మృతి చెందిన ధరావత్ సాయికుమార్, కెతావత్ గణేశ్, ధరావత్ వంశీ (ఫైల్)
శుభకార్యానికి వెళ్తూ రోడ్డు పక్కన ఆగిన ముగ్గురు యువకులను మృత్యువు కారు రూపంలో వచ్చి కబళించింది.ఈ సంఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని నాగార్జునసాగర్ హైవేపై చోటుచేసుకుంది.
హస్తినాపురం: వేగంగా వచ్చిన కారు అదుపు తప్పి రోడ్డు పక్కన నిలబడి ఉన్న ముగ్గురు యువకులను ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడిన వారు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం నేరెడుగొమ్మ గ్రామానికి చెందిన కెతావత్ గణేశ్ (21), హస్తినాపురంలోని తిరుమల కాలనీలో ఉంటూ అక్షర ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు. మిర్యాలగూడ వెంకటాద్రిపాలెంకు చెందిన ధరావత్ సాయికుమార్ (20), ఎల్‌బీనగర్‌లోని కాకతీయకాలనీలో నివాసం ఉంటూ బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మిర్యాలగూడ వెంకటాద్రిపాలెంకు చెందిన ధరావత్ వంశీ (19) సరస్వతీకాలనీలో నివాసం ఉంటూ ల్యాబ్ టెక్నీషియన్ పనిచేస్తున్నాడు.
గృహ ప్రవేశానికి వెళుతూ తిరిగిరాని లోకాలకు..
ముగ్గురు యువకులు కలిసి ఎల్‌బీనగర్ నుంచి ఆదివారం ఉదయం ద్విచక్రవాహనంపై గుర్రంగూడలోని తమ బందువుల గృహ ప్రవేశానికి వెలుతున్నారు. గుర్రంగూడ సమీపంలోని ఫ్లైటెక్ ఏవియేషన్ అకాడమీ సమీపంలో జ్యాస్ టిఫిన్ సెంటర్‌కు ఎదురుగా ద్విచక్ర వాహనాన్ని పక్కకు ఆపి నిలబడి మాట్లాడుకుంటుండగా అంతలోనే వనస్థలపురం వైపు నుంచి అతివేగంగా వచ్చిన మహింద్రా జైలో కారు నంబరు (టీఎస్ 07 యూఈ 6797) ఈ ముగ్గురిపైకి దూసుకొచ్చింది. ఏమైందో తెలుసుకునే లోపే ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడి రక్తసిక్తమై అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. అతివేగంతో వచ్చిన కారు వారిని ఢీకొట్టి రోడ్డుకు సమీపంలో ఉన్న గోడకు తగిలి బొల్తాపడింది. డ్రైవరు బొల్తాపడిన కారులోంచి డోర్ తీసుకుని బయటకు వచ్చి అక్కడ నుంచి పరారయ్యాడు. ఈ సంఘటనను గమనించి అటుగా వెలుతున్న వాహనదారులు 100కు సమాచారం అందించండంతో వనస్థలిపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే ముగ్గు రు యువకులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతి చెందిన ముగ్గురి మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment