ముగ్గురు ఇంటర్ విద్యార్థులు, లారీలో చిక్కుకున్న నవీన్ మృతదేహం
వారి తీయని స్నేహంలో విధి విషం చిమ్మింది.. కన్నవారి ఆశలను తుంచేస్తూ మృత్యుదేవత వారి ప్రాణాలను హరించేసింది.. లారీ డ్రైవర్ మద్యం మత్తు వారి కలల్ని ఈడ్చుకుపోయింది.. ముక్కచెక్కలైన వారి దేహాలను చూసి చూపరులకు సైతం మనసు వికలమైపోయింది. అత్యంత దారుణంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంటర్ చదువుతున్న ముగ్గురు నూనూగు మీసాల యువకులు మృత్యువాత పడడమే ఒక ఘోరం కాగా.. వారు ప్రమాదానికి గురైన తీరు మరింత బాధాకరంగా మిగిలింది.
ఒకే గ్రామం.. ఒకే వీధికి చెందిన కుప్పిన కార్తీక్ (17), రాయి నవీన్ (17), కోరిబిల్లి దుర్గాప్రసాద్ (17)ల స్నేహబంధం మృత్యువులోనూ వీడలేదు. పి.ధర్మవరం గ్రామానికి చెందిన వీరు అడ్డురోడ్డులో ఆదర్శ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. మంగళవారం వీరు బైక్‌పై యలమంచిలి వెళ్లేందుకు ధర్మవరం జంక్షన్‌లో రోడ్డు దాటుతుండగా తుని నుంచి యలమంచిలి వైపు వెళ్తున్న లారీ వీరి బైక్‌ను ఢీకొట్టింది. మద్యం మత్తులో జోగుతున్న డ్రైవర్ కనీసం ప్రమాదం జరిగిందన్న విషయాన్ని సైతం గుర్తించలేకపోయాడు. ఈ ఘటనలో కార్తీక్ అక్కడికక్కడే దుర్మరణం పాలవ్వగా.. కిలోమీటరు దూరం వెళ్లాక నవీన్ మృతదేహం లారీని వీడి కింద పడిపోయింది. దుర్గాప్రసాద్ మృతదేహాన్ని బైక్‌తోపాటు లారీ నాలుగు కిలోమీటర్ల దూరం పోతిరెడ్డిపాలెం జంక్షన్ వరకు ఈడ్చుకుపోయింది. ఈ విషయం గమనించిన జాతీయ రహదారి సిబ్బంది తమ వాహనంలో లారీని వెంబడించి అడ్డుకున్నారు. అప్పటికే సమాచారం అందుకున్న యలమంచిలి రూరల్, ఎస్.రాయవరం పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. స్థానికులు డ్రైవరు ఎస్.కె.బాషాను పోలీసులకు అప్పగించారు. ఛిద్రమైన మృతదేహాలను చూసిపిల్లల తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. తీరని గర్భశోకం వారి గుండెలను పిండేసింది.
ఎస్.రాయవరం/యలమంచిలి/నక్కపల్లి/: మరణం వారి స్నేహాన్ని విడదీయలేకపోయింది. వారి మధ్య బంధం చూసి విధికి సైతం కన్నుకుట్టింది. పి.ధర్మవరం జంక్షన్‌లో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణస్నేహితులను బలిగొంది. విధి ఎంత వికృతమైందో ఈ సంఘటన చూస్తే అర్ధమవుతోంది. చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకున్నారు. కలిసి చదువుకున్నారు. ఆటపాటల్లో కూడా కలిసే పాల్గొనే వారు. చిన్నతనం నుంచి మరణించేవరకు ఒకే పాఠశాలలో చదువుకున్నారు. చివరకు తుది శ్వాస కూడా కలిసే వదిలేశారు. విషాదమేమిటంటే ముగ్గురూ వారి ఇంటిలో ఆఖరి సంతానమే.
సాయంత్రం వరకు తల్లికి చెప్పలేదు..
ఈ ప్రమాదంలో దుర్మరణం పాలైన కుప్పిన కార్తీక్‌ది యలమంచిలి మండలం ఏటికొప్పాక. 40 ఏళ్ల క్రితం వీరి కుటుంబం పి.ధర్మవరానికి పొట్టకూటి కోసం వలస వచ్చింది. తల్లిదండ్రులు బాబూరావు, అప్పలనర్స. వీరికి ముగ్గురు సంతానం. పెద్దకొడుకులు కూలిపనులు చేస్తూ తమ్ముడ్ని చదివిస్తున్నారు. తండ్రి కూలి పనులు చేసుకుంటూ జీవించేవాడు. నాలుగేళ్లక్రితం అనా రోగ్యంతో మరణించాడు. తల్లి ప్రస్తుతం అనా రోగ్యంతో బాధపడుతోంది. మందుల కోసం మంగళవారం ఆమె అనకాపల్లి వెళ్లింది. రోడ్డుప్రమాదంలో చిన్నకొడుకు మరణించిన విషయం ఆమెకు సాయంత్రం వరకు చెప్పలేదు. ఆమె షాక్‌కు గురైతే ఏం జరుగుతుందోనన్న భయంతో సాయంత్రం వరకు దాచివుంచారు. చివరకు సాయంత్రం చిన్నకొడుకు మరణ వార్త చేరవేయడంతో ఆమె కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.
చనిపోయిన వారిలో కొడుకు ఉన్నాడని తెలీదు...
పి.ధర్మవరం జంక్షన్‌లో లారీ ఢీకొని ముగ్గురు చనిపోయారని తెలుసుకున్న గ్రామస్తులంతా ఘటనాస్థలం వద్దకు పరుగులు తీశారు. వారితో పాటు మరో మృతుడు రాయి నవీన్ తల్లి రోహిణి కూడా ఉంది. అందరూ వెళ్తుంటే తాను కూడా చూసొద్దామని వెళ్లింది. కాని అక్కడ జరిగిన ఘటన తనకు కడుపుకోత మిగులుస్తుందని ఊహించలేదు. చనిపోయిన వారిలో తన కొడుకు ఉన్నాడని తెలిసి ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఇదే ప్రమాదంలో మరణించిన కార్తీక్‌నకు నవీన్ మేనమామ కొడుకు. వీరి స్వస్థలం నక్కపల్లి మండలం పాటిమీద గ్రామం. 20 ఏళ్లక్రితం పి.ధర్మవరం వలస వచ్చారు. తండ్రి పశువుల వ్యాపారం చేస్తుంటాడు. ఇద్దరు కొడుకుల్లో పెద్దవాడు వ్యవసాయ పనులు చేస్తుంటాడు. చిన్నకొడుకును చదివిస్తున్నారు. తండ్రి రమణ వ్యక్తిగత పనులపై తుని వెళ్లినట్లు తెలిసింది. కొడుకు మృతదేహాన్ని లారీ ఈడ్చుకుపోయిందన్న విషయం తెలిసి కన్నతల్లి రోడ్డుపై వెతుక్కుంటూ వెళ్లడం స్థానికులను కలిచి వేసింది. చిన్నకొడుకు కావడంతో చదువుకుంటానంటే ఎంతో ఆప్యాయంగా చదివిస్తున్నామని.. ప్రయోజకుడవుతాడనుకుంటే భగవంతుడు తీసుకుపోయాడంటూ కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు.
తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ...
తండ్రికి చేదోడువాదోడుగా ఉంటున్న కోరిబిల్లి దుర్గాప్రసాద్ ఈ ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. పి.ధర్మవరానికి చెందిన కోరిబిల్లి నాగేశ్వరరావు స్థానికంగానే బార్బర్ షాపు నిర్వహిస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. దుర్గాప్రసాద్ కూడా తీరిక సమయాల్లో తండ్రికి చేదోడువాదోడుగా ఉంటూ కులవృత్తి నేర్చుకుంటున్నాడు. నాగేశ్వరరావుకు ముగ్గురు సంతానం. మృతుడు మూడో కుమారుడు. కులవృత్తి నేర్చుకోరా నాన్నా.. అంటే చదువుకుంటాను, పెద్ద ఉద్యోగాలు చేస్తాను అనే వాడని.. తాము ఎలాగూ ఇదే వృత్తిలో ఉన్నాం... కనీసం వాడయినా చదువుకుంటానంటే చదివించడం మంచిది కదా అని చదివిస్తున్నానని.. విధి తమ కుటుంబానికి అన్యాయం చేస్తుందని ఊహించలేదని నాగేశ్వరరావు కుటుంబం బోరున విలపిస్తోంది.
ఆటపాటలు, చదువు సంధ్యల్లో కలిసి మెలిసే..
చిన్నప్పటి నుంచి స్నేహితులైన వీరు ముగ్గురూ ప్రాథమిక విద్య నుంచి కళాశాల వరకు ఒకే పాఠశాలలో, ఒకే కళాశాలలో చదివారు. ఆటల్లో పాల్గొన్నా, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నా ముగ్గురూ కలిసే చేసేవారు. పి.ధర్మవరంలో ఒకేధిలో నివసిస్తున్న వీరి మరణ వార్త తెలిసిన గ్రామస్తులంతా జాతీయ రహదారిపై ధర్మవరం జంక్షన్ వద్దకు చేరుకున్నారు. వీరి మృతదేహాలను చూసి కంటతడిపెట్టారు. వీరి స్నేహాన్ని చూసి మాకే కళ్లుకుట్టేవని... అంత ప్రాణప్రదంగా ఉండేవారని చుట్టు పక్కల వారు పేర్కొన్నారు. విధి కూడా వీరి స్నేహాన్ని చూసి ఓర్వలేకపోయిందని, ముగ్గురినీ ఒకేసారి పొట్టనపెట్టుకుందని గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటన అందరినీ ఆవేదనకు గురి చేసింది.
కన్నీరు మున్నీరైన ధర్మవరం
జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ధర్మవరం కన్నీరుమున్నీరయింది. ఇదే గ్రామానికి చెంది న ముగ్గురు విద్యార్థులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన విషయం తెలిసిన గ్రామస్తులంతా వందలాదిగా ఘటనాస్థలానికి చేరుకున్నారు.ఈ ప్రమాదంలో కార్తీక్ అక్కడికక్కడే మరణించగా నవీన్, దుర్గాప్రసాద్‌ల మృతదేహాలతోపాటు, బైక్‌ను లారీ నాలుగు కిలోమీటర్ల దూరం ఈడ్చుకపోయింది. ఈ ఘటన స్థానికులను గగుర్పాటుకు గురిచేసింది.
Comments
Please login to add a commentAdd a comment