fake number plates
-
నకిలీ నంబర్ ప్లేట్‌తో కారులో చక్కర్లు!
మేడ్చల్: కారుకు నకిలీ నంబర్ ప్లేట్, నకిలీ ఆర్సీ సృష్టించడంతో పాటు దానికి పోలీస్ స్టిక్కర్ అతికించి లాక్డౌన్ సమయంలో యథేచ్ఛగా తిరుగుతున్న ఇద్దరిని కీసర పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... విశాఖపట్నానికి చెందిన బాలాజీ టాటా సఫారీ వాహనాన్ని అతడి మిత్రులు నాగారానికి చెందిన భరత్‌గౌడ్ (32), కుషాయిగూడకు చెందిన వెంకటేశ్వర్రావు (31) నాలుగు నెల క్రితం నగరానికి తెచ్చారు. దానికి 07 బీఎం 5555 అనే నకిలీ నంబర్ ప్లేటు ఏర్పాటు చేసిన వీరు పోలీసులమని చెప్పి టోల్ ప్లాజాల్లో టోల్ చెల్లించకుండా తిరుగుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కారును తనిఖీ చేయగా.. అందులో 2 మద్యం బాటిళ్లు, రూ14 వేల నగదు లభించింది. భరత్‌గౌడ్, వెంకటేశ్వర్లను విచారించగా.. కారు నంబర్ ప్లేటు, ఆర్సీ కూడా నకిలీదేనని తేలింది. దీంతో వారిని అరెస్టు చేసి కారును సీజ్ చేశారు. -
హైటెక్ మోసం
అమలాపురం టౌన్: అది ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని గోరక్‌పూర్ కేసీ జైన్ ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేటు హైటెక్ బస్సు.. అయితే ఇదే బస్సు ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్‌తో నకిలీ నంబరుతో మన రాష్ట్రంలో పన్ను ఎగవేస్తూ అక్రమ ట్రాన్స్పోర్ట్ చేస్తోంది. ఎదుర్లంక–హైదరాబాద్ మధ్య ట్రావెల్స్ నిర్వహిస్తోంది. అమలాపురం కలశం సెంటరులో గురువారం రాత్రి 9 గంటలకు ఈ నకిలీ నంబరుతో ఉన్న హైటెక్ బస్సు రోడ్డుపై నిలిపి ప్రయాణికులను ఎక్కించుకుంటున్న సమయంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కేవీ శివప్రసాద్ తన సిబ్బందితో ఆకస్మిక దాడి చేసి ఆ బస్సు రికార్డులను తనిఖీ చేశారు. బస్సు వాస్తవ రికార్డుల ప్రకారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం రిజి్రస్టేషన్ నంబర్ యూపీ 53 ఎఫ్టీ 3509గా ఆయన గుర్తించారు. అయితే ఇదే బస్సు ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ నంబరు ఏపీ07 టీజీ 0222ను పెట్టుకుని అక్రమ సర్వీస్ చేస్తున్నట్లు గమనించారు. ఏపీ రిజిస్ట్రేషన్‌తో ఉన్న ఇదే నంబరు గల హైటెక్ బస్సు కాకినాడ నుంచి రిజిస్ట్రేషన్ అయినట్లు కూడా శివప్రసాద్ గుర్తించారు. అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బస్సు మన రాష్ట్రానికి చెందిన వేరే హైటెక్ బస్సు నంబర్‌ను పెట్టుకుని కోనసీమలోని ఎదుర్లంక నుంచి హైదరాబాద్‌కు సర్వీసు నడుపుతోంది. ఎంవీఐ శివప్రసాద్ అమలాపురంలో బస్సును తనిఖీ చేసేసరికి అందులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. వేరే నంబరుతో అక్రమ రవాణా చేస్తున్నట్లు ఆధారాలతో గుర్తించిన ఆయన బస్సును తక్షణమే సీజ్ చేశారు. అంతే గాకుండా ఆ బస్సుకు చెందిన ఇద్దరు డ్రైవర్లను బైండోవర్ చేశారు. రికార్డులను స్వాదీ నం చేసుకున్నారు. అయితే ఏపీ నంబర్‌తో తిరుగుతున్నప్పటికీ ఎక్కడా టాక్స్ చెల్లించిన దాఖలాలు లేకపోవడంతో గవర్నమెంట్ టాక్స్ ఎగవేతకు ఉద్ధేశపూర్వకంగానే అనుమ తి లేకుండా సర్వీసు నడుతున్నట్లు అంచనాకు వచ్చారు. సీజ్ చేసిన హైటెట్ బస్సును స్థానిక ఆర్టీసీ డిపోకు తరలించారు. బస్సు డ్రైవర్లు ఇచ్చిన సమాచారంతో ఆ బస్సు యాజమాని పై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. -
ప్లేటు మారిస్తే.. ఫేట్ మారిపోద్ది!
సాక్షి, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు ఇటీవల చెక్‌పోస్టు ప్రాంతంలో ఓ ద్విచక్ర వాహనాన్ని ఆపారు. మహారాష్ట్ర రిజిస్ట్రేషన్‌తో ఉన్న దాని నంబర్ ప్లేట్ అత్యంత చిత్రంగా, నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో జరిమానా విధించారు. ఫ్యాన్సీ నంబర్ ప్లేట్‌గా పిలిచే ఈ ఉల్లంఘనతో పాటు అనేక రకాలైన వైలేషన్స్‌కు పాల్పడుతున్న వాళ్లు సిటీలో ఉన్నారు. తమ వాహనాల నంబర్ ప్లేట్లను వంచేస్తూ... కొంత మేర విరగ్గొట్టేస్తున్న... కొన్ని అంకెల్ని చెరిపేస్తూ ‘దూసుకుపోతున్నారు’. ఎన్ని ఉల్లంఘనలకు పాల్పడినా ఈ–చలాన్ పడకుండా ఉండేందుకు ఇలాంటి ఎత్తులు వేస్తున్నారు. వీరికి జరిమానాలతో సరిపెడుతున్న ట్రాఫిక్ విభాగం అధికారులు తీవ్రమైన ట్యాంపరింగ్ విషయంలో మాత్రం సీరియస్‌గా ఉంటున్నారు. తప్పుడు నంబర్ ప్లేట్లతో తిరుగుతున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారు. నిబంధనలు, సూచనలు ఇవే.. బైక్‌లు, తేలికపాటి వాహనాలు, కార్లకు తెల్లరంగు ప్లేటుపై నల్ల అక్షరాలతో నంబర్ ఉండాలి. కమర్షియల్, గూడ్స్ వాహనాలకు పసుపు రం గు ప్లేట్‌పై నల్ల అక్షరాలతో నంబర్ ఉండాలి. నంబర్‌ప్లేట్‌పై పేర్లు, బొమ్మలు, సందేశాలు నిషేధం. బోగస్ నంబర్ ప్లేట్లు కలిగి ఉంటే క్రిమినల్ కేసులు నమోదుతోపాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దుకు చర్యలు. వాహనచోదకులు ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (కనీసం జిరాక్సు ప్రతులైనా) లేదంటే స్మార్ట్‌ఫోన్‌లో ఆర్టీఏ యాప్‌లో కలిగి ఉండాలి. ద్విచక్ర, త్రిచక్ర వాహనాలకు నంబర్ ప్లేట్ 500X120, తేలికపాటి, ప్యాసింజర్ వాహనాలు 340X200 లేదా 500X120 మిల్లీ మీటర్లు, మీడియం, హెవీ కమర్షియల్ వాహనాలకు 340X200 మిల్లీ మీటర్ల సైజుల్లో ఉండాలి. రాజధానిలోనే అధికం.. వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ల విష యంలో ట్రాఫిక్ పోలీసులు సీరియస్ గా ఉంటున్నారు. రాష్ట్రంలో నంబర్ప్లేట్లు లేని వాహనాలపై జనవరి నుంచి జూన్ వరకు 1,28,621, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలోనే 1,06,692 కేసులు నమోదయ్యాయి. -
ఐ–20 పంజా
సాక్షి, సిటీబ్యూరో: నకిలీ నంబర్ ప్లేట్లు తగిలించిన తెల్లరంగు ఐ–20 కారులో సంచరిస్తూ నగరంలో వరుస నేరాలకు పాల్పడుతున్న ఘరానా అంతర్రాష్ట్ర దొంగల ముఠా పోలీసులకు చిక్కింది. ఈ ఏడాది జూన్‌లో కేవలం మూడు రోజుల వ్యవధిలోనే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో 16 నేరాలు చేసిన ఈ మీరట్ గ్యాంగ్ పోలీసులకు సవాల్ విసిరింది. మూడు కమిషనరేట్ల పోలీసులూ ఈ దొంగల కోసం ముమ్మరంగా వేట కొనసాగించారు. చివరికి ఎస్సార్‌నగర్ పోలీసులు నేరాలకు అసలు సూత్రదారులను పట్టుకుని వీరి అనుచరుల కోసం వేటాడుతున్నారు. అదుపులోకి తీసుకున్న వారిని వివిధకోణాల్లో ప్రశ్నిస్తున్న అధికారులు ఈ దొంగలు ఎత్తుకుపోయిన సొత్తు రికవరీ పైనా దృష్టి పెట్టారు. కారులో వచ్చి పట్టపగలే చోరీలు ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన ఈ గ్యాంగ్ లీడర్ పేరుమోసిన గజదొంగ. దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో పంజా విసిరే ఇతడిపై ఉత్తరాది పోలీసులు రూ.10 లక్షల రివార్డ్ ప్రకటించారు. ఈ ఏడాది జూన్‌లో హైదరాబాద్‌పై కన్నేసిన ప్రధాన సూత్రదారి నలుగురు ముఠా సభ్యులతో తెల్లరంగు ఐ–20 కారులో రంగంలోకి దిగాడు. తొలిసారి జూన్ 25న గుడిమల్కాపూర్ నవోదయకాలనీలో గుడి వెనుక ఉన్న తాళంవేసిన ఇంట్లోకి ప్రవేశించి పది తులాల బంగారం, రెండు కిలోల వెండి, రూ.లక్ష నగదు అపహరించుకుపోయాడు. ఆ రోజు కారు వద్ద ముగ్గురు కనిపించారని స్థానికుల ద్వారా పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరాల ద్వారా కారు గుర్తింపు ఈ గ్యాంగ్ తెల్లని ఐ–20 కారు వినియోగించినట్లు పోలీసులు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. చోరీకి ముందు ఆ కారు నాంపల్లి నుంచి ఆసిఫ్‌నగర్ వరకు దాదాపు నాలుగు కి.మీ. ప్రయాణించినట్లు రికార్డు ఉంది. నవోదయ కాలనీ కమ్యూనిటీ హాల్ ముందు కారును ఆపిన దొంగలు ఏడు నిమిషాలు అక్కడ తచ్చాడారు. అదే సమయంలో కారు నెంబర్ ప్లేట్ మార్చిన ఆనవాళ్లు రికార్డయ్యాయి. ఇక్కడ నుంచి రాజేంద్రనగర్ వెళ్లి అక్కడా చోరీ చేసిన గ్యాంగ్ ఆ తర్వాత రెండు రోజుల్లో (జూన్ 26, 27 తేదీల్లో) వనస్థలిపురం, మైలార్‌దేవ్‌పల్లి, నార్సింగి, మీర్పేట్ల్లో మొత్తం 16 ఇళ్లపై పంజా విసిరింది. తర్వాత రెండు రోజులూ (28, 29) చోరీలు నమోదు కాలేదు. మీర్పేట్ చోరీలో తస్కరించిన లాకర్‌ను ఎత్తుకుపోయిన ఈ గ్యాంగ్ బాలాపూర్‌లో పడేసింది. దీంతో వీరు ఆ మార్గంలో సిటీని వదిలి పారిపోయి ఉంటారని పోలీసులు అంచనా వేశారు. మీరట్ చెందినదిగా గుర్తించినా.. కరడుగట్టిన ఈ ముఠాను పట్టుకోవడానికి సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లకు చెందిన స్పెషల్ ఆపరేషన్ టీమ్స్ (ఎస్వోటీ) ముమ్మరంగా ప్రయత్నించాయి. ప్రధానంగా టోల్గేట్స్పై దృష్టి పెట్టిన పోలీసులు వివిధ ప్రాంతాల నుంచి వాటి రికార్డులు, సీసీ కెమెరాల ఫీడ్‌ను సేకరించి విశ్లేషించారు. ఈ నేపథ్యంలో అనుమానిత ఐ–20 కారు నిర్మల్.. మహారాష్ట్రలోని వార్దా, ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ మీదుగా ఢిల్లీ వెళ్లినట్లు గుర్తించారు. అన్ని