మరణంలోనూ వీడని స్నేహం | friends dead in road accident | Sakshi
Sakshi News home page

మరణంలోనూ వీడని స్నేహం

Published Mon, Jul 25 2016 7:52 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

ప్రభుత్వ ఆస్పత్రి వద్ద రోదిస్తున్న మృతుల బంధువులు - Sakshi

ప్రభుత్వ ఆస్పత్రి వద్ద రోదిస్తున్న మృతుల బంధువులు

  • రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం 
  • ఇంటికి కిలోమీటర్‌ దూరంలో ఘటన 
  • బైక్‌ను ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం
  • రెండు కుటంబాల్లో విషాదం
  • జమ్మికుంట : వారిద్దరూ ఒకే తల్లి కడుపున పుట్టలేదు.. కానీ అంతకన్నా ఎక్కువగా కలిసిపోయారు.. ఒకరంటే ఒకరికి ప్రాణం.. ఏ పని చేసినా పరస్పరం సహకారం ఉండేది. విధులకు మినహా ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్లేవారు. వారి స్నేహాన్ని చూసి కాలానికే కన్నుకుట్టింది. ఇద్దరినీ విడదీద్దామనుకుందేమో.. ఆదివారం అర్ధరాత్రి మృత్యువై వచ్చింది. కానీ స్నేహం బంధాన్ని విడదీయలేకపోయింది. ఇద్దరినీ కబళించుకుపోయింది. రెండు కుటుంబాలకు తీరని శోకం మిగిల్చింది. 
    పట్టణంలోని ఆబాది జమ్మికుంట వద్ద అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పట్టణానికి చెందిన జింకిరి క్రాంతికుమార్‌(26), శంకరపట్నం మండలం కన్నాపూర్‌కు చెందిన గొట్టిముక్కుల శ్రీనివాస్‌(24) దుర్మరణం చెందారు. జమ్మికుంట కృష్ణకాలనీకి చెందిన క్రాంతికుమార్‌ ఐకేపీలో పార్ట్‌టైం ఉద్యోగం చేస్తున్నాడు. శ్రీనివాస్‌ ఏడేళ్ల క్రితం జమ్మికుంటలోని క్రాంతికుమార్‌ ఇంట్లోకి అద్దెకు వచ్చాడు. అప్పటినుంచి ఇక్కడే ఉంటున్నాడు. వీణవంక మండలంలో పాలు సేకరించి తన ఆటోలో కరీంనగర్‌ డెయిరీకి తరలిస్తూ ఉపాధి పొందుతున్నాడు. ఇద్దరూ దాదాపు సమవయస్కులు కావడంతో వారి మధ్య స్నేహం పెరిగింది. ఎక్కడికైనా ఇద్దరూ కలిసే వెళ్లేవారు. ఇద్దరూ ఆదివారం సాయంత్రం వీణవంక వెళ్లారు. భారీ వర్షం కువరడంతో అక్కడే చీకటి పడే వరకూ ఉన్నారు. వర్షం తగ్గకపోవడంతో స్థానికంగా ఉండే ఓ మిత్రుడి ద్విచక్రవాహనం తీసుకుని రాత్రి 11 గంటలకు జమ్మికుంట బయల్దేరారు. ఇంటికి సరిగ్గా 1.5 కిలోమీటర్‌ దూరంలో వీరి బైక్‌ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ సంఘటనలో శ్రీనివాస్‌ అక్కడికక్కడికే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన క్రాంతికుమార్‌ను వాహనదారులు 108లో ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. మృతుల బంధువుల ఫిర్యాదు మేరకు జమ్మికుంట పోలీసులు నమోదు చేసుకున్నారు. ప్రమాదానికి కారణాలను అన్వేషిస్తున్నారు. రాత్రి 10నుంచి 11గంటల సమయంలో ఆ దారి గుండా వెళ్లిన వాహనాలను సీసీ కెమెరాల ఫుటేజీల ద్వారా పరిశీలిస్తున్నారు.  
     
    కదిలిస్తే కన్నీళ్లే..
    క్రాంతికుమార్‌కు తల్లిదండ్రులు మల్లేశ్‌–మణెమ్మ 2011లో హుజూరాబాద్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మణెమ్మను తీసుకుని మల్లేశ్‌ ద్విచక్రవాహనంపై హన్మకొండలోని ఆస్పత్రికి వెళ్తుండగా హుజూరాబాద్‌ ఆర్టీసీ డిపో సమీపంలో లారీ ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఇద్దరూ మృతిచెందారు. అప్పటినుంచి కుటుంబ బాధ్యత క్రాంతికుమార్‌పై పడింది. మూడేళ్ల క్రితం వీణవంకకు చెందిన మౌనికను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇంకా సంతానంలేదు. ఇప్పుడు క్రాంతికుమార్‌ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో  ఆ కుటుంబ దిక్కులేకుండా పోయింది. మృతదేహం వద్ద  మౌనిక, క్రాంతి తమ్ముడు సాయి నిస్సాహాయంగా రోదిస్తున్న తీరు స్థానికులను కన్నీరు పెట్టించింది.  
    శ్రీనివాసే ఇంటికి పెద్దదిక్కు
    శంకరపట్నం మండలం కన్నాపూర్‌ గ్రామానికి చెందిన గొట్టిముక్కుల లింగమూర్తి–అనసూయ దంపతులకు ముగ్గుకు కూతుళ్లు రమాదేవి, ఉమాదేవి, రాణి, కుమారుడు శ్రీనివాస్‌. ముగ్గురు కూతుళ్ల వివాహం అయింది. మూడేళ్ల క్రితం తల్లి అనసూయ అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో లింగమూర్తి మానసికంగా బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో కుటుంబ బాధ్యత డెయిరీకి పాలు తరలిస్తూ ఉపాధి పొందుతున్న శ్రీనివాస్‌పై పడింది. అతడే ఇంటికి పెద్దదిక్కయ్యాడు. ఈక్రమంలో అతడి చిన్నక్క రాణి భర్త సునీల్‌ ఏడాది క్రితం ఆనారోగ్యంతో మృతిచెందాడు. అప్పటి నుంచి ఆమె కూడా తన రెండేళ్ల బాబుతో శ్రీనివాస్‌ వద్దనే ఉంటోంది. అక్కను, తండ్రిని అతడే చూసుకుంటున్నాడు. రోడ్డు ప్రమాదంలో శ్రీనివాస్‌ను కబళించడంతో మృతదేహం వద్ద ముగ్గురు కన్నీరుమున్నీరుగా విలపించారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement