భద్రాద్రి కొత్తగూడెం, అశ్వారావుపేటరూరల్: రోడ్డు ప్రమాదంలో ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు మృతిచెందిన ఘటన అశ్వారావుపేట మండలం నందిపాడులో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన ఊకే కిషోర్(27), కారం వీరభద్రం(29), కుంజా జోగారావు(28)తో పాటు ధర్ముల ముత్తేశ్వరరావు కలిసి ఒకే ద్విచక్రవాహనంపై ఆదివారం మధ్యాహ్నం పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరుకు వెళ్లారు. సాయంత్రం తిరిగి నందిపాడుకు వస్తుండగా కుడుములపాడు గ్రామం వద్ద మూలమలుపులో ద్విచక్రవాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో నలుగురూ తీవ్రంగా గాయపడగా, స్థానికులు గమనించి అశ్వారావుపేటలోని సామాజిక ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స చేస్తుండగానే కిషోర్, వీరభద్రం, జోగారావు మృతిచెందారు. ముత్తేశ్వరరావు అదే ఆస్పత్రిలో చికిత్ప పొందుతున్నాడు. మృతుల్లో వీరభద్రానికి వివాహం కాగా, ఏడాది వయసున్న కూతురు, భార్య సీత ఉన్నారు.
కిషోర్, జోగారావులకు ఇంకా పెళ్లి కాలేదు. సమాచారంఅందుకున్న స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. మృతి చెందిన ముగ్గురు యువకులూ చిన్ననాటి నుంచి ప్రాణ స్నేహితులు. అందరూ నిరుపేదలే. కిషోర్ అశ్వారావుపేటలో బీఈడీ చదువుతుండగా, వీరభద్రం బీఈడీ పూర్తి చేసి, ప్రస్తుతం లారీ క్లీనర్‌గా పని చేస్తున్నాడు. జోగారావు ఏపీలోని పోలవరం ప్రాజెక్టు వద్ద సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. జోగారావు తల్లిదండ్రులు చిన్నప్పుడే మృతి చెందగా, తమ్ముడు నాగరాజు ఉన్నాడు. కాగా ముగ్గురు యువకులు ఒకేసారి మృతిచెందడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబసభ్యులు, బంధువుల రోదనలతో నందిపాడు శోకసంద్రంలో మునిగిపోయింది. అంతకుముందే తల్లిదండ్రులు, ఇప్పుడు అన్న మృతిచెందడంతో జోగారావు తమ్ముడు నాగరాజు రోదిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టించింది.
Comments
Please login to add a commentAdd a comment