కోణాల్లో ఆరా తీసిన పోలీసులు ఈ గ్యాంగ్ మీరట్‌కు చెందినదిగా తేల్చారు. ఉత్తరప్రదేశ్ వెళ్లిన అధికారులు అక్కడి స్పెషల్ టాస్క్‌ఫోర్స్ (ఎస్టీఎఫ్) సహకారం తీసుకుని దాదాపు నెల రోజుల పాటు గాలించినా పట్టుకోలేకపోయారు. ఎస్సార్‌నగర్ పోలీసులకు కలిసొచ్చినగతానుభవం మీరట్ నుంచి స్కార్పియో వాహనంలో వచ్చిన ఓ గ్యాంగ్ ఎస్సార్‌నగర్ తదితర ప్రాంతాల్లో పంజా విసిరింది. ఎస్సార్‌నగర్ ఠాణా పరిధిలో జరిగిన చోరీ కేసును అధ్యయనం చేసిన పోలీసులు దాదాపు 70 సీసీ కెమెరాల్లోని ఫీడ్‌ను పరిశీలించారు. దీంతోపాటు సాంకేతిక ఆధారాలను బట్టి మీరట్ గ్యాంగ్‌గా భావించి పట్టుకున్నారు. వీరిని గత ఏడాది జూన్ 15న నగరానికి తరలించి అరెస్టు చేశారు. ఈ అనుభవమే తాజా ఐ–20 గ్యాంగ్ చిక్కడానికి కారణమైంది. తాజా ముఠా కోసం రంగంలోకి దిగిన ఎస్సార్‌నగర్ పోలీసులు వారు నేరం చేసే తీరు, రోజులు తదితరాలను విశ్లేషించారు. దీనికి తోడు సాంకేతికంగానూ ముందుకు వెళ్లిన అధికారులు ఈ అంతరాష్ట్ర దొంగలు మరోసారి నేరం చేయడానికి సిటీకి వస్తున్నట్లు గుర్తించారు. కారు తీసుకుని రోడ్డు మార్గంలో కొందరు, రైలులో మరికొందరు వస్తున్నట్లు నిర్థారించారు. దీంతో వలపన్నిన పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దొంగలను ప్రస్తుతం ఓ రహస్య ప్రదేశంలో ఉంచి విచారిస్తున్నారు. -
నకిలీ నంబర్ ప్లేట్స్
ఇసుకను అదనంగా దోచుకు పోవడానికి లారీ ఓనర్లు కొత్త దందాకు తెరలేపారు. క్వారీల్లో సీరియల్ త్వరగా రావాలనే ఉద్దేశంతో నకిలీ నంబర్ ప్లేట్లను వినియోగిస్తున్నారు. మహదేవపూర్ పోలీసులు నంబర్ ప్లేట్లు మార్చిన మూడు లారీలను పట్టుకోవడంతో విషయం బయటపడింది. ఈ వ్యవహారం ఎప్పటినుంచో జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాళేశ్వరం : కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ బ్యాక్‌వాటర్ నిల్వ ఉండటానికి సు మారు 55 కిలోమీటర్ల మేర ఇసుకను తోడేం దుకు రెండేళ్ల క్రితం ఇసుక క్వారీలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. కాటారం, మహదేవపూర్ మండలాల్లో 22 క్వారీలకు అనుమతివ్వగా ప్రస్తుతం సుమారు 14కు పైగా క్వారీల్లో ఇసుకను తోడి హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. వారం రోజులకు ఓ లారీకి సీరియల్.. క్వారీల నుంచి లారీల్లో ఇసుకను తీసుకెళ్లడానికి ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోవాలి. తరువాత సంబంధిత క్వారీ పేరు, ఏరోజు ఇసుక లోడ్ అవుతుందో స్లాట్‌లో వివరాలతో కూడిన పత్రం ఇస్తారు. ఇలా చేయడం వల్ల ఒక నంబర్ లారీకి రెండో స్లాట్ బుక్ కావడా ని సుమారు వారం రోజులు పడుతోంది. దీంతో కొంత మంది త్వరగా సీరియల్ రావడం కోసం ఏకంగా నకిలీ నంబర్ ప్లేట్లను తయారు చేయించి లారీలకు తగిలిస్తున్నారు. లారీలకు సంబం«ధించిన అసలు పత్రాలకు, చెసీ వివరాలు పూర్తి విరుద్ధంగా ఉంటున్నాయి. దీంతో పోలీసులు తనిఖీలు చేస్తున్న సందర్భంగా కొందరు దొరుకుతున్నారు. మరికొందరు పోలీసులకు దొరక్కుండా తప్పించుకుంటున్నట్లు సమాచారం. ఈ దందా కొంత కాలంగా నడుస్తున్నట్లు తెలిసింది. మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో పోలీసులు అడుగడుగునా తనిఖీలు, సోదాలు పకడ్బందీగా చేస్తున్నారు. వాహనాల రిజిస్ట్రేషన్ కాగితాలు, ఇన్సూరెన్స్ తదితర అంశాలను çపక్కాగా పరిశీలిస్తుండడంతో లారీల నంబర్ ప్లేట్ల బాగోతం మంగళవారం సాయంత్రం బయటపడింది. మూడు లారీలపై కేసు నమోదు చేసి సీజ్ చేశారు. క్వారీల వద్ద కొరవడిన నిఘా.. ఇసుక క్వారీల్లోకి లారీల ఆన్లైన్ స్లాట్ బుకింగ్ చేసిన పత్రం తీసుకు వెళ్తారు. క్వారీలో ఉన్న టీఎస్ఎండీసీ సిబ్బంది ఆ స్లాట్‌ను ఆన్లైన్లో పరిశీలించాల్సి ఉంటుంది. లారీ, చెసీ నంబర్లు సరిపోలితేనే లోనికి పంపించాలి. కొంత మంది టీఎస్ఎండీసీ సిబ్బంది వీటిని పట్టించుకోవడం లేదనే ఆరోణలున్నాయి. మరి కొందరు డబ్బులకు ఆశపడి తేడా కనిపించినా వదిలేస్తున్నారని తెలిసింది. ఇదే అదునుగా లారీ యజమానులు నంబర్ ప్లేట్లు మార్పుచేసి దందా సాగిస్తున్నట్లు సమాచారం. టీఎస్ఎండీసీ అధికారుల అజమాయిషీ కొరవడడంతో యథేచ్ఛగా అక్రమ నంబర్ ప్లేట్ల వ్యవహారం కొనసాగుతోంది. ఆర్టీఏ తనిఖీలు శూన్యం.. కాళేశ్వరం నుంచి హైదరాబాద్‌కు నిత్యం వందల సంఖ్యలో ఇతర నంబర్ ప్లేట్లతో లారీలు తిరుగుతుంటే ఆర్టీఏ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. లారీలకు ఆర్జీఏ జారీ చేసిన నంబర్లు కాకుండా నంబర్ ప్లేట్లపై సొంతంగా రాసుకువస్తున్నట్లు తెలిసింది. ఈవిషయమైన మహదేవపూర్ టీస్‌ఎండీసీ ప్రాజెక్టు అధికారి జగన్మోహన్ను వివరణ కోరడానికి ప్రయత్నించగా అందుబాటులో లేరు. అక్రమాలకు అడ్డుకట్ట వేస్తాం.. మహదేవపూర్ మండలంలో క్వారీల నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తే చట్ట పరమైన కేసులు నమోదు చేస్తాం. ఓవర్‌లోడు, నకిలీ నంబర్ ప్లేట్ల దందాలకు పాల్పడితే లారీలు సీజ్ చేస్తాం. ఇప్పటికే ఓవర్‌లోడు లారీలను పట్టుకొని మైనింగ్ అధికారులకు అప్పచెప్పాం. నంబర్ ప్లేట్లు మార్చి న మూడు లారీలను పట్టుకున్నాం. ఇసుక క్వారీ ల్లో అక్రమాలు జరగకుండా అడ్డుకట్ట వేస్తాం. – రంజీత్‌కుమార్, సీఐ, మహదేవపూర్ సర్కిల్ -
నకిలీలపై కన్నెర్ర
నకిలీ ఐఎన్డీ నెంబర్ ప్లేట్ల వ్యవహారాన్ని మద్రాసు హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. వీటిని తయారు చేసి మార్కెట్లోకి పంపుతున్న సంస్థలపై కొరడా ఝుళిపించాలని పోలీసుల్ని ఆదేశించింది. ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా కార్యక్రమాల్ని విస్తృత పరచాలని ఉత్తర్వులు జారీ చేసింది. సాక్షి, చెన్నై: అన్ని రకాల వాహనాలకు ‘ఐఎన్డీ’ నెంబర్ ప్లేట్ల ఏర్పాటుకు కేంద్రం చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లుగా పిలిచే ఇవి రాష్ట్రంలో అప్పుడు హల్చల్ చే శాయి. ఇంత వరకు ఈ ప్లేట్ల తయారీకి సంబంధించి రాష్ట్రంలో ఎలాంటి ఒప్పందాలు జరగలేదు. అసలు, ఎలాంటి చర్యలు చేపట్టలేదు. అయితే, రాష్ట్రంలో అనేక వాహనాల్లో ఐఎన్డీ నెంబర్ ప్లేట్లు దర్శ నం ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఈ నకిలీ నెం బర్ ప్లేట్లను తయారు చేసి మార్కెట్లోకి పంపిన సంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ సైతం దాఖలు అయింది. ఈ నకిలీలపై కన్నెర్ర చేసిన మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్‌కౌల్, న్యాయమూర్తి సుందరేషన్లతో కూడిన బెంచ్ ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. చర్యలకు ఆదేశం : సోమవారం ఈ పిటిషన్ విచారణకు పోలీసు ఉన్నతాధికారులు వచ్చారు. ఏడీజీపీ రాజేంద్రన్ నేతృత్వంలో పోలీసు అధికారులు కోర్టుకు వచ్చిన వివరణ ఇచ్చుకున్నారు. ఈ నకిలీలను అరికట్టే విధంగా ముందుకు వెళుతున్నామని, వాహన దారులపై కేసులు సైతం నమోదు చేశామని పేర్కొన్నారు. అయితే, పోలీసుల వివరణను బెంచ్ పరిగణించ లేదు. చర్యలు తీసుకోవాల్సింది ప్రజల మీద కాదని, ఈ నకిలీలను మార్కెట్లోకి పంపుతున్న సంస్థలపై అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు. ఇంకా అమల్లోకి రాని నెంబర్ ప్లేట్లను తయారు చేస్తున్న సంస్థల్ని గుర్తించి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారో స్పష్టంచేయాలని ప్రశ్నించారు. చివరకు ప్రభుత్వం తరపున హాజరైన అడ్వకేట్ జనరల్ సోమయాజులు తన వాదన విన్పించారు. ఈ నకిలీపై చర్యలు కఠినం చేయడం లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటామని, ఇందుకు సమయం కేటాయించాలని విన్నవించారు. దీంతో తదుపరి విచారణను మార్చి 11కు వాయిదా వేశారు. అదే సమయంలో ఈ నకిలీలను ఉపయోగించకుండా ప్రజల్ని హెచ్చరించే విధంగా అవగాహన కల్పించాలని, ఈ నెంబర్ ప్లేట్ల గురించి ప్రజలకు పూర్తిగా విశదీకరించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే, నకిలీ ప్లేట్లను తయారు చేస్తున్న సంస్థలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారోనన్న విషయాన్ని ఆ రోజున కోర్టు ముందు ఉంచాలని ఉత్తర్వులు జారీచేశారు.