తాజాగా.. జగిత్యాల జిల్లాలోని కొండగట్టు సమీపంలో మంగళవారం ఆర్టీసీ బస్సు లోయలో పడిన ఘటనలో సుమారు 50 మంది మరణించారు. సోమవారం హైదరాబాద్‌లో గచ్చిబౌలి బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సు ముగ్గురు ప్రాణాలను బలితీసుకుంది. ఈ నేపథ్యంలో రోడ్డెక్కాలంటే జనం బెంబేలెత్తుతున్నారు. వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాలను గత ఏడాదితో పోలిస్తే 26 శాతం తగ్గించామని అధికారులు చెబుతున్నప్పటికీ.. నిత్యం ఏదో ఒకచోట ప్రమాదం జరుగుతూనే ఉండడం ఆందోళనకు గురిచేస్తోంది.
ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా హన్మకొండ అశోకా జంక్షన్‌లో ఆగస్టు 19న రెండు నిండు ప్రాణాలు బలయ్యాయి. హన్మకొండ చౌరస్తా నుంచి అశోక్ జంక్షన్‌కు వస్తున్న పాపని సరిత(32), ఆమె కుమారుడు రిత్విక్ హన్మకొండ చౌరస్తా నుంచి ప్రీ లెఫ్ట్‌లో నడిచి వస్తున్నారు. వారు నడిచే దారిలో ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు రాకూడదు. కానీ నిబంధనలకు విరుద్ధంగా ఆర్టీసీ బస్సు ప్రీ లెఫ్ట్‌లోకి ప్రవేశించి రెండు ప్రాణాలను బలితీసుకుంది. ఈ ఘటనలో డ్రైవర్ తప్పు నూటికి నూరు పాళ్లు ఉంది. ఈ ప్రమాదం జరిగిన తర్వాత పోలీసు అధికారులు పెట్రోల్ పంపు నుంచి వచ్చే వాహనాలకు ప్రత్యేక దారి ఏర్పాటు చేసి హన్మకొండ నుంచి వచ్చే ప్రీ లెఫ్ట్‌లోకి వాహనాలు రాకుండా బారికేడ్లను ఏర్పాటు చే శారు. ఇదే పని ముందు చేసి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదు. అధికారులు, డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా జరిగిన ప్రమాదంలో రెండు ప్రాణాలను పోగొట్టుకోవాల్సి వచ్చింది.
వరంగల్ క్రైం: ప్రజలు రోడ్డెక్కాలంటే భయపడుతున్నారు. మృత్యువు ఎటువైపు నుంచి ముంచుకొస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. బస్సు, లారీ, డీసీఎం తదితర భారీ వాహనాలు నడిపే డ్రైవర్ల నిర్లక్ష్యంతో ద్విచక్రవాహన దారులు, పాదచారుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. రహదారులు రక్తసిక్తమవుతున్నాయి. ఇంట్లో నుంచి బయటికి వెళ్లినవారు తిరిగొచ్చేవరకు గ్యారంటీ లేకుండా పోయింది. జగిత్యాల జిల్లాలోని కొండగట్టు సమీపంలో మంగళవారం ఆర్టీసీ బస్సు లోయలో పడిన ఘటనలో సుమారు 50 మంది మరణించారు. సోమవారం హైదరాబాద్‌లో గచ్చిబౌలి బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సు ముగ్గురు ప్రాణాలను బలితీసుకుంది.
రాష్ట్రంలో ఇటీవల రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వాహనాల అతివేగం ప్రాణాలను బలితీసుకుంటోంది. మార్కెట్‌లోకి విడుదలవుతున్న కార్లు, బైక్‌ల వేగం కంట్రోల్ కావడం లేదు. ఆనందం కోసం వేగంగా వాహనాలను నడిపితే.. అదే వేగం ప్రాణాలు హరిస్తోంది. వరంగల్ పోలీ సు కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాలను గత ఏడాదితో పోలిస్తే 26 శాతం తగ్గించామని అధికారులు చెబుతున్నప్పటికీ నిత్యం ఏదో ఒకచోట ప్రమాదం జరగడం.. ప్రాణాలు పోవడం మనం చూస్తూనే ఉన్నాం.
కుటుంబాన్ని మింగేసిన రోడ్డు ప్రమాదం..
హన్మకొండ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ మనుగొండ సరిత నాలుగు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో కొడుకును కోల్పోయింది. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన ఆమె తన కూతురితో కలిసి ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. రోడ్డు ప్రమాదం మిగిల్చిన విషాదం చివరికి ఇలా ఇద్దరి ఆత్మహత్యకు కారణమైంది.
పోలీస్ కమిషనరేట్ పరిధిలో 274 మరణాలు
వరంగల్ పోలీసు కమిషనరేట్‌లో 2018 జనవరి నుంచి ఆగస్టు వరకు వివిధ ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో సుమారు 274 మంది మృతిచెందగా, మరో 1,193 మందికి గాయాలైనట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. దీనిని బట్టి కమిషనరేట్‌లో ప్రమాదాల తీవ్రత అర్థమవుతోంది. కమిషనరేట్‌లో ఒక మామునూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని వరంగల్–ఖమ్మం 563 హైవేపై 2016లో 15 మంది మరణించగా 20 మందికి గాయాలయ్యాయి. 2017లో 14 మంది మరణించగా 17 మందికి గాయాలయ్యయి. 2018లో ఇప్పటి వరకు ఈ రవహదారిపై ఐదుగురు మరణించగా 8 మందికి గాయాలయ్యాయి. ఒక పోలీస్ స్టేషన్ పరిధిలోనే పరిస్థితి ఈ విధంగా ఉంటే మిగతా ప్రాంతాల్లో పరిస్థితిని ఊహించవచ్చు.
శాఖల మధ్య సమన్వయ లోపం...
రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు సంఘటన స్థలాలకు చేరుకుని చేరుకోని తుతూ మంత్రంగా నివేదికలు సమర్పిస్తున్నారు. కానీ ప్రమాదాలకుగల కారణాలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రోడ్డు యాక్సిడెంట్ అనాలసిస్ గ్రూప్(రాగ్)లో పోలీసు శాఖ, ఆర్‌టీఏ, రవాణాశాఖ, ఆర్ అండ్ బీ, పంచాయతిరాజ్ శాఖలు ఉన్నాయి. పెద్ద ప్రమాదాలు జరిగిన తర్వాత ఈ శాఖల అధికారులు ప్రమాదాలకు గల కారణాలపై నివేదికలు రూపొందిస్తున్నారు. కానీ అవి కాగితాలకే పరిమితమవుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. తూతూమంత్రంగా అక్కడక్కడ చిన్నచిన్న సైన్ బోర్డులు ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంటున్నారు.
భద్రత లేని ఆర్టీసీ బస్సులు...
ఒకప్పుడు సురక్షిత ప్రయాణానికి కేరాఫ్‌గా నిలిచిన ఆర్టీసీ బస్సులు ఇటీవల మృత్యుశకటాలుగా మారుతున్నాయి. హన్మకొండ నయీంనగర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో వంగపహాడ్‌కు చెందిన ఒక ఏఎన్‌ఎం ప్రాణాలు కోల్పోయింది. హన్మకొండ పోలీసు స్టేషన్ సమీపంలోని అశోకా జంక్షన్‌లో ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యానికి తల్లి, కుమారుడు బలయ్యారు. ఆర్టీసీలాంటి సంస్థల్లో డ్రైవర్లకు పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చిన తర్వాతే రోడ్డుపైకి పంపుతారు. కానీ కొందరు డ్రైవర్లు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించి అమాయకుల ప్రాణాలు తీస్తున్నారనే విమర్శలు ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్నాయి.
భారీ వాహనాలతో భద్రత కరువు..
రోడ్డు ప్రమాదాల్లో అధికంగా డ్రైవర్ల అతివేగం, వారు మద్యం తాగి నడపడం, నిద్రలేమి వల్లే జరుగుతున్నాయి. నగరంలో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలను విరివిగా నిర్వహించడంతో మద్యం తాగి వాహనాలు నడపాలంటే కొంత భయపడుతున్నారు. కానీ భారీ వాహనాలు(బస్సులు, లారీలు, కంటైనర్లు) నడిపే వారికి బ్రీత్ ఎన్‌లైజర్ పరీక్షలు నిర్వహించడం లేదు. దీంతో కొంతమంది మద్యం మత్తులో వాహనాలను నడిపి ప్రమాదాలకు కారణమవుతున్నారనే విమర్శలు ఉన్నాయి. పోలీసు ఉన్నతాధికారులు భారీ వాహనాలను నడిపే డ్రైవర్లకు కూడా పరీక్షలు నిర్వహించాలని పలువురు కోరుతున్నారు.
పని ఒత్తిడీ కారణమే
కొంతకాలంగా ఆర్టీసీలో నియామకాలు లేవు. ప్రస్తుతం ఉన్న సిబ్బందిపై పనిభారం పెరిగింది. ప్రయాణికులకు సరిపడా బస్సులు సైతం లేవు. కొన్ని రూట్ల బస్సుల్లో కెపాసిటీకి మించి ప్రయాణికులు ఎక్కుతున్నారు. సంస్థలో ఉన్న డ్రైవర్లతోనే పని చేయిస్తున్నారు. దీంతో అదనంగా పని భారం పెరుగుతోంది. పని భారం పెరగడంతో కూడా డ్రైవర్లు ఒత్తిడికి గురవుతున్నారు. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అధికారుల పర్యవేక్షణ కూడా పెరగాల్సిన అవసరం ఉంది. – చొల్లేటి కిరణ్, టీఎంయూ రీజినల్ అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment