నెల్లూరు(వేదాయపాళెం): వారు ముగ్గురు ప్రాణ స్నేహితులు.. వివిధ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. భోగి రోజున నాటు కోడి తిందామనుకున్నారు. కొనుగోలు చేసేందుకు వెళ్లగా అక్కడ ధరలు అధికంగా ఉండటంతో తిరిగి ఇంటికి బయలుదేరారు. ఇంటికి చేరే లోపే వారిలో ఇద్దరిని బస్సు రూపంలో మృత్యువు కబళించింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.
నెల్లూరులోని జాకీర్‌హుస్సేన్‌నగర్ న్యూ కాలనీకి చెందిన పార్వతి వెంకటేశ్వర్లు (25) డెకరేషన్ కూలీగా పనిచేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన మేకల సుబ్రహ్మణ్యం (37), పల్లిపాటి సుబ్రహ్మణ్యం పెయింట్ పనులు చేస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున ముగ్గురు నాటు కోడి కోసం మూడోమైలు ప్రాంతానికి వెళ్లారు. అక్కడ ధరలు అధికంగా ఉండటంతో కొనుగోలు చేయకుండా తిరిగి ఇంటికి బయలుదేరారు. ఈ క్రమంలో నెల్లూరు రూరల్ మండల పరిధిలోని దీన్‌దయాళ్ నగర్ క్రాస్‌రోడ్డు వద్ద విజయవాడ వైపు నుంచి గూడూరు వైపు వెళుతున్న కర్నాటక రాష్ట్రానికి చెందిన ట్రావెల్ బస్సు పొగమంచు దట్టంగా అలుముకుని ఉండటంతో ముందు వెళుతున్న మోటర్‌బైక్‌ను ఢీకొంది.
ప్రమాదంలో పార్వతి వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతువాత పడ్డాడు. మేకల సుబ్రహ్మణ్యంను నారాయణ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. పల్లిపాటి సుబ్రహ్మణ్యం తీవ్ర గాయాలపాలై నారాయణలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాదానికి కారణమైన ట్రావెల్ బస్సును స్థానికులు ఆగ్రహంతో ప్రయాణికులను కిందకు దించి నిప్పంటించారు. బస్సు పూర్తిగా దగ్ధమైంది. నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. రూరల్ ఎస్సై శేఖర్‌బాబు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment