
పెట్రోలు పోసి నిప్పటించడంతో దహనమవుతున్న ద్విచక్రవాహనం
నల్లబెల్లి జయశంకర్ జిల్లా : కుటుంబ కలహాలతో సవతి తల్లిపై కుమారుడు పెట్రోలు పోసి హత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మండల కేంద్రంలో మంగళవారం జరిగింది. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన బూర సాంబయ్య తన మొదటి భార్య 20 ఏళ్ల క్రితం చనిపోగా విజయను రెండో వివాహం చేసుకున్నాడు. మొదటి భార్య కుమారుడు రాజుకుమార్ బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వెళ్లి జీవనం సాగిస్తున్నాడు. రెండు రోజుల క్రితం రాజుకుమార్ ఇంటికి వచ్చాడు.
ఈ క్రమంలో ఇంటి కరెంట్ బిల్లు చెల్లింపు విషయంలో మంగళవారం కుటుంబంలో గొడవ జరగగా అతడు విజయ–సాంబయ్య దంపతులపై దాడి చేసి గాయపరిచాడు. కాగా వారు పోలీసులు ఆశ్రయించారు. దీంతో ఆగ్రహనికి గురైన రాజుకుమార్ ప్లాస్టిక్ బాటిల్‌లో పెట్రోలు తీసుకొచ్చి ఇంటి ముందున్న సవతితల్లిపై పోసి నిప్పంటిం చేందుకు యత్నించాడు. అప్రమత్తమైన ఆమె ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగెత్తింది. ఆగ్రహంతో ఊగిపోయిన రాజ్‌కుమార్ ఇంటి ఆవరణలో ఉన్న తండ్రి ద్విచక్రవాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించడంతో దహనమైంది. దీంతో బాధితులు మళ్లీ పోలీసులను ఆశ్రయించారు.