మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబీకులు, బంధువులు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. జనగామ జిల్లా తరిగొప్పుల మండలంలో అప్పుల బాధ భరించలేక రైతు ఆత్మహత్య చేసుకోగా మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో భార్య కాపురానికి రావడం లేదని ఒకరు, కురవి మండలంలో అవమానం భరించలేక ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు.
నర్సింహులపేట : మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని కౌంసల్యదేవిపల్లి గ్రామంలో భార్య కాపురానికి రాలేదనే మనస్తాపంతో బుధవారం ఎర్పుల నరేష్(36)అనే వ్యక్తి ఉరి వేసుకొని అత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై సంతోష్‌రావు కథనం ప్రకారం.. కౌంసల్యదేవిపల్లికి చెందిన నరేష్ గత 12 సంవత్సరాల క్రితం కరవి మండలానికి చెందిన సావిత్రతో వివాహం జరిగింది. వీరికి ఇద్దకు కుమారులున్నారు. గత రెండు సంవత్సరాల నుంచి భార్య కాపురానికి రాకుండా పుట్టింట్లోనే ఉంటోంది. దీంతో మనస్తాపానికి బుధవారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
అప్పుల బాధతో రైతు..
తరిగొప్పుల: అప్పుల బాధతో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన జనగామ జిల్లా తరిగొప్పుల మండల కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, స్థానిక ఎస్సై రాజేష్‌నాయక్ తెలిపిన వివరాల ప్రకారం... మండలకేంద్రానికి చెందిన సాయబోయిన మహేందర్(30) తన తండ్రి పేరు మీదున్న రెండు ఎకరాల వ్యవసాయ భూమిలో వ్యవసాయం, ఇటు హమాలీగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గతంలో తన ఇద్దరు అక్కల పెళ్లిళ్ల కోసం చేసిన అప్పు, పెట్టుబడికి తెచ్చిన అప్పు రూ. 3 లక్షలు ఎక్కువగా కావడంతో తీవ్ర మనస్తాపానికి గురై తన వ్యవసాయ క్షేత్రంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు 108లో జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందనట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య స్వరూప, ఇద్దరు కొడుకులు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.దొంగతనం మోపారని విద్యార్థి..కురవి(డోర్నకల్): ఊరి పెద్దలు దొంగతనం మోపడంతో అవమానం భరించలేక మనోవేదనకు గురైన ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్ప డిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలం చింతపల్లి శివారు దీరావత్ తండాలో జరిగింది.
మృతుడి తల్లి లక్ష్మి కథనం ప్రకారం.. తండాకు చెందిన మాలోత్ వంశీ(17) మరిపెడ బంగ్లాలోని ఓ ప్రైవేటు కాలేజిలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు. లక్ష్మి భర్త లక్‌పతి కొన్నేళ్ల క్రితం చనిపోగా ధీరావత్‌తండాలోని తన తల్లిగారింటికి వచ్చింది. అక్కడే ఉంటూ కుమారుడిని టెన్త్ వరకు చింతపల్లి హైస్కూల్‌లో చదివించింది. 15 రోజుల క్రితం చింతపల్లి గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు వంశీతోపాటు మరో నలుగురు జేసీబీలో బ్యాటరీ, డీజిల్ దొంగతనం చేశాడని సీరోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వంశీని పట్టుకెళ్లిన పోలీసులు దొంగతనంపై విచారణ చేపట్టగా మృతుడి తల్లి లక్ష్మి తండాలోని పెద్దల సహకారంతో స్టేషన్‌కు వెళ్లి కుమారుడిని విడిపించింది. 10 రోజుల క్రితం చోరీ విషయంలో పెద్దమనుషులు పంచాయితీ నిర్వహించి రూ.35 వేల జరిమానా విధించారు. వంశీతోపాటు మరో నలుగురికి ఒక్కొక్కరికి రూ.35 వేల చొప్పున చెల్లించాలని తీర్మానించారు. దీంతో మనస్తాపానికి గురైన వంశీ ఈ నెల 17న పురుగుల మందు తాగాడు. దీంతో వెంటనే మరిపెడకు, అక్కడి నుంచి ఖమ్మం ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలించగా చికిత్సపొందుతూ బుధవారం ఉదయం మృతిచెందాడు. చోరీ కేసులో ఇరికించి జరిమానా తీసుకున్న భూక్య సైదులు, మామిండ్ల వెంకన్నపై మృతుడి తల్లి లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మరిపెడ సీఐ శ్రీనివాస్ కేసు నమోదు చేశారు.
మాకే సంబంధం లేదు..
వంశీ మృతికి తమకు ఏమి సంబంధం లేదని భూక్య సైదులు, మామిండ్ల వెంకన్నలు తెలిపారు. గ్రామంలో గత కొన్ని నెలల క్రితం జేసీబీలోని డీజిల్, బ్యాటరీలు ఎత్తుకెళ్లినట్లు జేసీబీ డ్రైవర్ రవి జూన్ 29న సీరోలు పోలీసులకు ఫిర్యాదు చేశాడని, ఆ కేసులో కొందరిని పోలీసులు విచారణ చేశారన్నారు. తమపై కావాలని ఆరోపణలు చేస్తున్నారని వాపోయారు.
ఇద్దరిపై కేసు..
మాలోత్ వంశీ తల్లి లక్ష్మీ ఫిర్యాదు మేరకు చింతపల్లికి చెందిన భూక్య సైదులు, మామిండ్ల వెంకన్నలపై కేసు నమోదు చేసినట్లు మరిపెడ సీఐ శ్రీనివాస్ తెలిపారు. మృతదేహాన్ని శవ పంచనామా చేసి పోస్టుమార్టం నిమిత్తం మానుకోటకు తరలించినట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment