నకిలీలపై కన్నెర్ర
నకిలీ ఐఎన్‌డీ నెంబర్ ప్లేట్ల వ్యవహారాన్ని మద్రాసు హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. వీటిని తయారు చేసి మార్కెట్లోకి పంపుతున్న సంస్థలపై కొరడా ఝుళిపించాలని పోలీసుల్ని ఆదేశించింది. ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా కార్యక్రమాల్ని విస్తృత పరచాలని ఉత్తర్వులు జారీ చేసింది.
సాక్షి, చెన్నై: అన్ని రకాల వాహనాలకు ‘ఐఎన్‌డీ’ నెంబర్ ప్లేట్ల ఏర్పాటుకు కేంద్రం చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లుగా పిలిచే ఇవి రాష్ట్రంలో అప్పుడు హల్‌చల్ చే శాయి. ఇంత వరకు ఈ ప్లేట్ల తయారీకి సంబంధించి రాష్ట్రంలో ఎలాంటి ఒప్పందాలు జరగలేదు. అసలు, ఎలాంటి చర్యలు చేపట్టలేదు. అయితే, రాష్ట్రంలో అనేక వాహనాల్లో ఐఎన్‌డీ నెంబర్ ప్లేట్లు దర్శ నం ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఈ నకిలీ నెం బర్ ప్లేట్లను తయారు చేసి మార్కెట్లోకి పంపిన సంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ సైతం దాఖలు అయింది. ఈ నకిలీలపై కన్నెర్ర చేసిన మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్‌కౌల్, న్యాయమూర్తి సుందరేషన్‌లతో కూడిన బెంచ్ ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టింది.
చర్యలకు ఆదేశం : సోమవారం ఈ పిటిషన్ విచారణకు పోలీసు ఉన్నతాధికారులు వచ్చారు. ఏడీజీపీ రాజేంద్రన్ నేతృత్వంలో పోలీసు అధికారులు కోర్టుకు వచ్చిన వివరణ ఇచ్చుకున్నారు. ఈ నకిలీలను అరికట్టే విధంగా ముందుకు వెళుతున్నామని, వాహన దారులపై కేసులు సైతం నమోదు చేశామని పేర్కొన్నారు. అయితే, పోలీసుల వివరణను బెంచ్ పరిగణించ లేదు. చర్యలు తీసుకోవాల్సింది ప్రజల మీద కాదని, ఈ నకిలీలను మార్కెట్లోకి పంపుతున్న సంస్థలపై అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు. ఇంకా అమల్లోకి రాని నెంబర్ ప్లేట్లను తయారు చేస్తున్న సంస్థల్ని గుర్తించి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారో స్పష్టంచేయాలని ప్రశ్నించారు.
చివరకు ప్రభుత్వం తరపున హాజరైన అడ్వకేట్ జనరల్ సోమయాజులు తన వాదన విన్పించారు. ఈ నకిలీపై చర్యలు కఠినం చేయడం లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటామని, ఇందుకు సమయం కేటాయించాలని విన్నవించారు. దీంతో తదుపరి విచారణను మార్చి 11కు వాయిదా వేశారు. అదే సమయంలో ఈ నకిలీలను ఉపయోగించకుండా ప్రజల్ని హెచ్చరించే విధంగా అవగాహన కల్పించాలని, ఈ నెంబర్ ప్లేట్ల గురించి ప్రజలకు పూర్తిగా విశదీకరించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే, నకిలీ ప్లేట్లను తయారు చేస్తున్న సంస్థలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారోనన్న విషయాన్ని ఆ రోజున కోర్టు ముందు ఉంచాలని ఉత్తర్వులు జారీచేశారు.