lorry - car collision
-
నిజామాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, నిజమాబాద్: నిజామాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారులో కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనానికి వెళ్తుండగా... ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. దీంతో ఈ ప్రమాదంలో అక్కడకక్కడే ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా చేపూర్ జాతీయ రహదారి పై చోటు చేసుకుంది. మృతులంతా నందిపేట మండలానికి చెందిన వారని అధికారులు చెబుతున్నారు. బాధితులు మంద మోహన్, మాదిగ రమేష్, ఉమ్మెడ అశోక్‌గా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: గుట్టలు గుల్ల.. సర్కారు లీజు గోరంత.. తవ్వుకునేది గుట్టంతా) -
రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆగి ఉన్న కారును లారీ ఢీ కొట్టడంతో..
సాక్షి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఆదిభట్ల పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓఆర్ఆర్ నుంచి కోహెడ వెళ్లే దారిలో ముందు వెళుతున్న కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో ఆగి ఉన్న కారును వెనక నుంచి మరో కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో మొత్తం అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రికి తరలించారు. అయితే మంచు ఎక్కువ ఉండటం కారణంగా వాహనాలు కనిపించకపోవడంతో ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: చత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్ చదవండి: కేపీహెచ్‌బీ కాలనీ: హాస్టల్లో యువతి ఆత్మహత్య -
శంషాబాద్ రోడ్డు ప్రమాదం; కారును నడిపిందెవరు?
శంషాబాద్: శంషాబాద్‌లో వలస కార్మికులను బలి తీసుకున్న రోడ్డు ప్రమాదం డ్రైవర్ల నిర్లక్ష్యంతోనే జరిగింది. కారును అతి వేగంగా నడపడం ఓ కారణమైతే ఇటుకలు రవాణా చేసే లారీలో జనాలను తరలించడం మరో కారణం. ప్రమాద సమయంలో లారీలో డ్రైవర్ బంగ్యానాయక్‌తోపాటు మొత్తం 30 మంది ప్రయాణిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆదివారం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. తీవ్రంగా గాయాలైన వారిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా, ఒడిశా రాష్ట్రానికి చెందిన బుదాన్ (25) చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందాడు. దీంతో ఈ ఘటనలో మృతిచెందిన వారి సంఖ్య ఏడుగుకు పెరిగింది. మరో మహిళ ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతోంది. కారు నడిపిందెవరు? కారులో మాదాపూర్ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న గిరిప్రసాద్తో పాటు హోంగార్డు సంగమేశ్వర్, మండలంలోని ఊట్పల్లికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మల్లేష్ ఉన్నారు. ఆదివారం ఉదయం యాదాద్రి వెళ్లి తిరుగు ప్రయాణంలో మద్యం తాగారు. సాయంత్రం ఊట్పల్లి సమీపంలోని సదరన్ వెంచర్లో మరోసారి మద్యం తాగి రాళ్లగూడ వైపు వెళుతుండగా అదే సమయంలో నర్కూడ వైపు వెళుతున్న లారీని షాబాద్ రహదారిలోని మసీదు గడ్డ వద్ద వేగంగా ఢీకొట్టారు. దీంతో లారీ అదుపు తప్పడంతో ఘోరప్రమాదం జరిగింది. ప్రమాదం సంభవించినపుడు కారులో బెలూన్లు తెరుచుకోవడంతో సురక్షితంగా బయటపడ్డ ముగ్గురు అక్కడి నుంచి పరారయ్యారు. మొదట మల్లేష్‌ను, తర్వాత గిరిప్రసాద్, సంగమేశ్వర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారికి డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించగా సంగమేశ్వర్ మినహా మిగతా ఇద్దరూ మద్యం తాగినట్లు నిర్ధారణ అయింది. మద్యం సేవించని సంగమేశ్వర్ డ్రైవింగ్ చేసినట్లు పోలీసులు చెబుతున్నా ఆ సమయంలో గిరిప్రసాద్ కారు నడిపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఈ కారుపై అతివేగంగా నడిపినట్లు ఈ చలాన్ కూడా జారీ అయింది. కారులో లభ్యమైన ఓ మద్యం సీసాను వేలిముద్రల పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపారు. డ్రంకెన్ డ్రైవ్ పరీక్షల్లో లారీ డ్రైవర్ మద్యం తాగనట్లు తేల్చారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసిన కారు డ్రైవర్‌తోపాటు లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆర్జీఐఏ సీఐ విజయ్‌కుమార్ తెలిపారు. కేసులు పటిష్టం.. ప్రమాదాలు షరామామూలే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాల కేసులను తీవ్రంగా పరిగణిస్తూ కేసుల దర్యాప్తు చేపడుతున్నారు. రెండు నెలలుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న కేసుల్లో సంబంధిత ఎస్సై, సీఐతో పాటు ఏసీపీ, ట్రాఫిక్ సీఐ, మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్, సంబంధిత రోడ్డు విభాగం ఇంజనీర్లు దర్యాప్తులో భాగమవుతున్నారు. ప్రమాదాలు జరిగిన తర్వాత అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్న పోలీసులు రోడ్డుపైకి అధిక లోడుతో వస్తున్న వాహనాలు, గూడ్స్ వాహనాల్లో ప్రజలను తరలిస్తున్న తీరుపై మాత్రం ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులు పట్టించుకోకపోవడంతోనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. -
బతుకు బోల్తా; ఆరుగురు దుర్మరణం
శంషాబాద్: పొట్ట చేతపట్టుకుని రాష్ట్రం దాటివచ్చిన వలస కూలీల బతుకులను రోడ్డు ప్రమాదం ఛిద్రం చేసింది. వీరు ప్రయాణిస్తున్న లారీని ఎదురుగా వచ్చిన ఓ కారు ఢీకొట్టింది. ఈ క్రమంలో డ్రైవర్ లారీని ఒక్కసారిగా రోడ్డు కిందకు దించడంతో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు వదలగా.. మరో ముగ్గురు ఆస్పత్రిలో మరణించారు. క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ ఘటన ఆదివారం సాయంత్రం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పట్టణ పరిధిలోని షాబాద్ రహదారి మసీదు గడ్డ వద్ద చోటు చేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. మండలంలోని నర్కూడ రెవెన్యూ పరిధిలోని సుల్తాన్‌పూర్‌లో చందర్ అనే ఇటుక బట్టీ నిర్వాహకుడి వద్ద ఒడిశాకు చెందిన కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో 30 మంది కూలీలు యజమాని ఏర్పాటు చేసిన లారీలో ఆదివారం శంషాబాద్ వచ్చి కూరగాయలు, సరుకులు కొనుగోలు చేసి సాయంత్రం 6:10 గంటలకు తిరిగివెళ్తున్నారు. సరిగ్గా 6: 20 గంటలకు వీరు ప్రయాణిస్తున్న లారీ మసీదు గడ్డకు చేరుకుంది. ఈ సమయంలో ఎదురుగా వస్తున్న కారు లారీని ఢీకొట్టింది. కారును తప్పించే క్రమంలో లారీ డ్రైవర్ ఒక్కసారిగా వాహనాన్ని ఎడమవైపునకు తిప్పాడు. దీంతో అదుపుతప్పిన లారీ బోల్తాపడింది. ఇందులో ప్రయాణిస్తున్న ఒడిశాలోని బలాంగర్ జిల్లా చనవాహాల్ గ్రామానికి చెందిన కలాకుమార్ (25), గోపాల్దీప్ (45), కృపాసునా (40) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందారు. ఒడిశాకు చెందిన సహదేవ్ (45), ఛత్తీస్‌గఢ్‌కు చెందిన హక్తు (40), పరమానంద్ (50) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. గాయాలపాలైన క్రిష్ణ, మంచన్, సత్యపాల్దీప్, ముఖేష్, రవీంద్రసునాతోపాటు మరికొందరిని సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో చేర్పించారు. లాక్డౌన్ అనంతరం ఒడిశా నుంచి 50 మందికిపైగా కార్మికులు ఐదు నెలల క్రితం నర్కూడలోని ఇటుకబట్టీల్లో పని చేసేందుకు వచ్చారు. మద్యం మత్తులోనేనా...! ప్రమాదానికి కారణమైన కారులో బెలూన్లు తెరుచుకోవడంతో ఇందులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి గాయాలు కాలేదు. వీరిలో కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న నర్సింహ, గిరితోపాటు మరో వ్యక్తి ఉన్నట్లు సమాచారం. వీరు సమీపంలోనే ఉన్న సదరన్ వెంచర్లో మద్యం తాగి శంషాబాద్‌కు తిరిగి వస్తున్నట్లు సమాచారం. వీరు మద్యం మత్తులో అతివేగంగా కారు నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు ఈ వివరాలను వెల్లడించడం లేదు. తీరని విషాదం.. సాయంత్రం 6.20 గంటలకు ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న స్థానికులు, రహదారి గుండా వెళ్లే ప్రజలు చొరవ తీసుకుని బాధితులకు సాయం అందించారు. పోలీసులు, 108కు సమాచారం అందించినా వెంటనే స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. 7.10 గంటల సమయంలో ఘటనాస్థలికి చేరుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది క్షతగాత్రులను తరలించారు. అప్పటికే స్థానికులు కొంతమందిని ప్రైవేటు ఆటోల్లో ఆస్పత్రులకు తరలించారు. రోడ్డుపై పడిపోయిన లారీని తొలగించడానికి చాలా సమయం పట్టింది. లారీ కింద ఇరుక్కుపోయిన కలాకుమార్ మృతదేహాన్ని వెలికి తీసేందుకు రెండు గంటల సమయం పట్టింది. కలాకుమార్ మృతదేహాన్ని పట్టుకుని అతడి భార్య గుండెలవిసేలా రోదించింది. మృతిచెందిన వారు ముగ్గురూ వివాహితులే. ఘటనా స్థలం వద్ద మృతుల భార్యలు, పిల్లల రోదనలు అందరినీ కలచివేశాయి. మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. నా కళ్లముందే..: కలాకన్ సునా, ప్రత్యక్ష సాక్షి మొత్తం 30 మందిమి సరుకులు తీసుకుని వెళుతున్నాం. కారు స్పీడుగా వచ్చి లారీని ఢీకొట్టింది. నా కళ్లముందే నా తమ్ముడు కలాకుమార్ సునా కూడా లారీ కింద నలిగిపోయి చనిపోయిండు. బతుకు దెరువు కోసం బలాంగర్ జిల్లా చనవాహాల్ నుంచి ఇక్కడి వచ్చినం. మంత్రి సబిత దిగ్భ్రాంతి లారీ ప్రమాదంలో ఆరుగురు వలస కూలీలు మృతిచెందిన ఘటనపై మంత్రి సబితాఇంద్రారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. విషయం తెలిసిన వెంటనే సైబరాబాద్ సీపీ సజ్జనార్‌తో మాట్లాడి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ అమయ్ కుమార్‌కు ఫోన్ చేసి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి, మెరుగైన వైద్యం అందేలా చూడాలని తెలిపారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ప్రమాదకరంగా శంషాబాద్–షాబాద్ రహదారి శంషాబాద్ రూరల్: రోడ్డుపై వాహనాల రద్దీ.. మితిమీరిన వేగం.. ట్రాఫిక్ నిబంధనల బేఖాతరు వలస కూలీల ప్రాణాలను బలిగొన్నాయి. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని శంషాబాద్– షాబాద్ రోడ్డుపై ట్రాఫిక్ పెరిగిపోయింది. రెండు లైన్ల దారిగా ఉన్న ఈ మార్గంలో వాహనాలు మితిమీరిన వేగంతో దూసుకెళ్తున్నాయి. పైగా దుర్ఘటన జరిగిన ప్రదేశం ఎత్తుగా ఉండడంతో ఇక్కడ తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ మార్గంలో కవ్వగూడ వెళ్లే మార్గం వద్ద మిషన్ భగీరథ పైపులైన్ కోసం తవ్విన కాలువను పూడ్చి వేయగా.. అక్కడ గుంతలు పడ్డాయి. అధికారులు పట్టించుకోకపోవడంతో రోడ్డుపై ఓ వైపు సిమెంటుతో గుంతను పూడ్చివేయగా.. అది కాస్త ఎత్తుగా మారింది. దీంతో శంషాబాద్ నుంచి షాబాద్ వెళ్లే వాహనదారులు ఇక్కడికి రాగానే కుడి వైపు నుంచి ప్రయాణం సాగిస్తున్నారు. ఈ సమయంలో ఎదురుగా వచ్చే వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ మార్గంలో రాళ్లగూడ నుంచి రహదారి పూర్తిగా చీకటిగా ఉంటుంది. అమ్మపల్లి, నర్కూడ సమీపంలో ఉన్న మూల మలుపులు ప్రమాదకరంగా ఉన్నాయి. లారీల్లో జనం తరలింపు.. నిబంధనలకు విరుద్ధంగా జనాలను లారీల్లో తరలిస్తున్నారు. మండల పరిధిలోని సుల్తాన్‌పల్లి, కవ్వగూడ, నర్కూడ శివారుల్లో పదికి పైగా ఇటుక బట్టీలున్నాయి. ఇందులో వందల కుటుంబాలు పని చేస్తున్నాయి. వీరంతా సరుకులు, కూరగాయల కోసం ప్రతీ ఆది, గురువారాల్లో శంషాబాద్ వస్తుంటారు. ఇందుకోసం బట్టీల నిర్వాహకులు కూలీలను లారీల్లోనే పంపిస్తుంటారు. నిబంధనలకు విరుద్ధంగా ఇలా కూలీలను లారీల్లో తరలిస్తుండటంతో ప్రమాదాల సమయంలో వారి ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ఈ మార్గంలో ఆటోల్లో సైతం పరిమితికి మించిన ప్రయాణికులతో అతివేగంతో తిరుగుతుంటాయి. -
ఐదుగురు స్నేహితులను కబళించిన ప్రమాదం
అందరూ మంచి స్నేహితులు.. అందులో ఓ మిత్రుడి సోదరుడి పుట్టిన రోజు వేడుకలకు హాజరయ్యారు. ఆనందంగా కార్యక్రమం ముగించుకున్నాక ఒక మిత్రుడిని స్వస్థలంలో దింపడానికి కారులో బయలుదేరారు. అప్పుడే తెల్లవారుతోంది. మసక మసక చీకటికి తోడు నిద్ర ఆవహించే సమయమది. జాతీయ రహదారిపై వేగంగా దూసుకెళ్తున్న వాహనాలు. కనులు తెరుస్తూ మూస్తూ డ్రైవింగ్ చేస్తున్నారు వాహనదారులు. ఈ క్రమంలో వేగంగా దూసుకొచ్చిన ఇసుక లారీ కారును ఢీకొనడంతో భారీ శబ్దం. తేరుకునేలోపే అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు యువకులు విగతజీవులుగా మారారు. సాక్షి, దామెర(వరంగల్) : మిత్రుడి సోదరుడి పుట్టిన రోజు వేడుకలకు హాజరైన స్నేహితులను మృత్యురూపంలో వచ్చిన ఇసుక లారీ పొట్టన పెట్టుకుంది. గమ్యం చేరకముందే కారులో అందరూ విగతజీవులుగా మారారు. వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలం పసరగొండ క్రాస్ రోడ్డు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో వరంగల్ అర్బన్ జిల్లా పెద్దమ్మగడ్డకు చెందిన కండె జయప్రకాష్(23), పోచమ్మమైదాన్‌కు చెందిన మేకల రాకేష్(23), హసన్పర్తికి చెందిన గజవెల్లి రోహిత్(20), ములుగుకు చెందిన కొండబోయిన నరేష్(23), వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటకు చెందిన షేక్ షాబీర్(19) మృత్యువాత పడ్డారు. మృతుల్లో అందరూ పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారే కావడం గమనార్హం. వివరాలు.. పోలీసులు, మృతుల బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. గజవెల్లి రోహిత్(20), కండె జయప్రకాష్(23), షేక్ సాబీర్(19), మేకల రాకేష్(23) వీరంతా నగరంలోని పలు ప్రాంతాల్లో నివసిస్తుండగా కొండవేన నరేష్(23) మాత్రం ములుగుకు చెందిన వాడు. జయప్రకాష్ నగరంలోని ఓ కళాశాలలో డిగ్రీ చదువుతుండా మిగతావారంతా ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. మేకల రాకేష్ బంధువైన మేకల ప్రవీణ్ పుట్టిన రోజు వేడుకల కోసం మంగళవారం అర్ధరాత్రి అందరూ కలుసుకుని కేక్ కట్ చేసిన అనంతరం విందు చేసుకున్నారు. అనంతరం బుధవారం తెల్లవారుజామున నరేష్‌ను ములుగులో దింపడానికి కారులో బయలు దేరారు. ఈ క్రమంలో దామెర మండలంలోని పసరగొండ క్రాస్ వద్దకు రాగానే కారు మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేస్తున్న క్రమంలో ఎదురుగా వచ్చిన ఇసుక లారీ ఢీ కొట్టింది. కారు నుజ్జునుజ్జు కావడమే కాకుండా అందులోని వారంతా విగతజీవులుగా మారారు. విషయం తెలియగానే సంఘటనా స్థలాన్ని పరకాల ఏసీపీ శ్రీనివాస్, ఆత్మకూరు, శాయంపేట సీఐలు వెంకటేశ్వర్రావు, రంజిత్ కుమార్, ఎస్సై భాస్కర్ రెడ్డి, రాజబాబులు చేరుకొని కారులో ఇరుక్కుపోయిన మృత దేహాలను బయటికి తీసి మార్చురీకి తరలించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. మేకల చంద్రమౌళి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మిన్నంటిన బంధువుల రోదనలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువకులు కుటుంబాల సభ్యుల రోదలను మిన్నుముట్టాయి. మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎంకు తరలించగా బంధువులు పెద్ద ఎత్తున మార్చూరీకి చేరుకున్నారు. చేతికొచ్చిన చెట్టంత కొడుకులను పోగొట్టుకున్న తల్లిదండ్రులు, వారి స్నేహితుల బోరున విలపించారు. బైక్ పెట్టి కారు అద్దె..? జయప్రకాష్ అలియాస్ చందు తన బైక్‌ను హన్మకొండలోని హనుమాన్‌నగర్‌లో ఓ వడ్డీ వ్యాపారి వద్ద తనకా పెట్టి ఆ డబ్బుతో కారును అద్దెకు తీసుకుని వెళ్లినట్లు తెలుస్తోంది. అలాగే బైక్ రైడర్‌గా పేరున్న జయప్రకాష్ ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడని సమాచారం. ప్రైవేట్ కంపెనీలో.. మేకల రాకేష్... వరంగల్ : వరంగల్ పోచమ్మమైదాన్‌కు చెందిన మేకల చంద్రమౌళి, స్వరూప దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు రాకేష్ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఏడాది క్రితం మహేశ్వరీని ప్రేమించి పెళ్లి చేసుకోగా రెండు నెలల క్రితం పాప జన్మించింది. ఎదిగిన కొడుకు మృతి చెందడంతో కుటుంబం సభ్యులు విలపిస్తున్నారు. బేకరీలో పనిచేస్తూ.. షేక్‌సాబీర్.. నర్సంపేట రూరల్ : వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట పట్టణానికి చెందిన షేక్ యాకూబ్– నూర్జాన్ దంపతుల కుమారుడు సాబీర్(19). చిన్నతనంలో తండ్రి యాకూబ్ మృతిచెందాడు. సాబీర్ కొంతకాలంగా వరంగల్ పోచమ్మమైదాన్‌లోని ఒక బేకరీలో పనిచేస్తూ ఆటోనగర్‌లో అద్దెకు ఉంటున్నాడు. సాబీర్ తల్లి ఖానాపూర్ బీసీ హాస్టల్ వర్కర్‌గా పనిచేస్తోంది. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు విలిపస్తున్నారు. బైక్ రైడింగ్‌లో ఫేమస్..జయప్రకాష్ హన్మకొండ చౌరస్తా : హన్మకొండలోని పెద్దమ్మగడ్డకు చెందిన మేడి జయప్రకాష్(23) అలియాస్ చందు కమ్యూనిస్టు నాయకుడిగా పేరున్న నర్సయ్యకు ఒక్కేఒక్క కుమారుడు. దీంతో తల్లిదండ్రులు చిన్న నాటి నుంచి గారాబంగా పెంచారు. పాఠశాల విద్యతోనే చదువు మానేసిన జయప్రకాష్ చెడు అలవాట్లకు బానిసయ్యాడు. బైక్ రైడింగ్‌లో ఫేమస్ అయిన ఇతడు సినీ నటుడు పవన్ కళ్యాణ్ అభిమాని. అయితే ఈనెల 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడంతో మంగళవారం కాళేశ్వరానికి వెళ్లి అక్కడి నుంచి బొగత జలపాతం చేరుకుని పుట్టిన రోజు వేడుకుల జరుపుకున్నట్లు స్థానికంగా చర్చించుకుంటున్నారు. క్యాటరింగ్, డెకరేషన్ : రోహిత్ నయీంనగర్ : హన్మకొండ నయీంనగర్ లష్కర్ సింగారానికి చెందిన గజవల్లి రోహిత్(20) అలియాస్ కెన్ని స్వస్థలం హసన్‌పర్తి మండలం వంగపాడు గ్రామం. రోహిత్ తాత గజవల్లి శంభులింగం చిందు నాటకాలు చేసే వారు. రోహిత్ తండ్రి గజవల్లి యాదగిరి ఎల్లాపూర్‌లో పాస్టర్‌గా పని చేస్తున్నారు. ఏళ్ల క్రితమే శంభులింగం తన కుమారులతో హనుమకొండ లష్కర్ సింగారానికి వచ్చి నివసిస్తున్నారు. రోహిత్ పదో తరగతి మధ్యలోనే మానేసి క్యాటరింగ్, డెకరేషన్ పనులు చేస్తున్నాడు. పనిచేసే చోట పరిచయమైన వారితో కలసి వెళ్లి మృత్యువాత పడ్డారని కుటుంబ సభ్యులు రోదిస్తూ తెలిపారు. కొండవేన నరేష్.. ములుగు రూరల్: ములుగుకు చెందిన కొండవేన సరోజన–సాంబయ్య దంపతుల కుమారుడు నరేష్. అతడి తండ్రి 20 ఏళ్ల క్రితమే అనారోగ్యంతో మృతి చెందాడు. నరేష్ కొంతకాలం హైదరాబాద్‌లో పని చేసుకుంటూ జీవనం కొనసాగించి.. కొంత కాలంగా ములుగులో ఉంటున్నాడు. ప్రాణాలు దక్కించుకున్న ప్రవీణ్ మేకల ప్రవీణ్ పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న అనంతరం ప్రవీణ్ కూడా కారులో వెళ్లాల్సి ఉంది. అయితే కారులో ఐదుగురే కూర్చునే వీలుండడంతో ప్రవీణ్ ఇంటి వద్దే ఉండిపోయాడు. దీంతో అతను ప్రాణాలతో బయటపడ్డాడు. అప్పటి వరకు తనతో ఆనందంగా ఉన్న మిత్రులందరూ ఒక్కసారిగా విగత జీవులుగా మారడంతో ప్రవీణ్ బోరున విలపించాడు. అతి వేగం కూడా కారణమే.. కారు అతి వేగం కూడా ప్రమాదానికి కారణమని పోలీసులు చెపుతున్నారు. కారులో ఉన్న వారు సీట్ బెల్టులు పెట్టుకొని ప్రయాణిస్తున్నా బెలూన్లు తెరుచుకుని అవి పూర్తిగా పగిలి పోయాయని తెలిపారు. కారు వేగంగా వెళ్లకుంటే ప్రాణాలు దక్కేవని పేర్కొంటున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన డీసీపీ పసరగొండ క్రాస్ వద్ద బుధవారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ఇన్చార్జి డీసీపీ వెంకటలక్ష్మి మధ్యాహ్నం పరిశీలించారు. ఘటన జరగడానికి గల కారణాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆమె వెంట ఏసీపీ శ్రీనివాస్, శాయంపేట్, ఆత్మకూర్ సీఐలు వెంకటేశ్వర్ రావు, రంజిత్ కుమార్, ఎస్సైలు భాస్కర్‌రెడ్డి, రాజబాబు ఉన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి..ఐదుగురికి గాయాలు
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా : వాంఖిడి మండల కేంద్రంలోని ఆర్టీఏ చెక్‌పోస్టు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వెనుక నుంచి కారును లారీ ఢీకొనడంతో ముందున్న లారీలోకి కారు చొచ్చుకుపోయింది. ఈ ఘటనలో కారులో ఉన్న మహారాష్ట్రలోని గోంద్యాకు చెందిన గోల్గామ్ వార్ రాములు (60) మృతి చెందగా..మరో ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసిఫాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
కారు, లారీ ఢీకొని దంపతుల మృతి
గోపాలపురం: పశ్చిమగోదావరి జిల్లా దేవరాపల్లి మండలం కృష్ణంపాలెం వద్ద ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... కృష్ణంపాలెం గ్రామంలోని స్పీడ్ బ్రేకర్ దాటిన వెంటనే ఓ లారీ డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. దీంతో వెనుకనే వస్తున్న కారు దాన్ని బలంగా ఢీకొంది. కారులో ముందు భాగంలో ఉన్న దంపతులు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. వెనుక సీట్లో ఉన్న వారి ఇద్దరు పిల్లలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వీరంతా రాజమండ్రి నగరానికి చెందిన వారని తెలుస్తోంది.