బాధిత కుటుంబాల నుంచి వివరాలు సేకరిస్తున్న పోలీసులు
శంషాబాద్: శంషాబాద్‌లో వలస కార్మికులను బలి తీసుకున్న రోడ్డు ప్రమాదం డ్రైవర్ల నిర్లక్ష్యంతోనే జరిగింది. కారును అతి వేగంగా నడపడం ఓ కారణమైతే ఇటుకలు రవాణా చేసే లారీలో జనాలను తరలించడం మరో కారణం. ప్రమాద సమయంలో లారీలో డ్రైవర్ బంగ్యానాయక్‌తోపాటు మొత్తం 30 మంది ప్రయాణిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆదివారం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. తీవ్రంగా గాయాలైన వారిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా, ఒడిశా రాష్ట్రానికి చెందిన బుదాన్ (25) చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందాడు. దీంతో ఈ ఘటనలో మృతిచెందిన వారి సంఖ్య ఏడుగుకు పెరిగింది. మరో మహిళ ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతోంది.
కారు నడిపిందెవరు?
కారులో మాదాపూర్ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న గిరిప్రసాద్‌తో పాటు హోంగార్డు సంగమేశ్వర్, మండలంలోని ఊట్‌పల్లికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మల్లేష్ ఉన్నారు. ఆదివారం ఉదయం యాదాద్రి వెళ్లి తిరుగు ప్రయాణంలో మద్యం తాగారు. సాయంత్రం ఊట్‌పల్లి సమీపంలోని సదరన్ వెంచర్‌లో మరోసారి మద్యం తాగి రాళ్లగూడ వైపు వెళుతుండగా అదే సమయంలో నర్కూడ వైపు వెళుతున్న లారీని షాబాద్ రహదారిలోని మసీదు గడ్డ వద్ద వేగంగా ఢీకొట్టారు. దీంతో లారీ అదుపు తప్పడంతో ఘోరప్రమాదం జరిగింది. ప్రమాదం సంభవించినపుడు కారులో బెలూన్‌లు తెరుచుకోవడంతో సురక్షితంగా బయటపడ్డ ముగ్గురు అక్కడి నుంచి పరారయ్యారు.
మొదట మల్లేష్‌ను, తర్వాత గిరిప్రసాద్, సంగమేశ్వర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారికి డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించగా సంగమేశ్వర్ మినహా మిగతా ఇద్దరూ మద్యం తాగినట్లు నిర్ధారణ అయింది. మద్యం సేవించని సంగమేశ్వర్ డ్రైవింగ్ చేసినట్లు పోలీసులు చెబుతున్నా ఆ సమయంలో గిరిప్రసాద్ కారు నడిపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఈ కారుపై అతివేగంగా నడిపినట్లు ఈ చలాన్ కూడా జారీ అయింది. కారులో లభ్యమైన ఓ మద్యం సీసాను వేలిముద్రల పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపారు. డ్రంకెన్ డ్రైవ్ పరీక్షల్లో లారీ డ్రైవర్ మద్యం తాగనట్లు తేల్చారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసిన కారు డ్రైవర్‌తోపాటు లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆర్‌జీఐఏ సీఐ విజయ్‌కుమార్ తెలిపారు.
కేసులు పటిష్టం.. ప్రమాదాలు షరామామూలే
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాల కేసులను తీవ్రంగా పరిగణిస్తూ కేసుల దర్యాప్తు చేపడుతున్నారు. రెండు నెలలుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న కేసుల్లో సంబంధిత ఎస్సై, సీఐతో పాటు ఏసీపీ, ట్రాఫిక్ సీఐ, మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్, సంబంధిత రోడ్డు విభాగం ఇంజనీర్‌లు దర్యాప్తులో భాగమవుతున్నారు. ప్రమాదాలు జరిగిన తర్వాత అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్న పోలీసులు రోడ్డుపైకి అధిక లోడుతో వస్తున్న వాహనాలు, గూడ్స్ వాహనాల్లో ప్రజలను తరలిస్తున్న తీరుపై మాత్రం ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులు పట్టించుకోకపోవడంతోనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment