వారంలో పెళ్లి.. కబళించిన విధి | Friends Dead In Road Accident | Sakshi
Sakshi News home page

వారంలో పెళ్లి.. కబళించిన విధి

Published Thu, Nov 23 2017 12:01 PM | Last Updated on Thu, Aug 30 2018 4:15 PM

Friends Dead In Road Accident - Sakshi

వారిద్దరు ప్రాణ స్నేహితులు. ఒకరి పెళ్లిపనుల్లో సాయం చేసేందుకు మరొకరు వచ్చారు.. ఇద్దరు ఎప్పుడూ కలిసే ఉండేవారు. రోడ్డు ప్రమాదం వారిని బలిగొంది. అయితే మరణంలోనూ వారు ఈ బంధాన్ని వీడిపోలేదు.  సిరికొండ మండలం పాకాల గ్రామానికి చెందిన బాదావత్‌ సందీప్, బాదావత్‌ రవికుమార్‌ అనే ఇద్దరు స్నేహితుల విషాదగాధ ఇది.

సిరికొండ మండలం పాకాల గ్రామానికి చెందిన బాదావత్‌ సందీప్‌ (26) పెళ్లి ఈనెల 29న జరగాల్సి ఉంది. పెళ్లి దుస్తుల కొనుగోలుకు అదే గ్రామానికి చెందిన తన స్నేహితుడు బాదావత్‌ రవికుమార్‌ (26)ను పిలిపించుకున్నాడు. రవికుమార్‌ తిరిగి హైదరాబాద్‌ వెళ్లాల్సి ఉండగా నడిపల్లి తండాలో పెళ్లి పత్రికలు పంచి ఇద్దరూ మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో బైక్‌పై నిజామాబాద్‌ రైల్వేస్టేషన్‌కు బయలుదేరారు. డిచ్‌పల్లిలోని ధర్మకాంట వద్ద ఆగి ఉన్న ట్యాంకర్‌ లారీని వీరి బైక్‌ ఢీకొనడంతో ఇద్దరూ దుర్మరణం చెందారు. 

సిరికొండ(నిజామాబాద్‌ రూరల్‌) : డిచ్‌పల్లి మండలకేంద్రంలో మంగళవారం అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు మృతి చెందడంతో పాకాల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల్లో ఒకరైన సందీప్‌ తూంపల్లి గ్రామ బ్రాంచ్‌ పోస్ట్‌మన్‌ విధులు నిర్వహిస్తున్నాడు. ఇందల్‌వా యి మండలం వెంగల్‌పహాడ్‌ గ్రామానికి చెందిన యువతితో సందీప్‌కు ఈనెల 29న వివాహం జరగనుంది.  అదే గ్రామానికి చెందిన అతని ప్రాణ స్నేహితుడైన బాదావత్‌ రవికుమార్‌ హైదరాబాద్‌లో కెమికల్‌ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. స్నేహితుడి పెళ్లికి దుస్తులు కొనేందుకు రవికుమార్‌ హైదరాబాద్‌ నుండి వచ్చాడు.

మంగళవారం షాపింగ్‌ చేసిన అనంతరం బంధువులకు పెళ్లి పత్రికలు ఇవ్వడానికి డిచ్‌పల్లి మండలంలోని నడిపల్లి తండాకు వెళ్లారు. అక్కడే బస చేశారు. రవికుమార్‌ను హైదరాబాద్‌ పంపడానికి అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో నిజామాబాద్‌ రైల్వేస్టేషన్‌కు నలుగురు మిత్రులు రెండు బైక్‌లపై తండా నుండి బయలుదేరారు. ముందు బైక్‌పై రవికుమార్, సందీప్‌ ఉండగా, వెనుక బైక్‌పై పాకాలకు చెందిన మహిపాల్‌ మరో యువకుడు ఉన్నారు. ముందు బైక్‌ రవికుమార్‌ నడుపుతుండగా డిచ్‌పల్లి మండల కేంద్రంలో ఆగి ఉన్న ట్యాంకర్‌ లారీని ఢీకొన్నారు. రవికుమార్, సందీప్‌లు కొద్ది నిమిషాల వ్యవధిలో సంఘటన స్థలంలోనే మృతి చెందారు.

ఆరు రోజుల్లో పెళ్లనగా..
మరో ఆరు రోజుల్లో పెళ్లి ఉండగా పెళ్లి కొడుకు సందీప్, స్నేహితుడి పెళ్లి ఏర్పాట్లకు వచ్చి రవికుమార్‌ అకాల మరణం తో పాకాలలో విషాదచాయలు అలు ముకున్నాయి. రవికుమార్‌ వారి తల్లిదండ్రులకు ఒక్కడే  కుమారుడు. చేతికి వచ్చిన కొడుకులు అకాలమరణం చెం దడంతో వారి కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది. రవికుమార్‌ తం డ్రి బాలకిషన్‌ ప్రస్తుతం ఉప సర్పంచ్, అమ్మ కీరిబాయి మాజీ సర్పంచ్, వీరికి ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు. ఇద్దరు కూతుళ్లకు పెళ్ళిళ్లు కాగా చిన్న కూతురు చదువుతోంది. కొడుకు రవికుమార్‌ బీ టెక్‌ పూర్తి చేసి హైదరాబాద్‌లో ఉద్యో గం చేస్తున్నాడు. సందీప్‌ తల్లిదండ్రులు చంద్రునాయక్, అమ్మిబాయి. వీరికి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు.

తరలివచ్చిన గ్రామస్తులు
సంఘటన విషయం తెలియగానే మృ తుల కుటుంబీకులు, బంధువులు, గ్రామస్తులు జిల్లా కేంద్రంలోని ప్ర భుత్వాస్పత్రికి తరలివెళ్లారు. యువకు ల మృతదేహలు చూసి కుటుంబసభ్యులు బంధువులు గుండెలవిసేలా రోదించారు. ఊరు ఊరంతా శోకసంద్రంలో మునిగిపోయింది. గ్రామంలో మధ్యాహ్నం మూడు గంటల తర్వాత నిర్వహించిన అంత్యక్రియల్లో గ్రామస్తులు మృతులకు అశ్రునయనాలతో వీడ్కోలు పలికారు. అంత్యక్రియల్లో గ్రామస్తులంతా పాల్గొన్నారు.

రోదిస్తున్న సందీప్‌ తల్లిదండ్రులు, బంధువులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement