నకిలీ నంబర్‌ ప్లేట్స్‌ | Duplicate Number Plates | Sakshi
Sakshi News home page

నకిలీ నంబర్‌ ప్లేట్స్‌

Published Thu, Aug 2 2018 1:12 PM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM

Duplicate Number Plates - Sakshi

పోలీసులు మంగళవారం సాయంత్రం పట్టుకున్న నంబర్‌ ప్లేట్లు మార్చిన లారీలు(ఫైల్‌)

ఇసుకను అదనంగా దోచుకు పోవడానికి లారీ ఓనర్లు కొత్త దందాకు తెరలేపారు. క్వారీల్లో సీరియల్‌ త్వరగా రావాలనే ఉద్దేశంతో నకిలీ నంబర్‌ ప్లేట్లను వినియోగిస్తున్నారు. మహదేవపూర్‌ పోలీసులు నంబర్‌ ప్లేట్లు మార్చిన మూడు లారీలను పట్టుకోవడంతో విషయం బయటపడింది. ఈ వ్యవహారం ఎప్పటినుంచో జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కాళేశ్వరం : కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ బ్యాక్‌వాటర్‌ నిల్వ ఉండటానికి సు మారు 55 కిలోమీటర్ల మేర ఇసుకను తోడేం దుకు రెండేళ్ల క్రితం ఇసుక క్వారీలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. కాటారం, మహదేవపూర్‌ మండలాల్లో 22 క్వారీలకు అనుమతివ్వగా ప్రస్తుతం సుమారు 14కు పైగా క్వారీల్లో ఇసుకను తోడి హైదరాబాద్‌కు తరలిస్తున్నారు.

వారం రోజులకు ఓ లారీకి సీరియల్‌..

క్వారీల నుంచి లారీల్లో ఇసుకను తీసుకెళ్లడానికి ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకోవాలి. తరువాత సంబంధిత క్వారీ పేరు, ఏరోజు ఇసుక లోడ్‌ అవుతుందో స్లాట్‌లో వివరాలతో కూడిన పత్రం ఇస్తారు. ఇలా చేయడం వల్ల ఒక నంబర్‌ లారీకి రెండో స్లాట్‌ బుక్‌ కావడా ని సుమారు వారం రోజులు పడుతోంది. దీంతో కొంత మంది త్వరగా సీరియల్‌ రావడం కోసం ఏకంగా నకిలీ నంబర్‌ ప్లేట్లను తయారు చేయించి లారీలకు తగిలిస్తున్నారు.

లారీలకు సంబం«ధించిన అసలు పత్రాలకు, చెసీ వివరాలు పూర్తి విరుద్ధంగా ఉంటున్నాయి. దీంతో పోలీసులు తనిఖీలు చేస్తున్న సందర్భంగా కొందరు దొరుకుతున్నారు. మరికొందరు పోలీసులకు దొరక్కుండా తప్పించుకుంటున్నట్లు సమాచారం. ఈ దందా కొంత కాలంగా నడుస్తున్నట్లు తెలిసింది. మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో పోలీసులు అడుగడుగునా తనిఖీలు, సోదాలు పకడ్బందీగా చేస్తున్నారు. వాహనాల రిజిస్ట్రేషన్‌ కాగితాలు, ఇన్సూరెన్స్‌ తదితర అంశాలను çపక్కాగా పరిశీలిస్తుండడంతో లారీల నంబర్‌ ప్లేట్ల బాగోతం మంగళవారం సాయంత్రం బయటపడింది. మూడు లారీలపై కేసు నమోదు చేసి సీజ్‌ చేశారు.

క్వారీల వద్ద కొరవడిన నిఘా..

ఇసుక క్వారీల్లోకి లారీల ఆన్‌లైన్‌ స్లాట్‌ బుకింగ్‌ చేసిన పత్రం తీసుకు వెళ్తారు. క్వారీలో ఉన్న టీఎస్‌ఎండీసీ సిబ్బంది ఆ స్లాట్‌ను ఆన్‌లైన్‌లో పరిశీలించాల్సి ఉంటుంది. లారీ, చెసీ నంబర్లు సరిపోలితేనే లోనికి పంపించాలి. కొంత మంది టీఎస్‌ఎండీసీ సిబ్బంది వీటిని పట్టించుకోవడం లేదనే ఆరోణలున్నాయి. మరి కొందరు డబ్బులకు ఆశపడి తేడా కనిపించినా వదిలేస్తున్నారని తెలిసింది. ఇదే అదునుగా లారీ యజమానులు నంబర్‌ ప్లేట్లు మార్పుచేసి దందా సాగిస్తున్నట్లు సమాచారం. టీఎస్‌ఎండీసీ అధికారుల అజమాయిషీ కొరవడడంతో యథేచ్ఛగా అక్రమ నంబర్‌ ప్లేట్ల వ్యవహారం కొనసాగుతోంది. 

ఆర్టీఏ తనిఖీలు శూన్యం..

కాళేశ్వరం నుంచి హైదరాబాద్‌కు నిత్యం వందల సంఖ్యలో ఇతర నంబర్‌ ప్లేట్లతో లారీలు తిరుగుతుంటే ఆర్టీఏ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. లారీలకు ఆర్జీఏ జారీ చేసిన నంబర్లు కాకుండా నంబర్‌ ప్లేట్లపై సొంతంగా రాసుకువస్తున్నట్లు తెలిసింది. ఈవిషయమైన మహదేవపూర్‌ టీస్‌ఎండీసీ ప్రాజెక్టు అధికారి జగన్మోహన్‌ను వివరణ కోరడానికి ప్రయత్నించగా అందుబాటులో లేరు.

అక్రమాలకు అడ్డుకట్ట వేస్తాం..

మహదేవపూర్‌ మండలంలో క్వారీల నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తే చట్ట పరమైన కేసులు నమోదు చేస్తాం. ఓవర్‌లోడు, నకిలీ నంబర్‌ ప్లేట్ల దందాలకు పాల్పడితే లారీలు సీజ్‌ చేస్తాం. ఇప్పటికే ఓవర్‌లోడు లారీలను పట్టుకొని మైనింగ్‌ అధికారులకు అప్పచెప్పాం. నంబర్‌ ప్లేట్లు మార్చి న మూడు లారీలను పట్టుకున్నాం. ఇసుక క్వారీ ల్లో అక్రమాలు జరగకుండా అడ్డుకట్ట వేస్తాం. 

– రంజీత్‌కుమార్, సీఐ, మహదేవపూర్‌ సర్కిల్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement