషాదం నింపింది. వివరాలిలా ఉన్నాయి. ధర్మవరం పట్టణంలోని రాజేంద్రనగర్‌కు చెందిన అంకే ధనుశ్ (25), రాంనగర్‌కు చెందిన భీమనపల్లి అనిల్‌కుమార్ (27) మిత్రులు. వీరిద్దరూ మగ్గం నేస్తూ పట్టు చీరల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించేవారు. మగ్గం సామగ్రి కోసం ఆదివారం గోరంట్లకు వెళ్లారు. పని ముగించుకుని అక్కడి నుంచి తిరిగి ద్విచక్రవాహనంపై వస్తుండగా ధర్మవరం మండలం మోటుమర్ల గ్రామం వద్ద ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. తీవ్రగాయాలవడంతో ధనుశ్, అనిల్‌కుమార్ అక్కడికక్కడే మృతి చెందారు. రూరల్ ఎస్ఐ ప్రదీప్‌కుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే ఆర్టీసీ ఆర్ఎం సుమంత్ ఆదోని, సీటీఎం గోపాల్‌రెడ్డి, ధర్మవరం, పుట్టపర్తి డిపో మేనేజర్లు మల్లికార్జున, ఇనయతుల్లా, ఈయూ నాయకులు నాగార్జునరెడ్డి, సుమో శీనా తదితరులు ఘటన స్థలాన్ని పరిశీలించి, ప్రమాదంపై స్థానికులను ఆరా తీశారు. స్నేహితులిద్దరూ ఒకేసారి ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేసింది. -
ఐదుగురు స్నేహితులను కబళించిన ప్రమాదం
అందరూ మంచి స్నేహితులు.. అందులో ఓ మిత్రుడి సోదరుడి పుట్టిన రోజు వేడుకలకు హాజరయ్యారు. ఆనందంగా కార్యక్రమం ముగించుకున్నాక ఒక మిత్రుడిని స్వస్థలంలో దింపడానికి కారులో బయలుదేరారు. అప్పుడే తెల్లవారుతోంది. మసక మసక చీకటికి తోడు నిద్ర ఆవహించే సమయమది. జాతీయ రహదారిపై వేగంగా దూసుకెళ్తున్న వాహనాలు. కనులు తెరుస్తూ మూస్తూ డ్రైవింగ్ చేస్తున్నారు వాహనదారులు. ఈ క్రమంలో వేగంగా దూసుకొచ్చిన ఇసుక లారీ కారును ఢీకొనడంతో భారీ శబ్దం. తేరుకునేలోపే అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు యువకులు విగతజీవులుగా మారారు. సాక్షి, దామెర(వరంగల్) : మిత్రుడి సోదరుడి పుట్టిన రోజు వేడుకలకు హాజరైన స్నేహితులను మృత్యురూపంలో వచ్చిన ఇసుక లారీ పొట్టన పెట్టుకుంది. గమ్యం చేరకముందే కారులో అందరూ విగతజీవులుగా మారారు. వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలం పసరగొండ క్రాస్ రోడ్డు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో వరంగల్ అర్బన్ జిల్లా పెద్దమ్మగడ్డకు చెందిన కండె జయప్రకాష్(23), పోచమ్మమైదాన్‌కు చెందిన మేకల రాకేష్(23), హసన్పర్తికి చెందిన గజవెల్లి రోహిత్(20), ములుగుకు చెందిన కొండబోయిన నరేష్(23), వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటకు చెందిన షేక్ షాబీర్(19) మృత్యువాత పడ్డారు. మృతుల్లో అందరూ పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారే కావడం గమనార్హం. వివరాలు.. పోలీసులు, మృతుల బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. గజవెల్లి రోహిత్(20), కండె జయప్రకాష్(23), షేక్ సాబీర్(19), మేకల రాకేష్(23) వీరంతా నగరంలోని పలు ప్రాంతాల్లో నివసిస్తుండగా కొండవేన నరేష్(23) మాత్రం ములుగుకు చెందిన వాడు. జయప్రకాష్ నగరంలోని ఓ కళాశాలలో డిగ్రీ చదువుతుండా మిగతావారంతా ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. మేకల రాకేష్ బంధువైన మేకల ప్రవీణ్ పుట్టిన రోజు వేడుకల కోసం మంగళవారం అర్ధరాత్రి అందరూ కలుసుకుని కేక్ కట్ చేసిన అనంతరం విందు చేసుకున్నారు. అనంతరం బుధవారం తెల్లవారుజామున నరేష్‌ను ములుగులో దింపడానికి కారులో బయలు దేరారు. ఈ క్రమంలో దామెర మండలంలోని పసరగొండ క్రాస్ వద్దకు రాగానే కారు మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేస్తున్న క్రమంలో ఎదురుగా వచ్చిన ఇసుక లారీ ఢీ కొట్టింది. కారు నుజ్జునుజ్జు కావడమే కాకుండా అందులోని వారంతా విగతజీవులుగా మారారు. విషయం తెలియగానే సంఘటనా స్థలాన్ని పరకాల ఏసీపీ శ్రీనివాస్, ఆత్మకూరు, శాయంపేట సీఐలు వెంకటేశ్వర్రావు, రంజిత్ కుమార్, ఎస్సై భాస్కర్ రెడ్డి, రాజబాబులు చేరుకొని కారులో ఇరుక్కుపోయిన మృత దేహాలను బయటికి తీసి మార్చురీకి తరలించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. మేకల చంద్రమౌళి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మిన్నంటిన బంధువుల రోదనలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువకులు కుటుంబాల సభ్యుల రోదలను మిన్నుముట్టాయి. మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎంకు తరలించగా బంధువులు పెద్ద ఎత్తున మార్చూరీకి చేరుకున్నారు. చేతికొచ్చిన చెట్టంత కొడుకులను పోగొట్టుకున్న తల్లిదండ్రులు, వారి స్నేహితుల బోరున విలపించారు. బైక్ పెట్టి కారు అద్దె..? జయప్రకాష్ అలియాస్ చందు తన బైక్‌ను హన్మకొండలోని హనుమాన్‌నగర్‌లో ఓ వడ్డీ వ్యాపారి వద్ద తనకా పెట్టి ఆ డబ్బుతో కారును అద్దెకు తీసుకుని వెళ్లినట్లు తెలుస్తోంది. అలాగే బైక్ రైడర్‌గా పేరున్న జయప్రకాష్ ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడని సమాచారం. ప్రైవేట్ కంపెనీలో.. మేకల రాకేష్... వరంగల్ : వరంగల్ పోచమ్మమైదాన్‌కు చెందిన మేకల చంద్రమౌళి, స్వరూప దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు రాకేష్ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఏడాది క్రితం మహేశ్వరీని ప్రేమించి పెళ్లి చేసుకోగా రెండు నెలల క్రితం పాప జన్మించింది. ఎదిగిన కొడుకు మృతి చెందడంతో కుటుంబం సభ్యులు విలపిస్తున్నారు. బేకరీలో పనిచేస్తూ.. షేక్‌సాబీర్.. నర్సంపేట రూరల్ : వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట పట్టణానికి చెందిన షేక్ యాకూబ్– నూర్జాన్ దంపతుల కుమారుడు సాబీర్(19). చిన్నతనంలో తండ్రి యాకూబ్ మృతిచెందాడు. సాబీర్ కొంతకాలంగా వరంగల్ పోచమ్మమైదాన్‌లోని ఒక బేకరీలో పనిచేస్తూ ఆటోనగర్‌లో అద్దెకు ఉంటున్నాడు. సాబీర్ తల్లి ఖానాపూర్ బీసీ హాస్టల్ వర్కర్‌గా పనిచేస్తోంది. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు విలిపస్తున్నారు. బైక్ రైడింగ్‌లో ఫేమస్..జయప్రకాష్ హన్మకొండ చౌరస్తా : హన్మకొండలోని పెద్దమ్మగడ్డకు చెందిన మేడి జయప్రకాష్(23) అలియాస్ చందు కమ్యూనిస్టు నాయకుడిగా పేరున్న నర్సయ్యకు ఒక్కేఒక్క కుమారుడు. దీంతో తల్లిదండ్రులు చిన్న నాటి నుంచి గారాబంగా పెంచారు. పాఠశాల విద్యతోనే చదువు మానేసిన జయప్రకాష్ చెడు అలవాట్లకు బానిసయ్యాడు. బైక్ రైడింగ్‌లో ఫేమస్ అయిన ఇతడు సినీ నటుడు పవన్ కళ్యాణ్ అభిమాని. అయితే ఈనెల 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడంతో మంగళవారం కాళేశ్వరానికి వెళ్లి అక్కడి నుంచి బొగత జలపాతం చేరుకుని పుట్టిన రోజు వేడుకుల జరుపుకున్నట్లు స్థానికంగా చర్చించుకుంటున్నారు. క్యాటరింగ్, డెకరేషన్ : రోహిత్ నయీంనగర్ : హన్మకొండ నయీంనగర్ లష్కర్ సింగారానికి చెందిన గజవల్లి రోహిత్(20) అలియాస్ కెన్ని స్వస్థలం హసన్‌పర్తి మండలం వంగపాడు గ్రామం. రోహిత్ తాత గజవల్లి శంభులింగం చిందు నాటకాలు చేసే వారు. రోహిత్ తండ్రి గజవల్లి యాదగిరి ఎల్లాపూర్‌లో పాస్టర్‌గా పని చేస్తున్నారు. ఏళ్ల క్రితమే శంభులింగం తన కుమారులతో హనుమకొండ లష్కర్ సింగారానికి వచ్చి నివసిస్తున్నారు. రోహిత్ పదో తరగతి మధ్యలోనే మానేసి క్యాటరింగ్, డెకరేషన్ పనులు చేస్తున్నాడు. పనిచేసే చోట పరిచయమైన వారితో కలసి వెళ్లి మృత్యువాత పడ్డారని కుటుంబ సభ్యులు రోదిస్తూ తెలిపారు. కొండవేన నరేష్.. ములుగు రూరల్: ములుగుకు చెందిన కొండవేన సరోజన–సాంబయ్య దంపతుల కుమారుడు నరేష్. అతడి తండ్రి 20 ఏళ్ల క్రితమే అనారోగ్యంతో మృతి చెందాడు. నరేష్ కొంతకాలం హైదరాబాద్‌లో పని చేసుకుంటూ జీవనం కొనసాగించి.. కొంత కాలంగా ములుగులో ఉంటున్నాడు. ప్రాణాలు దక్కించుకున్న ప్రవీణ్ మేకల ప్రవీణ్ పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న అనంతరం ప్రవీణ్ కూడా కారులో వెళ్లాల్సి ఉంది. అయితే కారులో ఐదుగురే కూర్చునే వీలుండడంతో ప్రవీణ్ ఇంటి వద్దే ఉండిపోయాడు. దీంతో అతను ప్రాణాలతో బయటపడ్డాడు. అప్పటి వరకు తనతో ఆనందంగా ఉన్న మిత్రులందరూ ఒక్కసారిగా విగత జీవులుగా మారడంతో ప్రవీణ్ బోరున విలపించాడు. అతి వేగం కూడా కారణమే.. కారు అతి వేగం కూడా ప్రమాదానికి కారణమని పోలీసులు చెపుతున్నారు. కారులో ఉన్న వారు సీట్ బెల్టులు పెట్టుకొని ప్రయాణిస్తున్నా బెలూన్లు తెరుచుకుని అవి పూర్తిగా పగిలి పోయాయని తెలిపారు. కారు వేగంగా వెళ్లకుంటే ప్రాణాలు దక్కేవని పేర్కొంటున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన డీసీపీ పసరగొండ క్రాస్ వద్ద బుధవారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ఇన్చార్జి డీసీపీ వెంకటలక్ష్మి మధ్యాహ్నం పరిశీలించారు. ఘటన జరగడానికి గల కారణాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆమె వెంట ఏసీపీ శ్రీనివాస్, శాయంపేట్, ఆత్మకూర్ సీఐలు వెంకటేశ్వర్ రావు, రంజిత్ కుమార్, ఎస్సైలు భాస్కర్‌రెడ్డి, రాజబాబు ఉన్నారు. -
మిత్రులకు అంతిమ వీడ్కోలు
పాపన్నపేట(మెదక్): తనువులు వేరైనా మనస్సులు ఒక్కటిగా జీవన యానం చే సిన మిత్రులిద్దరు..కలిసే మరణించారు.. కలిసే అంతిమ యాత్రకు తరలి వెళ్లారు. గురువారం రోడ్డు ప్రమాదం ఇద్దరు యువకుల ఉసురు తీసింది. ఊరందరితో కలసి మెలసి ఉండే ఇద్దరు మిత్రులు ఒకే సారి మృత్యువాత పడటంతో ఆరెపల్లి కన్నీటి సంద్రమైంది. శుక్రవారం నరేందర్‌రావు, రజనీకాంత్‌ల అంత్యక్రియలు ఆత్మీయుల అశ్రునయనాల మధ్య జరిగాయి. చేతికొచ్చిన కొడుకులు చేజారిపాయే.. పాపన్నపేట మండలం ఆరెపల్లికి చెందిన రాధాబాయి, రాజేశ్వర్రావుల ఏకైక కుమారుడు నరేందర్‌రావు (38) ఇతనికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. రేషన్ డీలర్‌గా పనిచేసే ఈయన, సొంతభూమితోపాటు ఇతరుల భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తు కుటుంబానికి పెద్ద దిక్కుగా మారాడు. ఒక్కగా నొక్క కొడుకు మరణించడంతో తల్లిదండ్రులు, భార్యాబిడ్డలు కన్నీరు మున్నీరయ్యారు. అదే గ్రామానికి చెందిన సత్యాబాయి, రామారావుల కుమారుడు రజనీకాంత్, పీజీ వరకు చదువుకున్న ఈయన కొంతకాలం పాటు మెదక్‌లోని ప్రైవేట్ పాఠశాలలో పనిచేశాడు. అనంతరం భవన నిర్మాణ రంగంలో కొన్నాళ్లు పనిచేశాడు. ప్రస్తుతం పొడిచన్పల్లి వద్ద ఒక పెట్రోల్‌బంకులో పని చేస్తు కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలుస్తున్నాడు. చేతికొచ్చిన కొడుకు మరణించడంతో తల్లిదండ్రులు, భార్యా బిడ్డలకు తీరనిలోటు. అంత్యక్రియలకు మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి హాజరై నివాళులర్పించారు. -
ఉద్యోగవేటకు బయలుదేరి..
నాయుడుపేటటౌన్: నాయుడుపేట రైల్వేస్టేషన్ సమీపంలో సోమవారం జరిగిన రైలు కిందపడి మృతిచెందిన ఇద్దరు యువకుల పూర్తి వివరాలను మంగళవారం కుటుంబ సభ్యుల నుంచి రైల్వే పోలీసులు సేకరించారు. ఇద్దరూ స్నేహితులు. రద్దీగా ఉన్న ఎక్స్‌ప్రెస్ రైలులో ఫుట్‌పాత్ వద్ద ప్రయాణం చేస్తూ ప్రమాదవశాత్తు జారి పడిపోతున్న స్నేహితుడిని మరో స్నేహితుడు కాపాడేందుకు ప్రయత్నించాడు. ఈక్రమంలో ఇద్దరూ దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. సూళ్లూరుపేట రైల్వే పోలీసు స్టేషన్ ఎస్సై కృష్ణయ్య కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కృష్ణా జిల్లా పెదపరిపూడి మండలం వింజీరంపాడు గ్రామానికి చెందిన వీర్ల సంపత్‌కుమార్ యాదవ్ (25) బీటెక్ పూర్తి చేసి చెన్నైలోని ఓ ప్రైవేట్ పరిశ్రమలో ఉద్యోగం చేస్తున్నాడు. నెలకోసారి స్వగ్రామానికి వచ్చి తల్లిదండ్రులను కలిసి వెళుతుంటాడు. ఈక్రమంలో సంపత్‌కుమార్ స్నేహితులైన విజయవాడ వెంకటేశ్వరపురం ప్రాంతానికి చెందిన సోప్పవరపు మణిరోహిత్ (22), విజయవాడ మధురానగర్‌కు చెందిన మరో స్నేహితుడు కాశేపు ఉమామహేష్లు బీటెక్ పూర్తి చేశారు. చిన్ననాటి స్నేహితులైన ఇద్దరూ చెన్నైకు వెళ్లే ఏదైనా ఉద్యోగాలు చుసుకోవచ్చని మాట్లాడుకున్నారు. దీంతో సోమవారం మధ్యాహ్నం విజయవాడ నుంచి సంపత్‌కుమార్, మణిరోహిత్, ఉమామహేష్లు ముగ్గురూ కలిసి హౌరా – తిరుచ్చి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలులో చెన్నైకు బయలుదేరారు. రైలు నాయుడుపేటకు వచ్చే సరికి ఫుట్‌పాత్ సమీపంలో ఉన్న ముగ్గురి స్నేహితుల్లో మణిరోహిత్ ప్రమాదవశాత్తు జారిపడిబోతుండగా సంపత్‌కుమార్ అతడిని కాపాడబోయాడు. ఈ క్రమంలో ఇద్దరూ రైలు కిందపడి అక్కడికక్కడే దుర్మరణం చెందారని రైల్వే పోలీసులు తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేశారు. రెండు మృతదేహాలకు మంగళవారం స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో పోస్టుమార్టం చేయించి కుటుంబ సభ్యులకు అప్పగించడంతో వారు స్వగ్రామాలకు తీసుకెళ్లారు. కళ్లెదుటే ప్రాణాలు పోయాయి రైలులో వెళుతుండగా మార్గమధ్యలో నాయుడుపేటలో తన కళ్లదుటే ఇద్దరూ ప్రమాదవశాత్తు జారిపడి ప్రాణాలు పోగొట్టుకున్నారని ఈ సంఘటనను ప్రత్యక్షంగా చూసిన ఉమామõßహేష్ కన్నీటి పర్యంతమయ్యాడు. అదేవిధంగా రైలు ప్రమాదంలో సంపత్‌కుమార్ మృతిచెందినట్టుగా తెలుసుకున్న అతని తండ్రి శ్రీనివాసరావు ఆవేదనకు అంతులేకుండా పోయింది. ఒక్కగానొక్క కుమారుడు కుటుంబానికి ఆధారంగా ఉంటాడని భావించిన తండ్రి సంపత్ మృతితో తల్లడిల్లిపోయాడు. గుర్తుపట్టలేని విధంగా శరీరం నుజ్జునుజ్జుగా మారిన మణిరోహిత్ కుటుంబసభ్యులు ఆవేదనకు అంతులేకుండా పోయింది. యాదవ్ సంక్షేమ సంఘ నాయకుల సంతాపం రైలు ప్రమాదంలో విజయవాడ ప్రాంతానికి చెందిన విద్యార్థులు సంపత్‌కుమార్ యాదవ్, మణిరోహిత్లు మృతి చెందినట్లు తెలుసుకున్న స్థానిక యాదవ సంక్షేమ సంఘ నాయకులు మంగళవారం ప్రభుత్వ వైద్యశాల వద్దకు చేరుకుని సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చి యువకులు మృతదేహాలకు త్వరితగతిన పోస్టుమార్టం నిర్వహించేలా రైల్వే పోలీసులు, వైద్యులతో మాట్లాడి సహాయ సహకారాలు అందించారు. -
కారు ఢీకొని ముగ్గురి మృతి
శుభకార్యానికి వెళ్తూ రోడ్డు పక్కన ఆగిన ముగ్గురు యువకులను మృత్యువు కారు రూపంలో వచ్చి కబళించింది.ఈ సంఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని నాగార్జునసాగర్ హైవేపై చోటుచేసుకుంది. హస్తినాపురం: వేగంగా వచ్చిన కారు అదుపు తప్పి రోడ్డు పక్కన నిలబడి ఉన్న ముగ్గురు యువకులను ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడిన వారు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం నేరెడుగొమ్మ గ్రామానికి చెందిన కెతావత్ గణేశ్ (21), హస్తినాపురంలోని తిరుమల కాలనీలో ఉంటూ అక్షర ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు. మిర్యాలగూడ వెంకటాద్రిపాలెంకు చెందిన ధరావత్ సాయికుమార్ (20), ఎల్బీనగర్లోని కాకతీయకాలనీలో నివాసం ఉంటూ బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మిర్యాలగూడ వెంకటాద్రిపాలెంకు చెందిన ధరావత్ వంశీ (19) సరస్వతీకాలనీలో నివాసం ఉంటూ ల్యాబ్ టెక్నీషియన్ పనిచేస్తున్నాడు. గృహ ప్రవేశానికి వెళుతూ తిరిగిరాని లోకాలకు.. ముగ్గురు యువకులు కలిసి ఎల్బీనగర్ నుంచి ఆదివారం ఉదయం ద్విచక్రవాహనంపై గుర్రంగూడలోని తమ బందువుల గృహ ప్రవేశానికి వెలుతున్నారు. గుర్రంగూడ సమీపంలోని ఫ్లైటెక్ ఏవియేషన్ అకాడమీ సమీపంలో జ్యాస్ టిఫిన్ సెంటర్‌కు ఎదురుగా ద్విచక్ర వాహనాన్ని పక్కకు ఆపి నిలబడి మాట్లాడుకుంటుండగా అంతలోనే వనస్థలపురం వైపు నుంచి అతివేగంగా వచ్చిన మహింద్రా జైలో కారు నంబరు (టీఎస్ 07 యూఈ 6797) ఈ ముగ్గురిపైకి దూసుకొచ్చింది. ఏమైందో తెలుసుకునే లోపే ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడి రక్తసిక్తమై అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. అతివేగంతో వచ్చిన కారు వారిని ఢీకొట్టి రోడ్డుకు సమీపంలో ఉన్న గోడకు తగిలి బొల్తాపడింది. డ్రైవరు బొల్తాపడిన కారులోంచి డోర్ తీసుకుని బయటకు వచ్చి అక్కడ నుంచి పరారయ్యాడు. ఈ సంఘటనను గమనించి అటుగా వెలుతున్న వాహనదారులు 100కు సమాచారం అందించండంతో వనస్థలిపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే ముగ్గు రు యువకులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతి చెందిన ముగ్గురి మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
మృతదేహాలతోపాటు, బైక్‌ను నాలుగు కిలోమీటర్లు..
వారి తీయని స్నేహంలో విధి విషం చిమ్మింది.. కన్నవారి ఆశలను తుంచేస్తూ మృత్యుదేవత వారి ప్రాణాలను హరించేసింది.. లారీ డ్రైవర్ మద్యం మత్తు వారి కలల్ని ఈడ్చుకుపోయింది.. ముక్కచెక్కలైన వారి దేహాలను చూసి చూపరులకు సైతం మనసు వికలమైపోయింది. అత్యంత దారుణంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంటర్ చదువుతున్న ముగ్గురు నూనూగు మీసాల యువకులు మృత్యువాత పడడమే ఒక ఘోరం కాగా.. వారు ప్రమాదానికి గురైన తీరు మరింత బాధాకరంగా మిగిలింది. ఒకే గ్రామం.. ఒకే వీధికి చెందిన కుప్పిన కార్తీక్ (17), రాయి నవీన్ (17), కోరిబిల్లి దుర్గాప్రసాద్ (17)ల స్నేహబంధం మృత్యువులోనూ వీడలేదు. పి.ధర్మవరం గ్రామానికి చెందిన వీరు అడ్డురోడ్డులో ఆదర్శ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. మంగళవారం వీరు బైక్‌పై యలమంచిలి వెళ్లేందుకు ధర్మవరం జంక్షన్లో రోడ్డు దాటుతుండగా తుని నుంచి యలమంచిలి వైపు వెళ్తున్న లారీ వీరి బైక్‌ను ఢీకొట్టింది. మద్యం మత్తులో జోగుతున్న డ్రైవర్ కనీసం ప్రమాదం జరిగిందన్న విషయాన్ని సైతం గుర్తించలేకపోయాడు. ఈ ఘటనలో కార్తీక్ అక్కడికక్కడే దుర్మరణం పాలవ్వగా.. కిలోమీటరు దూరం వెళ్లాక నవీన్ మృతదేహం లారీని వీడి కింద పడిపోయింది. దుర్గాప్రసాద్ మృతదేహాన్ని బైక్‌తోపాటు లారీ నాలుగు కిలోమీటర్ల దూరం పోతిరెడ్డిపాలెం జంక్షన్ వరకు ఈడ్చుకుపోయింది. ఈ విషయం గమనించిన జాతీయ రహదారి సిబ్బంది తమ వాహనంలో లారీని వెంబడించి అడ్డుకున్నారు. అప్పటికే సమాచారం అందుకున్న యలమంచిలి రూరల్, ఎస్.రాయవరం పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. స్థానికులు డ్రైవరు ఎస్.కె.బాషాను పోలీసులకు అప్పగించారు. ఛిద్రమైన మృతదేహాలను చూసిపిల్లల తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. తీరని గర్భశోకం వారి గుండెలను పిండేసింది. ఎస్.రాయవరం/యలమంచిలి/నక్కపల్లి/: మరణం వారి స్నేహాన్ని విడదీయలేకపోయింది. వారి మధ్య బంధం చూసి విధికి సైతం కన్నుకుట్టింది. పి.ధర్మవరం జంక్షన్లో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణస్నేహితులను బలిగొంది. విధి ఎంత వికృతమైందో ఈ సంఘటన చూస్తే అర్ధమవుతోంది. చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకున్నారు. కలిసి చదువుకున్నారు. ఆటపాటల్లో కూడా కలిసే పాల్గొనే వారు. చిన్నతనం నుంచి మరణించేవరకు ఒకే పాఠశాలలో చదువుకున్నారు. చివరకు తుది శ్వాస కూడా కలిసే వదిలేశారు. విషాదమేమిటంటే ముగ్గురూ వారి ఇంటిలో ఆఖరి సంతానమే. సాయంత్రం వరకు తల్లికి చెప్పలేదు.. ఈ ప్రమాదంలో దుర్మరణం పాలైన కుప్పిన కార్తీక్‌ది యలమంచిలి మండలం ఏటికొప్పాక. 40 ఏళ్ల క్రితం వీరి కుటుంబం పి.ధర్మవరానికి పొట్టకూటి కోసం వలస వచ్చింది. తల్లిదండ్రులు బాబూరావు, అప్పలనర్స. వీరికి ముగ్గురు సంతానం. పెద్దకొడుకులు కూలిపనులు చేస్తూ తమ్ముడ్ని చదివిస్తున్నారు. తండ్రి కూలి పనులు చేసుకుంటూ జీవించేవాడు. నాలుగేళ్లక్రితం అనా రోగ్యంతో మరణించాడు. తల్లి ప్రస్తుతం అనా రోగ్యంతో బాధపడుతోంది. మందుల కోసం మంగళవారం ఆమె అనకాపల్లి వెళ్లింది. రోడ్డుప్రమాదంలో చిన్నకొడుకు మరణించిన విషయం ఆమెకు సాయంత్రం వరకు చెప్పలేదు. ఆమె షాక్‌కు గురైతే ఏం జరుగుతుందోనన్న భయంతో సాయంత్రం వరకు దాచివుంచారు. చివరకు సాయంత్రం చిన్నకొడుకు మరణ వార్త చేరవేయడంతో ఆమె కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. చనిపోయిన వారిలో కొడుకు ఉన్నాడని తెలీదు... పి.ధర్మవరం జంక్షన్లో లారీ ఢీకొని ముగ్గురు చనిపోయారని తెలుసుకున్న గ్రామస్తులంతా ఘటనాస్థలం వద్దకు పరుగులు తీశారు. వారితో పాటు మరో మృతుడు రాయి నవీన్ తల్లి రోహిణి కూడా ఉంది. అందరూ వెళ్తుంటే తాను కూడా చూసొద్దామని వెళ్లింది. కాని అక్కడ జరిగిన ఘటన తనకు కడుపుకోత మిగులుస్తుందని ఊహించలేదు. చనిపోయిన వారిలో తన కొడుకు ఉన్నాడని తెలిసి ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఇదే ప్రమాదంలో మరణించిన కార్తీక్నకు నవీన్ మేనమామ కొడుకు. వీరి స్వస్థలం నక్కపల్లి మండలం పాటిమీద గ్రామం. 20 ఏళ్లక్రితం పి.ధర్మవరం వలస వచ్చారు. తండ్రి పశువుల వ్యాపారం చేస్తుంటాడు. ఇద్దరు కొడుకుల్లో పెద్దవాడు వ్యవసాయ పనులు చేస్తుంటాడు. చిన్నకొడుకును చదివిస్తున్నారు. తండ్రి రమణ వ్యక్తిగత పనులపై తుని వెళ్లినట్లు తెలిసింది. కొడుకు మృతదేహాన్ని లారీ ఈడ్చుకుపోయిందన్న విషయం తెలిసి కన్నతల్లి రోడ్డుపై వెతుక్కుంటూ వెళ్లడం స్థానికులను కలిచి వేసింది. చిన్నకొడుకు కావడంతో చదువుకుంటానంటే ఎంతో ఆప్యాయంగా చదివిస్తున్నామని.. ప్రయోజకుడవుతాడనుకుంటే భగవంతుడు తీసుకుపోయాడంటూ కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ... తండ్రికి చేదోడువాదోడుగా ఉంటున్న కోరిబిల్లి దుర్గాప్రసాద్ ఈ ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. పి.ధర్మవరానికి చెందిన కోరిబిల్లి నాగేశ్వరరావు స్థానికంగానే బార్బర్ షాపు నిర్వహిస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. దుర్గాప్రసాద్ కూడా తీరిక సమయాల్లో తండ్రికి చేదోడువాదోడుగా ఉంటూ కులవృత్తి నేర్చుకుంటున్నాడు. నాగేశ్వరరావుకు ముగ్గురు సంతానం. మృతుడు మూడో కుమారుడు. కులవృత్తి నేర్చుకోరా నాన్నా.. అంటే చదువుకుంటాను, పెద్ద ఉద్యోగాలు చేస్తాను అనే వాడని.. తాము ఎలాగూ ఇదే వృత్తిలో ఉన్నాం... కనీసం వాడయినా చదువుకుంటానంటే చదివించడం మంచిది కదా అని చదివిస్తున్నానని.. విధి తమ కుటుంబానికి అన్యాయం చేస్తుందని ఊహించలేదని నాగేశ్వరరావు కుటుంబం బోరున విలపిస్తోంది. ఆటపాటలు, చదువు సంధ్యల్లో కలిసి మెలిసే.. చిన్నప్పటి నుంచి స్నేహితులైన వీరు ముగ్గురూ ప్రాథమిక విద్య నుంచి కళాశాల వరకు ఒకే పాఠశాలలో, ఒకే కళాశాలలో చదివారు. ఆటల్లో పాల్గొన్నా, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నా ముగ్గురూ కలిసే చేసేవారు. పి.ధర్మవరంలో ఒకేధిలో నివసిస్తున్న వీరి మరణ వార్త తెలిసిన గ్రామస్తులంతా జాతీయ రహదారిపై ధర్మవరం జంక్షన్ వద్దకు చేరుకున్నారు. వీరి మృతదేహాలను చూసి కంటతడిపెట్టారు. వీరి స్నేహాన్ని చూసి మాకే కళ్లుకుట్టేవని... అంత ప్రాణప్రదంగా ఉండేవారని చుట్టు పక్కల వారు పేర్కొన్నారు. విధి కూడా వీరి స్నేహాన్ని చూసి ఓర్వలేకపోయిందని, ముగ్గురినీ ఒకేసారి పొట్టనపెట్టుకుందని గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటన అందరినీ ఆవేదనకు గురి చేసింది. కన్నీరు మున్నీరైన ధర్మవరం జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ధర్మవరం కన్నీరుమున్నీరయింది. ఇదే గ్రామానికి చెంది న ముగ్గురు విద్యార్థులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన విషయం తెలిసిన గ్రామస్తులంతా వందలాదిగా ఘటనాస్థలానికి చేరుకున్నారు.ఈ ప్రమాదంలో కార్తీక్ అక్కడికక్కడే మరణించగా నవీన్, దుర్గాప్రసాద్‌ల మృతదేహాలతోపాటు, బైక్‌ను లారీ నాలుగు కిలోమీటర్ల దూరం ఈడ్చుకపోయింది. ఈ ఘటన స్థానికులను గగుర్పాటుకు గురిచేసింది. -
మరణంలోనూ వీడని స్నేహం
ఏలూరు టౌన్ : మరణం వారిని వెంటాడింది.. చిన్ననాటి స్నేహితులు ఇద్దరూ మరణంలోనూ వీడిపోలేదు.. వేగంగా వస్తోన్న లారీ మృత్యువులా వచ్చి ఇద్దరు విద్యార్థుల నిండు ప్రాణాలను బలితీసుకుంది. ఏలూరు వన్‌టౌన్ ప్రాంతానికి చెందిన ఇద్దరు విద్యార్థులు తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట కెనాల్‌రోడ్డులో లారీ ఢీకొనటంతో మృతిచెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు వన్‌టౌన్ తూర్పువీధికి చెందిన ఎస్కే రబ్బానీ ఏలూరు మండలం సత్రంపాడులోని ఆదిత్య డిగ్రీ కాలేజీలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అదే ప్రాంతానికి చెందిన ఎస్కే హనీఫ్ ఏలూరు శివారు ప్రాంతంలోని ఒక ఇంజినీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. రబ్బానీ, హనీఫ్ ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు. వీరిద్దరూ హనీఫ్‌కు చెందిన ఆర్వన్5 బైక్‌పై గురువారం ఉదయం ఏలూరు నుంచి విశాఖపట్నం బయలుదేరారు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట కెనాల్ రోడ్డు ప్రాంతానికి చేరుకునే సరికి వేగంగా వస్తున్న లారీ వీరి మోటారు సైకిల్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ అదుపుతప్పి కాలువలో తిరగబడగా, ఇరువురు విద్యార్థులు మృతిచెందారు. ఏలూరుకు చెందిన ఈ ఇద్దరు విద్యార్థులు మృతిచెందారనే వార్త వారి బంధువులు, స్నేహితులను దుఃఖసాగరంలోకి నెట్టేసింది. ఏలూరు తూర్పువీధికి చెందిన ఎస్కే బాబు ఆదివారపుపేటలో చికెన్ దుకాణం నిర్వహిస్తున్నారు. ఎస్కే బాబుకు ముగ్గురు కుమారులు కాగా మూడో కుమారుడైన రబ్బానీని డిగ్రీ చదివిస్తున్నారు. ఏలూరు జెడ్పీ కార్యాలయం సమీపంలోని న్యూ మదీనా బిర్యానీ దుకాణాన్ని నిర్వహిస్తున్న ఎస్కే హసేన్ వలీకి ఇద్దరు కుమార్తెలు ఉండగా మృతిచెందిన హనీఫ్ ఒక్కడే కుమారుడు. హనీఫ్ తండ్రి బిర్యానీ దుకాణంలో చేదోడువాదోడుగా ఉంటున్నాడు. రెండు కుటుంబాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు రబ్బానీ, హనీఫ్ మృతి తీరనిలోటుగా మారింది. చేతికి అందివ చ్చిన కుమారులు రోడ్డు ప్రమాదంలో తిరిగిరాని లోకానికి చేరుకోవటం వారిని కలచివేస్తోంది. -
మృత్యువులోనూ వీడని స్నేహం
భద్రాద్రి కొత్తగూడెం, అశ్వారావుపేటరూరల్: రోడ్డు ప్రమాదంలో ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు మృతిచెందిన ఘటన అశ్వారావుపేట మండలం నందిపాడులో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన ఊకే కిషోర్(27), కారం వీరభద్రం(29), కుంజా జోగారావు(28)తో పాటు ధర్ముల ముత్తేశ్వరరావు కలిసి ఒకే ద్విచక్రవాహనంపై ఆదివారం మధ్యాహ్నం పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరుకు వెళ్లారు. సాయంత్రం తిరిగి నందిపాడుకు వస్తుండగా కుడుములపాడు గ్రామం వద్ద మూలమలుపులో ద్విచక్రవాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో నలుగురూ తీవ్రంగా గాయపడగా, స్థానికులు గమనించి అశ్వారావుపేటలోని సామాజిక ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స చేస్తుండగానే కిషోర్, వీరభద్రం, జోగారావు మృతిచెందారు. ముత్తేశ్వరరావు అదే ఆస్పత్రిలో చికిత్ప పొందుతున్నాడు. మృతుల్లో వీరభద్రానికి వివాహం కాగా, ఏడాది వయసున్న కూతురు, భార్య సీత ఉన్నారు. కిషోర్, జోగారావులకు ఇంకా పెళ్లి కాలేదు. సమాచారంఅందుకున్న స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. మృతి చెందిన ముగ్గురు యువకులూ చిన్ననాటి నుంచి ప్రాణ స్నేహితులు. అందరూ నిరుపేదలే. కిషోర్ అశ్వారావుపేటలో బీఈడీ చదువుతుండగా, వీరభద్రం బీఈడీ పూర్తి చేసి, ప్రస్తుతం లారీ క్లీనర్‌గా పని చేస్తున్నాడు. జోగారావు ఏపీలోని పోలవరం ప్రాజెక్టు వద్ద సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. జోగారావు తల్లిదండ్రులు చిన్నప్పుడే మృతి చెందగా, తమ్ముడు నాగరాజు ఉన్నాడు. కాగా ముగ్గురు యువకులు ఒకేసారి మృతిచెందడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబసభ్యులు, బంధువుల రోదనలతో నందిపాడు శోకసంద్రంలో మునిగిపోయింది. అంతకుముందే తల్లిదండ్రులు, ఇప్పుడు అన్న మృతిచెందడంతో జోగారావు తమ్ముడు నాగరాజు రోదిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టించింది. -
నాటు కోడి కోసం వెళ్లి..
నెల్లూరు(వేదాయపాళెం): వారు ముగ్గురు ప్రాణ స్నేహితులు.. వివిధ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. భోగి రోజున నాటు కోడి తిందామనుకున్నారు. కొనుగోలు చేసేందుకు వెళ్లగా అక్కడ ధరలు అధికంగా ఉండటంతో తిరిగి ఇంటికి బయలుదేరారు. ఇంటికి చేరే లోపే వారిలో ఇద్దరిని బస్సు రూపంలో మృత్యువు కబళించింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నెల్లూరులోని జాకీర్‌హుస్సేన్‌నగర్ న్యూ కాలనీకి చెందిన పార్వతి వెంకటేశ్వర్లు (25) డెకరేషన్ కూలీగా పనిచేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన మేకల సుబ్రహ్మణ్యం (37), పల్లిపాటి సుబ్రహ్మణ్యం పెయింట్ పనులు చేస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున ముగ్గురు నాటు కోడి కోసం మూడోమైలు ప్రాంతానికి వెళ్లారు. అక్కడ ధరలు అధికంగా ఉండటంతో కొనుగోలు చేయకుండా తిరిగి ఇంటికి బయలుదేరారు. ఈ క్రమంలో నెల్లూరు రూరల్ మండల పరిధిలోని దీన్‌దయాళ్ నగర్ క్రాస్‌రోడ్డు వద్ద విజయవాడ వైపు నుంచి గూడూరు వైపు వెళుతున్న కర్నాటక రాష్ట్రానికి చెందిన ట్రావెల్ బస్సు పొగమంచు దట్టంగా అలుముకుని ఉండటంతో ముందు వెళుతున్న మోటర్‌బైక్‌ను ఢీకొంది. ప్రమాదంలో పార్వతి వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతువాత పడ్డాడు. మేకల సుబ్రహ్మణ్యంను నారాయణ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. పల్లిపాటి సుబ్రహ్మణ్యం తీవ్ర గాయాలపాలై నారాయణలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాదానికి కారణమైన ట్రావెల్ బస్సును స్థానికులు ఆగ్రహంతో ప్రయాణికులను కిందకు దించి నిప్పంటించారు. బస్సు పూర్తిగా దగ్ధమైంది. నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. రూరల్ ఎస్సై శేఖర్‌బాబు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వారంలో పెళ్లి.. కబళించిన విధి
వారిద్దరు ప్రాణ స్నేహితులు. ఒకరి పెళ్లిపనుల్లో సాయం చేసేందుకు మరొకరు వచ్చారు.. ఇద్దరు ఎప్పుడూ కలిసే ఉండేవారు. రోడ్డు ప్రమాదం వారిని బలిగొంది. అయితే మరణంలోనూ వారు ఈ బంధాన్ని వీడిపోలేదు. సిరికొండ మండలం పాకాల గ్రామానికి చెందిన బాదావత్ సందీప్, బాదావత్ రవికుమార్ అనే ఇద్దరు స్నేహితుల విషాదగాధ ఇది. సిరికొండ మండలం పాకాల గ్రామానికి చెందిన బాదావత్ సందీప్ (26) పెళ్లి ఈనెల 29న జరగాల్సి ఉంది. పెళ్లి దుస్తుల కొనుగోలుకు అదే గ్రామానికి చెందిన తన స్నేహితుడు బాదావత్ రవికుమార్ (26)ను పిలిపించుకున్నాడు. రవికుమార్ తిరిగి హైదరాబాద్ వెళ్లాల్సి ఉండగా నడిపల్లి తండాలో పెళ్లి పత్రికలు పంచి ఇద్దరూ మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో బైక్‌పై నిజామాబాద్ రైల్వేస్టేషన్‌కు బయలుదేరారు. డిచ్పల్లిలోని ధర్మకాంట వద్ద ఆగి ఉన్న ట్యాంకర్ లారీని వీరి బైక్ ఢీకొనడంతో ఇద్దరూ దుర్మరణం చెందారు. సిరికొండ(నిజామాబాద్ రూరల్) : డిచ్పల్లి మండలకేంద్రంలో మంగళవారం అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు మృతి చెందడంతో పాకాల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల్లో ఒకరైన సందీప్ తూంపల్లి గ్రామ బ్రాంచ్ పోస్ట్‌మన్ విధులు నిర్వహిస్తున్నాడు. ఇందల్వా యి మండలం వెంగల్‌పహాడ్ గ్రామానికి చెందిన యువతితో సందీప్‌కు ఈనెల 29న వివాహం జరగనుంది. అదే గ్రామానికి చెందిన అతని ప్రాణ స్నేహితుడైన బాదావత్ రవికుమార్ హైదరాబాద్‌లో కెమికల్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. స్నేహితుడి పెళ్లికి దుస్తులు కొనేందుకు రవికుమార్ హైదరాబాద్ నుండి వచ్చాడు. మంగళవారం షాపింగ్ చేసిన అనంతరం బంధువులకు పెళ్లి పత్రికలు ఇవ్వడానికి డిచ్పల్లి మండలంలోని నడిపల్లి తండాకు వెళ్లారు. అక్కడే బస చేశారు. రవికుమార్‌ను హైదరాబాద్ పంపడానికి అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో నిజామాబాద్ రైల్వేస్టేషన్‌కు నలుగురు మిత్రులు రెండు బైక్‌లపై తండా నుండి బయలుదేరారు. ముందు బైక్‌పై రవికుమార్, సందీప్ ఉండగా, వెనుక బైక్‌పై పాకాలకు చెందిన మహిపాల్ మరో యువకుడు ఉన్నారు. ముందు బైక్ రవికుమార్ నడుపుతుండగా డిచ్పల్లి మండల కేంద్రంలో ఆగి ఉన్న ట్యాంకర్ లారీని ఢీకొన్నారు. రవికుమార్, సందీప్‌లు కొద్ది నిమిషాల వ్యవధిలో సంఘటన స్థలంలోనే మృతి చెందారు. ఆరు రోజుల్లో పెళ్లనగా.. మరో ఆరు రోజుల్లో పెళ్లి ఉండగా పెళ్లి కొడుకు సందీప్, స్నేహితుడి పెళ్లి ఏర్పాట్లకు వచ్చి రవికుమార్ అకాల మరణం తో పాకాలలో విషాదచాయలు అలు ముకున్నాయి. రవికుమార్ వారి తల్లిదండ్రులకు ఒక్కడే కుమారుడు. చేతికి వచ్చిన కొడుకులు అకాలమరణం చెం దడంతో వారి కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది. రవికుమార్ తం డ్రి బాలకిషన్ ప్రస్తుతం ఉప సర్పంచ్, అమ్మ కీరిబాయి మాజీ సర్పంచ్, వీరికి ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు. ఇద్దరు కూతుళ్లకు పెళ్ళిళ్లు కాగా చిన్న కూతురు చదువుతోంది. కొడుకు రవికుమార్ బీ టెక్ పూర్తి చేసి హైదరాబాద్‌లో ఉద్యో గం చేస్తున్నాడు. సందీప్ తల్లిదండ్రులు చంద్రునాయక్, అమ్మిబాయి. వీరికి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు. తరలివచ్చిన గ్రామస్తులు సంఘటన విషయం తెలియగానే మృ తుల కుటుంబీకులు, బంధువులు, గ్రామస్తులు జిల్లా కేంద్రంలోని ప్ర భుత్వాస్పత్రికి తరలివెళ్లారు. యువకు ల మృతదేహలు చూసి కుటుంబసభ్యులు బంధువులు గుండెలవిసేలా రోదించారు. ఊరు ఊరంతా శోకసంద్రంలో మునిగిపోయింది. గ్రామంలో మధ్యాహ్నం మూడు గంటల తర్వాత నిర్వహించిన అంత్యక్రియల్లో గ్రామస్తులు మృతులకు అశ్రునయనాలతో వీడ్కోలు పలికారు. అంత్యక్రియల్లో గ్రామస్తులంతా పాల్గొన్నారు. రోదిస్తున్న సందీప్ తల్లిదండ్రులు, బంధువులు -
మరణంలోనూ వీడని స్నేహం
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం ఇంటికి కిలోమీటర్ దూరంలో ఘటన బైక్‌ను ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం రెండు కుటంబాల్లో విషాదం జమ్మికుంట : వారిద్దరూ ఒకే తల్లి కడుపున పుట్టలేదు.. కానీ అంతకన్నా ఎక్కువగా కలిసిపోయారు.. ఒకరంటే ఒకరికి ప్రాణం.. ఏ పని చేసినా పరస్పరం సహకారం ఉండేది. విధులకు మినహా ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్లేవారు. వారి స్నేహాన్ని చూసి కాలానికే కన్నుకుట్టింది. ఇద్దరినీ విడదీద్దామనుకుందేమో.. ఆదివారం అర్ధరాత్రి మృత్యువై వచ్చింది. కానీ స్నేహం బంధాన్ని విడదీయలేకపోయింది. ఇద్దరినీ కబళించుకుపోయింది. రెండు కుటుంబాలకు తీరని శోకం మిగిల్చింది. పట్టణంలోని ఆబాది జమ్మికుంట వద్ద అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పట్టణానికి చెందిన జింకిరి క్రాంతికుమార్(26), శంకరపట్నం మండలం కన్నాపూర్‌కు చెందిన గొట్టిముక్కుల శ్రీనివాస్(24) దుర్మరణం చెందారు. జమ్మికుంట కృష్ణకాలనీకి చెందిన క్రాంతికుమార్ ఐకేపీలో పార్ట్‌టైం ఉద్యోగం చేస్తున్నాడు. శ్రీనివాస్ ఏడేళ్ల క్రితం జమ్మికుంటలోని క్రాంతికుమార్ ఇంట్లోకి అద్దెకు వచ్చాడు. అప్పటినుంచి ఇక్కడే ఉంటున్నాడు. వీణవంక మండలంలో పాలు సేకరించి తన ఆటోలో కరీంనగర్ డెయిరీకి తరలిస్తూ ఉపాధి పొందుతున్నాడు. ఇద్దరూ దాదాపు సమవయస్కులు కావడంతో వారి మధ్య స్నేహం పెరిగింది. ఎక్కడికైనా ఇద్దరూ కలిసే వెళ్లేవారు. ఇద్దరూ ఆదివారం సాయంత్రం వీణవంక వెళ్లారు. భారీ వర్షం కువరడంతో అక్కడే చీకటి పడే వరకూ ఉన్నారు. వర్షం తగ్గకపోవడంతో స్థానికంగా ఉండే ఓ మిత్రుడి ద్విచక్రవాహనం తీసుకుని రాత్రి 11 గంటలకు జమ్మికుంట బయల్దేరారు. ఇంటికి సరిగ్గా 1.5 కిలోమీటర్ దూరంలో వీరి బైక్‌ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ సంఘటనలో శ్రీనివాస్ అక్కడికక్కడికే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన క్రాంతికుమార్‌ను వాహనదారులు 108లో ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. మృతుల బంధువుల ఫిర్యాదు మేరకు జమ్మికుంట పోలీసులు నమోదు చేసుకున్నారు. ప్రమాదానికి కారణాలను అన్వేషిస్తున్నారు. రాత్రి 10నుంచి 11గంటల సమయంలో ఆ దారి గుండా వెళ్లిన వాహనాలను సీసీ కెమెరాల ఫుటేజీల ద్వారా పరిశీలిస్తున్నారు. కదిలిస్తే కన్నీళ్లే.. క్రాంతికుమార్‌కు తల్లిదండ్రులు మల్లేశ్–మణెమ్మ 2011లో హుజూరాబాద్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మణెమ్మను తీసుకుని మల్లేశ్ ద్విచక్రవాహనంపై హన్మకొండలోని ఆస్పత్రికి వెళ్తుండగా హుజూరాబాద్ ఆర్టీసీ డిపో సమీపంలో లారీ ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఇద్దరూ మృతిచెందారు. అప్పటినుంచి కుటుంబ బాధ్యత క్రాంతికుమార్‌పై పడింది. మూడేళ్ల క్రితం వీణవంకకు చెందిన మౌనికను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇంకా సంతానంలేదు. ఇప్పుడు క్రాంతికుమార్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ కుటుంబ దిక్కులేకుండా పోయింది. మృతదేహం వద్ద మౌనిక, క్రాంతి తమ్ముడు సాయి నిస్సాహాయంగా రోదిస్తున్న తీరు స్థానికులను కన్నీరు పెట్టించింది. శ్రీనివాసే ఇంటికి పెద్దదిక్కు శంకరపట్నం మండలం కన్నాపూర్ గ్రామానికి చెందిన గొట్టిముక్కుల లింగమూర్తి–అనసూయ దంపతులకు ముగ్గుకు కూతుళ్లు రమాదేవి, ఉమాదేవి, రాణి, కుమారుడు శ్రీనివాస్. ముగ్గురు కూతుళ్ల వివాహం అయింది. మూడేళ్ల క్రితం తల్లి అనసూయ అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో లింగమూర్తి మానసికంగా బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో కుటుంబ బాధ్యత డెయిరీకి పాలు తరలిస్తూ ఉపాధి పొందుతున్న శ్రీనివాస్‌పై పడింది. అతడే ఇంటికి పెద్దదిక్కయ్యాడు. ఈక్రమంలో అతడి చిన్నక్క రాణి భర్త సునీల్ ఏడాది క్రితం ఆనారోగ్యంతో మృతిచెందాడు. అప్పటి నుంచి ఆమె కూడా తన రెండేళ్ల బాబుతో శ్రీనివాస్ వద్దనే ఉంటోంది. అక్కను, తండ్రిని అతడే చూసుకుంటున్నాడు. రోడ్డు ప్రమాదంలో శ్రీనివాస్‌ను కబళించడంతో మృతదేహం వద్ద ముగ్గురు కన్నీరుమున్నీరుగా విలపించారు.